మ‌హాన‌గ‌రానికే మొదటి స్థానం

By Kalyan.S Sep. 16, 2020, 08:43 am IST
మ‌హాన‌గ‌రానికే మొదటి స్థానం

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధానిగా అయినా.. తెలంగాణ రాజ‌ధాని అయినా.. మ‌హా న‌గ‌ర ఖ్యాతి ఏమాత్రం త‌గ్గ‌లేదు. ప్రపంచ స్థాయిలోనైనా, జాతీయ స్థాయి సర్వేల్లోనైనా ముత్యాల న‌గ‌రం ముందు వ‌ర‌స‌లో ఉంటోంది. రియ‌ల్ ఎస్టేట్ ప‌రంగానైనా, పారిశ్రామికంగానైనా ఎప్పుడూ ఉన్న‌తంగానే వెలుగొందుతోంది. ఏ విష‌యంలోనైనా హైదరాబాద్‌కు ప్ర‌త్యేక స్థానం ఉంటుంద‌నే విషయం మరోసారి నిరూపితమైంది.ఇటీవల జేఎల్‌ఎల్ ‌(జోన్స్‌ ల్యాంగ్‌ లస్యాలే) సిటీ మొమెంటం ఇండెక్స్‌ 2020లో ప్రపంచంలోనే అత్యంత డైనమిక్‌ సిటీగా ఎన్నికైన భాగ్యనగర మణిహారంలో మరో మణిపూస చేరింది. హాలిడిఫై.కామ్‌ నిర్వహించిన సర్వేలో 34 అత్యుత్తమ పట్టణాలలో నంబర్‌ వన్‌గా నిలిచింది. భారత్‌లో అత్యంత నివాస యోగ్యమైన, ఉపాధి కల్పించే నగరంగా హైదరాబాద్‌ను పేర్కొంటూ ప్రజలు పట్టం కట్టినట్లు సర్వే తెలిపింది.

విభిన్న సంస్కృతుల నిల‌యం..

విభిన్న సంస్కృతుల కలబోతగా నిలుస్తున్న పట్టణాల ఆధారంగా చేప‌ట్టిన సర్వేలో హైద‌రాబాద్ గుర్తింపు పొందింది. పర్యాటకులు, ప్రయాణీకులకు సరైన గమ్యస్థానాన్ని సూచిస్తూ డెస్టినేష‌న్ డిస్క‌వ‌రీ వెబ్ సైట్ గా కొన‌సాగుతున్న హాలిడిఫై.కామ్‌ నిర్వహించిన స‌ర్వేలో దేశంలోని పలు రాష్ట్రాల ప్రజలకు హైద‌రాబాద్ స్థానం క‌ల్పిస్తున్న‌ట్లు పేర్కొంది. మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన, సుస్థిరావృద్ధి, ఆర్థిక వ్యవస్థ తదితర అంశాల ప్రాతిపదికన చేపట్టిన ఈ సర్వేలో హైదరాబాద్‌కు 5 పాయింట్లకు గానూ 4 పాయింట్లు లభించినట్లు వెల్లడించింది. ముంబై, పుణె, బెంగళూరు, చెన్నై వంటి పలు ప్రధాన పట్టణాలను వెనక్కినెట్టి భాగ్యనగరం ఈ ఘనత సాధించినట్లు పేర్కొంది. అదే విధంగా హైదరాబాద్‌లో పర్యటించేందుకు సెప్టెంబరు- మార్చి మధ్య కాలం అనువైనదని పేర్కొంది.

దక్షిణ భారతదేశ న్యూయార్క్‌ సిటీగా...

చారిత్రక చార్మినార్‌, గోల్కొండ కోటతో పాటు అనేకానేక గొప్ప గొప్ప ప్రదేశాలను సందర్శించవచ్చని తెలిపింది. దక్షిణ భారతదేశ న్యూయార్క్‌ సిటీగా రూపాంతరం చెందే దిశగా హైదరాబాద్‌ వడివడిగా అడుగులు వేస్తోందని కితాబిచ్చింది. తెలంగాణలో ఉన్న అత్యంత గొప్ప ప్రదేశమని పేర్కొంది. ప్రజలు, సంస్కృతీ సంప్రదాయాలు, అతిథి మర్యాదలతో పాటుగా వ్యాపారాలు చేసుకునేందుకు, పరిశ్రమలు స్థాపించేందుకు హైదరాబాద్‌ అత్యంత అనువైన పట్టణమని పలువురు అభిప్రాయపడినట్లు తెలిపింది. భద్రతాపరంగా, వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక అంశాల పరంగా హైదరాబాద్‌ అత్యుత్తమమైందని నవతే తులసీ దాస్ వ్యాఖ్యానించారని పేర్కొంది. ఇక వివిధ సంస్థలు పలు దశల్లో జరిపిన సర్వేల్లో 2020లో విశిష్ట నగరాల ఎంపికపై జరిగిన సర్వేలో హైదరాబాద్ నగరం అగ్రస్థానం పొందడంతో పాటు ఖండాంతరాల్లో రియల్ ఎస్టేట్ పెట్టుబడులను ఆకర్షించే నగరంగా గుర్తింపు పొందింది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp