ఇందిర‌మ్మ ఒక జ్ఞాపకం !

By G.R Maharshi 20-11-2019 01:25 PM
ఇందిర‌మ్మ ఒక జ్ఞాపకం !

నిన్న ఇందిరాగాంధీ పుట్టిన‌రోజు. ఈ దేశ రాజ‌కీయాల్లో ఆమె ఒక విప్ల‌వం, చ‌రిత్ర‌, ఉక్కుపాదం. నేను స్కూల్లో రెండో త‌ర‌గ‌తి చ‌దువుతున్న‌ప్పుడు మ‌న ప్ర‌ధాని ఎవ‌ర‌నే ప్ర‌శ్న వ‌చ్చింది. ఇందిరాగాంధీ అని గ‌ర్వంగా రాశాను. సినిమాల‌కి వెళితే న్యూస్‌రీల్ వేసేవాళ్లు. ఇందిర‌మ్మ క‌నిపిస్తే చ‌ప్ప‌ట్లు కొట్టేవాళ్లం. ఏడో త‌ర‌గ‌తిలో ఉన్న‌ప్పుడు పాకిస్తాన్‌తో యుద్ధం వ‌చ్చింది. దేశ‌మ‌నే పెద్ద ప‌దం తెలియ‌దు కానీ ఇందిర‌మ్మ గెల‌వాల‌ని రోజూ ఆంజ‌నేయ‌స్వామి గుడిలో మొక్కేవాన్ని (నిజానికి నేను గుడికి వెళ్లింది కొబ్బ‌రి ముక్క‌ల కోసం).

సినిమా టికెట్ 30 పైస‌ల నుంచి 40 పైస‌ల‌కి (నేల క్లాస్‌) పెరిగితే ఇందిర‌మ్మ మీద కోపం వ‌చ్చింది. బంగ్లాదేశ్ నుంచి వ‌చ్చిన పేద‌వాళ్ల‌కి అన్నం పెట్ట‌డానికి అంద‌రూ త‌లా ప‌ది పైస‌లు ఇవ్వాల‌ని ఆమె చెప్పింద‌ని తెలిసి గౌర‌వం పెరిగింది. ఉన్న‌ట్టుండి జైఆంధ్రా ఉద్య‌మం వ‌చ్చింది. అంద‌రూ ఇందిర‌మ్మ‌ని తిట్టేవాళ్లు. ఆ త‌ల్లి వ‌ల్లే క‌దా రెండు నెల‌లు ఈ ద‌రిద్ర‌పు స్కూల్, హోంవ‌ర్క్ అన్నీ త‌ప్పి పోయాయ‌ని సంతోషించాను. ఒక‌రోజు నిరాహార‌దీక్ష‌కు కూడా కూచుని డ‌బ్బాలో డ‌బ్బులు కూడా వేయించుకున్నాను. త‌ర్వాత ఆ కాయిన్స్‌ని హెయిర్‌పిన్‌తో లాఘ‌వంగా ఎలా బ‌య‌ట‌కు లాగాలో కూడా అంద‌రికీ నేర్పించి నిమ్మసోడాలు, జ్యూస్‌లు తాగించాను ( మా ఇంట్లో ఉన్న వెంక‌టేశ్వ‌ర‌స్వామి హుండీని ఖాళీ చేయ‌డంలో నేను ఎక్స్‌ఫ‌ర్ట్‌. ఆ దేవుడే లేక‌పోతే సినిమాల‌కి డ‌బ్బులెక్క‌డివి?).

ఎమ‌ర్జీన్సీ అన్నారు. అర్థం తెలియ‌దు కానీ 20 సూత్రాల‌ను బ‌ట్టీప‌ట్టి స్కూల్‌లో నేను బ‌హుమ‌తి కూడా గెలుచుకున్నాను. 1977 నాటికి నాకు నేను కొంచెం కొంచెం అర్థ‌మ‌వుతున్నాను. రాజ‌కీయాలు కూడా అర్థ‌మ‌వుతున్నాయి. జ‌య‌ప్ర‌కాశ్‌నారాయ‌ణ్ అనే ఆయ‌న ఇందిర‌మ్మ‌కు వ్య‌తిరేకంగా అంద‌రినీ కూడ‌దీస్తున్నాడ‌ని అర్థ‌మైంది. రైతుకి ఆవుదూడ అంటే ఇష్టం క‌దా, మ‌రి నాగ‌లి ప‌ట్టిన రైతు (జ‌న‌తా గుర్తు) ఆవుదూడ‌ల్ని (కాంగ్రెస్ గుర్తు) ఎందుకు వ్య‌తిరేకిస్తున్నాడో అర్థం కాలేదు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో నీలం సంజీవ‌రెడ్డి ఒక్క‌రే జ‌న‌తా త‌ర‌పున (నంద్యాల‌) గెలిచారు. ఇందిర, సంజ‌య్ ఇద్ద‌రూ ఓడిపోయారు. జ‌న‌తా ప్ర‌భుత్వంలో ఇందిర‌ని వేధించారు. షా కమిష‌న్ రిపోర్ట్‌ని వినివిని జ‌నం విసుగెత్తి పోయారు. 1978లో మొద‌టిసారిగా ఆమెను చూశాను. అనంత‌పురం ప‌ట్ట‌ణాన్ని జ‌న‌స‌ముద్రంగా చూడ‌టం అదే మొద‌లు. ముఖ్యంగా రైతులు, మ‌హిళ‌లు వేలాది మంది పోటెత్తారు. బెంగ‌ళూరు నుంచి రోడ్డు మార్గంలో రావ‌డానికి 24 గంట‌లు ప‌ట్టింది. అడుగ‌డుగునా జ‌న‌మే.

ఒక లీడ‌ర్ కోసం జ‌నం నిద్ర కూడా పోకుండా రాత్రంతా ఎదురు చూడ‌టం ఆశ్చ‌ర్యం క‌లిగించింది. వాళ్ల‌లో నేను కూడా ఒక‌డ్ని. మ‌రుస‌టి రోజు ఉద‌యం ఆమె కారులో వ‌చ్చారు. కారులో నుంచి దిగుతున్న ఇందిర‌మ్మ‌ని చూడ‌టం ఉద్వేగ సంఘ‌ట‌న‌. బంగారు మేని రంగుతో జుట్టులో తెల్ల‌టి పాయ‌తో ఆమె చిరున‌వ్వు న‌వ్వుతూ చెయ్యి ఊపుతుంటే నీళ్లు లేని అనంత‌పురంలో ఒక స‌ముద్ర‌పు హోరు వినిపించింది.

అసెంబ్లీలో కాంగ్రెస్ మామూలుగా గెల‌వ‌లేదు. వ‌రుస‌గా ముఖ్య‌మంత్రులు మార‌డం, కాంగ్రెస్ అవినీతితో జ‌నం విసుగెత్తిపోయారు. ఎన్టీఆర్ వ‌చ్చాడు.1983లో ఇందిరాగాంధీ స‌భ‌లో ఆమె ప్ర‌సంగానికి జ‌నం అడ్డు త‌గ‌ల‌డం ఒక విషాదం.గుండెల్లో నింపుకున్న అనంత‌పురం ప్ర‌జ‌లు ఆమెని తిర‌స్క‌రించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ వ‌ద్దు పొమ్మంది. ఇది ఇలా ఉంటే క‌లిస్తాన్ ఉద్య‌మం తీవ్ర‌మైంది. భింద్ర‌న్‌వాలే ఢిల్లీ వీధుల్లో క‌వాత్ చేస్తే ఇందిర‌మ్మ నిర్ల‌క్ష్యం చేసింది. త‌ర్వాత బ్లూస్టార్ ఆప‌రేష‌న్ .

1984 అక్టోబ‌ర్ 31
ఉద‌యం ఆట సినిమాకి వెళ్ళి తిరిగి వ‌స్తుంటే ఇందిర‌మ్మ‌ని హ‌త్య చేశార‌ని తెలిసింది. న‌మ్మ‌డం క‌ష్ట‌మైంది. ఆ రోజుల్లో వీధి మొత్తం మీద బాగా డ‌బ్బులున్న వాళ్ల ఇంట్లోనే టీవీ ఉండేది. అది చూడ‌టానికి వంద‌ల మంది ఆ ఇంటి వాళ్లు కూడా అంద‌రికీ క‌నిపించేలా ఏర్పాట్లు చేశారు. ఆడ‌వాళ్లు బోరున ఏడుస్తున్నారు. ఏదో తెలియ‌ని బాధ‌. అంత్య‌క్రియ‌ల కోసం వీధుల్లో అక్క‌డ‌క్క‌డ టీవీలు ఏర్పాటు చేశారు. వేల మంది క‌ళ్లు తుడుచుకుంటూ చూశారు.

ఇందిర‌మ్మ వెళ్లిపోయారు.
అంత‌టి ఉక్కు మ‌హిళ‌, క‌ర్క‌శురాలు, పేద‌ల ప‌క్ష‌పాతి
నియంత‌, సంస్క‌ర‌ణ‌వాది...ఈ దేశ రాజ‌కీయాల్లో ఇంకా పుట్ట‌లేదు.

idreampost.com idreampost.com

Click Here and join us on WhatsApp to get latest updates.

Related News