జై ఆంధ్రా ఉద్యమంలో మొదటి సారిగా కాల్పులు జరిపడంతో 18 మంది అమరులైన రోజు ఇది...

By Raju VS Nov. 21, 2020, 09:40 pm IST
జై ఆంధ్రా ఉద్యమంలో మొదటి సారిగా కాల్పులు జరిపడంతో 18 మంది అమరులైన రోజు ఇది...

తొలినాళ్లలో ప్రత్యేక తెలంగాణా ఉద్యమానికి పోటీగా ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం కూడా విస్తృతంగా సాగింది. 4 దశాబ్దాల క్రితం ఆంధ్రా, రాయలసీమ ప్రాంతాల్లో ఉధృతంగా సాగింది. యువత పెద్ద స్థాయిలో ఆందోళన చేశారు. దాంతో అనేక ప్రాంతాల్లో ప్రభుత్వం నిర్బంధం ప్రయోగించింది. పలు చోట్ల కాల్పులకు పాల్పడింది. వందల మంది ఈ ఉద్యమంలో అమరులయ్యారు. సుమారుగా 450 మంది మృతి చెందినట్టు ఆనాటి ఉద్యమకారులు చెబుతుంటారు.

అందులో సరిగ్గా నేటికీ 48 ఏళ్ల క్రితం ఉద్యమం ఉవ్వెత్తున లేచింది. దాంతో అనేక చోట్ల ఆందోళనకారులు నిరసనలు పెద్ద స్థాయిలో చేపట్టడంతో పోలీస్ బలగాలు కాల్పులకు పాల్పడ్డాయి. దాంతో ఆ ఉద్యమంలో నవంబర్ 21 1972 నాడు 18 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒంగోలులో 9 మంది, తెనాలిలో ఆరుగురు, ఆధోనిలో ఇద్దరు జై ఆంధ్ర ఉద్యమకారులు ప్రాణాలు విడిచారు. అయినప్పటికీ ఉద్యమం చల్లబడలేదు. కాల్పుల ఘటనతో వేడెక్కిన ఉద్యమం మరింత తీవ్రంగా మారింది. దాంతో రాష్ట్రంలోని శ్రీకాకుళం, విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి, గుంటూరు, విజయవాడ, తిరుపతి, అనంతపురం, కర్నూల్ పరిసర ప్రాంతాలలో ఉద్యమ కారుపలై నాటి ప్రభుత్వం తెగబడింది. అనేక మంది యువ కిశోరాలు కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోరుతూ వారంతా అమరులయ్యారు.

గౌతు లచ్చన్న, తెన్నేటి విశ్వనాధం, కాకాని వెంకటరత్నం వంటి అనేక మంది నాయకులు ఈ ఉద్యమంలో ముందు పీఠిన నిలిచారు. ప్రస్తు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వంటి నేతలు కూడా ఈ ఉద్యమంలో అరెస్టులయ్యి జైలు పాలయ్యారు. అ ఉద్యమం సందర్భంగా రాజమండ్రి లో వజ్జా సూర్యప్రకాష్ రావు అనే స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగి పోలీస్ తూటాలకు నేలకొరిగారు. ఆ మరుసటి రోజు 23 వ తేదీన విజయవాడలో 8మంది జై ఆంధ్రా అంటూ పోలీసు తూటాలకు బలయ్యారు.

జై ఆంధ్ర ఉద్యమం పట్ల ఆ నాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించింది. ప్రధాని ఇందిరా గాంధీ ఆదేశాలతో జై ఆంధ్రా ఉద్యమాన్ని అణచివేయటానికి ఆర్మీ దళాలను రంగంలో దింపారు. నిత్యం వీధులన్నీ రణరంగాన్ని తలపించేవి. రోజులు, నెలల తరబడి కర్ఫ్యూ అమలయ్యింది. వేల మందిని అరెస్ట్ చేసి జైళ్లలో నెట్టారు. నెలల తరబడి వారంతా కారాగార వాసం గడపాల్సి వచ్చింది. 1972-23 సంవత్సరాలలో ఈ ఉద్యమం కారణంగా రాష్ట్రం దాదాపుగా స్తంభించింది. ఆ తర్వాత రాజకీయగా పెను మార్పులు జరిగాయి. 1978 ఎన్నికల్లో అనేక మంది యువనేతలు తెరమీదకు రావడానికి కారణమయ్యింది. అప్పటి వరకూ చక్రం తిప్పుతున్న కొందరు నేతలు జై ఆంధ్ర ఉద్యమం కారణంగా ప్రాభవం కోల్పోవడంతో కొత్త తరం తెరమీదకు వచ్చింది.

ముల్కి విధానాలకు వ్యతిరేకంగా ఆనాడు జై ఆంధ్రా ఉద్యమం తక్కువ సమయంలోనే రాష్ట్రం నలుమూలలకు విస్తరించింది. ఆనాడు స్వచ్చందంగా ఉద్యమంలోకి ప్రజలు రోడ్డెక్కి జై ఆంధ్రా నినాదాన్ని బల పరిచారు. జన జీవనం స్తంభించిపోయింది. బస్సులు, రైళ్లు, విమాన సర్వీసులు పూర్తిగా నిలిచి పోయాయి. విధ్యుత్ సరఫరాకి కూడా అంతరాయం ఏర్పడింది విద్యార్థులు, ఉద్యోగులు కూడా ముందుపీఠిన నిలిచారు. అ ప్పటికే ఇందిరా ప్రభుత్వం మీద అసంతృప్తి, కాంగ్రెస్ లోని ఓ వర్గం వ్యతిరేకత కారణంగా ఉద్యమానికి విస్తృత రూపం వచ్చింది.

ఇటీవల కాలంలో రెండో విడత తెలంగాణా ఉద్యమంలో సకల జనుల సమ్మె, మిలియన్ మార్చ్ వంటి ఉద్యమ రూపాలున్నప్పటికీ జై ఆంధ్ర ఉద్యమ కాలంలో వీధుల్లో పోరాటాలు సాగాయి. ఉద్యమ రూపమే వాడి వేడిగా కనిపించేది. చివరకు ముల్కీ విషయంలో కేంద్రం వ్యూహాత్మక ప్రకటన, కాంగ్రెస్ లోని కొందరు నేతలు ఉద్యమం నుంచి వెనక్కి తగ్గడం వంటి అనేక కారణాలతో సుదీర్ఘకాలం పాటు సాగిన జై ఆంద్ర ఉద్యమం చల్లబడింది. ఇప్పటికే అనేక మంది ఆనాటి ఉద్యమాన్ని గుర్తు చేసుకుంటారు. 1972లోనే రాష్ట్ర విభజన జరిగి ఉంటే ఆంధ్రప్రదేశ్ భవితవ్యం వేరుగా ఉండేదని, హైదరాబాద్ వంటి నగరాలు ఏపీలో కూడా అభివృద్ది అయ్యేవని చెప్పేవారు లేకపోలేదు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp