ర‌జ‌నీకాంత్‌కి కూడా ఇదే జ‌రిగేదా?

By G.R Maharshi May. 03, 2021, 01:30 pm IST
ర‌జ‌నీకాంత్‌కి కూడా ఇదే జ‌రిగేదా?

ర‌జ‌నీకాంత్ రాజ‌కీయాలు వ‌ద్ద‌నుకుని మంచి ప‌ని చేశారు. ఒక‌వేళ హ‌డావుడిగా పార్టీ పెట్టి పోటీ చేసినా ఆయ‌న గెలిచి , ఇంకో ఐదారు సీట్లు తెచ్చుకునే వాడేమో. కానీ అధికారం మాత్రం ద‌క్కేది కాద‌ని ప‌రిశీల‌కుల అంచ‌నా. ఎందుకంటే డీఎంకే, అన్నాడీఎంకేలుగా ఓట‌ర్లు చీలిపోయి ఉన్నారు. ఈ నేప‌థ్యంలో ఇంకో పార్టీ చొచ్చుకు రావ‌డం అసాధ్యం. ప్ర‌త్యామ్నాయం లేన‌ప్పుడు కొత్త పార్టీలు బ‌తుకుతాయి.

సినిమా వాళ్ల కాలం అయిపోయింది. రాజ‌కీయం వేరు, గ్లామ‌ర్ వేరు. ఓట‌ర్లు కొత్త జ‌న‌రేష‌న్‌కి చెందిన వారు. ఈ స‌త్యాన్ని గ్ర‌హించ‌లేక న‌టులు చ‌తికిల ప‌డుతున్నారు. MGR కాలంలో ఆ ప్ర‌భంజ‌నం వేరు. క‌రుణానిధికి ఒక స‌మాన నాయ‌కుడి అవ‌స‌రం ఉంది. MGR మ‌ర‌ణం త‌ర్వాత జ‌య‌ల‌లిత ఆ లోటు తీర్చింది.

1983లో NTR సినిమా గ్లామ‌ర్ మాత్ర‌మే కాదు, కాంగ్రెస్‌కి గ‌ట్టి పోటీని ప్ర‌జ‌లు కోరుకున్నారు. జ‌న‌తా విఫ‌ల‌మైంది కాబ‌ట్టి తెలుగుదేశం పార్టీకి ఆద‌ర‌ణ ద‌క్కింది. జ‌న‌తాపార్టీలో గ‌ట్టి నాయ‌కులుండి, బ‌ల‌మైన పోటీ ఇచ్చే స్థితిలో ఉంటే NTR ప‌రిస్థితి ఇంకోలా వుండేది.

కాలం కొన్ని నిర్ణ‌యిస్తుంది. YS రాజ‌శేఖ‌ర‌రెడ్డి బ‌ల‌మైన నేత‌గా, ప్ర‌జ‌ల మ‌నిషిగా ముద్ర వేసుకున్న త‌రుణంలో చిరంజీవి తొంద‌ర ప‌డి పార్టీ పెట్టాడు. YS ని కాద‌నుకుని చిరంజీవిని ముఖ్య‌మంత్రి చేయాల్సిన అవ‌స‌రం ప్ర‌జ‌ల‌కు లేదు. ఫ‌లితం దారుణ ఓట‌మి.
ప‌వ‌న్ ప‌రిస్థితి అదే. చిరంజీవికైనా ఒక నిర్మాణాత్మ‌క పార్టీ, ఆలోచ‌న‌లు ఉన్నాయి కానీ, ప‌వ‌న్ పార్టీకి ఒక దారీతెన్నూ లేదు. ఇంకో 20 ఏళ్లు రాజ‌కీయాల్లో ఉన్నా అది బాగుప‌డ‌దు. ఎందుకంటే లోపాలు దిద్దుకునే ఆలోచ‌న లేదు కాబ‌ట్టి. అభిమానులంద‌రూ ఓట్లేసినా బీజేపీకి తిరుప‌తిలో డిపాజిట్ ద‌క్కేది.

క‌మ‌ల్‌హాస‌న్ ప‌రిస్థితి మ‌రీ అన్యాయం. 30 ఏళ్లు హీరోగా న‌టించి డ‌బ్బు సంపాదించుకుని రిటైర్మెంట్ టైంకి విలువ‌లు మాట్లాడితే ఎవ‌రు వింటారు? ప‌్ర‌జ‌లు క‌ష్ట‌న‌ష్టాల్లో ఉన్న‌ప్పుడు సోనూసూద్‌లా ముందు నిల‌బ‌డి సాయం చేసిన సంద‌ర్భాలు క‌మ‌ల్‌కైనా, ర‌జ‌నీకైనా ఎన్ని ఉన్నాయి? ముఖ్య‌మంత్రి లేదా ప్ర‌ధాని నిధికి ఫండ్స్ ఇచ్చి చేతులు దులుపుకున్నారు త‌ప్ప‌, ప్ర‌జ‌ల కోసం, ప్ర‌జ‌ల‌తో నిలిచి తిరిగిన దాఖ‌లాలు లేవు. అందుకే సినిమా వాళ్ల‌ని జ‌నం న‌మ్మే స్థితి లేదు.

ఖుష్బూకి త‌మిళ‌నాడులో ఒక‌ప్పుడు గుడి క‌ట్టారు. ఎన్నిక‌ల్లో నిల‌బ‌డితే ఓడించారు. శ్రీ‌ప్రియ , సురేష్‌గోపి ఓడిపోయారు. విజ‌య్‌కాంత్ , శ‌ర‌త్‌కుమార్ పార్టీల‌ని ప‌ట్టించుకోలేదు. ఉద‌య‌నిధి, స్టాలిన్ గెలిచారంటే అది డీఎంకే ఖాతా, సినిమా అకౌంట్ కాదు.
అనారోగ్యం కూడా ర‌జ‌నీకాంత్‌కి మంచే చేసింది. లేదంటే లేట్ వ‌య‌సులో ఘోర‌మైన అవ‌మానం జ‌రిగేది. వ‌కీల్‌సాబ్‌లో ప‌వ‌న్‌కి డైలాగ్‌లు రాసిన‌ట్టు "జ‌న‌మే ఆయ‌న్ని మోసం చేశారు" అంటూ ర‌జ‌నీకాంత్ కొత్త సినిమా తీయాల్సి వ‌చ్చేది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp