Huzurabad Elections : కాంగ్రెస్ కు డిపాజిట్ రాదా..?

By Thati Ramesh Oct. 21, 2021, 02:00 pm IST
Huzurabad Elections : కాంగ్రెస్ కు డిపాజిట్ రాదా..?

హుజురాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా ప్రధాన రాజకీయపార్టీల మధ్య మాటల తుటాలు పేలుతున్నాయి. రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ప్రత్యర్థులను ఇరుకున పెట్టేందుకు పార్టీల నేతలు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా కుమ్మక్కు రాజకీయాల పేరిట నేతలు పరస్పర విమర్శలు చేసుకుంటున్నారు.

టీఆర్ఎస్, బీజేపీలు మధ్య అనాధికార స్నేహం కొనసాగుతోందని కాంగ్రెస్ ఆరోపిస్తుంటే.. బీజేపీ గెలుపు కోసమే కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థిని నిలబెట్టిందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఇక బీజేపీ అభ్యర్థి ఈట రాజేందర్ ఇప్పటి వరకు సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ పై విమర్శలు గుప్పించారు. దమ్ముంటే తనపై పోటీ చేసి గెలవాలని మాజీ బాస్ కు సవాలు విసిరారు.

టీఆర్ఎస్ ఆరోపణ..?

వరుస ఎన్నికల్లో పేలవ ప్రదర్శన చేస్తున్న కాంగ్రెస్ పార్టీ, హుజురాబాద్ లో కూడా మరింత చతికలపడటం ఖాయమని టీఆర్ఎస్ భావిస్తోంది. కాంగ్రెస్ పార్టీ కనీసం డిపాజిట్ కూడా తెచ్చుకోలేదని ఎద్దేవా చేస్తున్నారు గులాబీ పార్టీ కార్యకర్తలు. బీజేపీ అభ్యర్థి గెలుపునకు పరోక్షంగా సహకారం అందించేందుకే NSUI రాష్ట్ర అధ్యక్షుడైన బల్మూరి వెంకట్ ను బరిలోకి దింపిందని ఆరోపిస్తుంది. ఎవరికి లబ్ధి చేకూర్చాలని డమ్మీ క్యాండేట్ ను నిలబెట్టారని బహిరంగ సభల వేదికగా ప్రశ్నిస్తున్నారు.

విజయంపై కేటీఆర్ ధీమా..

హుజురాబాద్ లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ విజయం సాధిస్తారని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. పోటీలో కాంగ్రెస్ ఉన్నట్లే లేదని ఎద్దేవా చేసిన కేటీఆర్... బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కు అయ్యాయని ఆరోపించారు. ‘జానా రెడ్డి కంటే ఈటల పెద్ద నాయకుడేమీ కాదన్న కేటీఆర్.. టీఆర్ఎస్ లో రాజేందర్ కు అన్యాయం జరగలేదన్నారు’. ఈటల టీఆర్ఎస్ లో చేరినప్పటి నుంచి పదవిలోనే ఉన్నప్పుడు ఎక్కడ అన్యాయం జరిగిందని ప్రశ్నించారు. ఈటలకు ఓటేస్తే బీజేపీ గ్యాస్ ధర తగ్గిస్తుందా అంటూ ఎద్దేవా చేశారు.

Also Read : Huzurabad Aravind ,Kavita -హుజూరాబాద్ : నిజామాబాద్ ఎన్నికను ను తలపిస్తున్న అరవింద్ ప్రచారం

నిన్న కౌశిక్ రెడ్డి.. నేడు కేటీఆర్ డిపాజిట్ సవాళ్లు..

టీఆర్ఎస్ కు ఈటల రాజేందర్ రాజీనామా చేసిన తర్వాత, కాంగ్రెస్ నుంచి అధికారపార్టీలో చేరిన కౌశిక్ రెడ్డి, హస్తంపార్టీపై ఘాటు విమర్శలు చేస్తున్నారు. బీజేపీతో కాంగ్రెస్ కుమ్మక్కు అయిందని, ఈ ఉపఎన్నికలో కాంగ్రెస్ కు డిపాజిట్ కూడా రాదని ఆయన జోస్యం చెబుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థికి డిపాజిట్ వస్తే ఆయన రాజకీయ సన్యాసం చేస్తానంటూ సంచలన ప్రకటన చేశారు. ఆ;అలాగే కేటీఆర్ కూడా అదే సవాల్ చేశారు.

గత పోలింగ్ లెక్కలు ఇలా...

2018 ఎన్నికల్లో హుజురాబాద్ లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన కౌశిక్ రెడ్డి ,60 వేల పైచిలుకు ఓట్లతో రెండోస్థానానికి పరిమితమయ్యారు. ఆ ఎన్నికల్లో ఈటల రాజేందర్ సుమారు లక్షఓట్లతో విజయం సాధించారు. 2018 ఎన్నికల నాటికి హుజురాబాద్ లో 2,09,338 ఓట్లు ఉండగా, 1,76,723 ఓట్లు పోలయ్యాయి. అంటే 83 శాతం పోలింగ్ జరిగింది. ఇందులో అప్పటి టీఆర్ఎస్ అభ్యర్థి రాజేందర్ కు 1,04,840 ఓట్లు తో విజయం సాధించారు. అంటే సుమారు 60 శాతం ఓట్లు ఆయనకు పడ్డాయి. కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన కౌశిక్ రెడ్డికి 61,121(34 శాతం ) ఓట్లు పడ్డాయి. బీజేపీకి నోటా కంటే తక్కువ ఓట్లు పడ్డాయి.

ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ బలం పెంచుకుంటుంది. దానితో పాటు ప్రస్తుతం బీజేపీ తరఫున బలమైన అభ్యర్థి మాజీమంత్రి ఈటల రాజేందర్ బరిలో ఉండటంతో ఆ పార్టీకి విజయావకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. రాజీనామా చేసినప్పటి నుంచి ప్రజల్లో ఉన్న రాజేందర్ తన పట్టునిలుపుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. బీజేపీ అగ్రనేతలు కూడా ఈ ఉపఎన్నికను ప్రస్టేజ్ గా తీసుకుని పనిచేస్తున్నారు. ఈసీ కూడా దళితబంధుకు తాత్కాలికంగా బ్రేక్ వేయడంతో బీజేపీ నేతలు మరింత హుషారుగా ప్రచారంలో మునిగిపోయారు.

పుంజుకుంటున్న కాంగ్రెస్ ..

రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పుంజుకుంటున్నట్లే కనిపిస్తుంది. బహిరంగ సభల ద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు గుప్పిస్తుంది. టీఆర్ఎస్ ను అధికారం నుంచి దించాలనే ప్రయత్నంతో కాంగ్రెస్ పనిచేస్తుంది. టీఆర్ఎస్ అభ్యర్థి విజయావకాశాలు దెబ్బకొట్టేందుకు ఆ పార్టీ కూడా స్టూడెంట్ లీడర్ నే అభ్యర్థిగా ప్రకటించింది. అయితే బీజేపీని గెలిపించే లోపాయికారి ఒప్పందంలో భాగంగానే బలహీన అభ్యర్థిని దింపిందని టీఆర్ఎస్ ఆరోపిస్తుంది. గతంలో కాంగ్రెస్ కు ఉన్న ఓటు బ్యాంకు, చెక్కుచెదరకుండా ఆ పార్టీకి పడితే మాత్రం టీఆర్ఎస్, బీజేపీలకే ఇబ్బందే. ప్రతిపక్షాలు ఆరోపించినట్లు కాంగ్రెస్ డిపాజిట్ కోసం పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు. ఎందుకంటే ఆపార్టీ కనీసం 30 వేల ఓట్లు తెచ్చుకుంటే సరిపోతుంది. అది హస్తంపార్టీకి పెద్ద కష్టమైన పనికాదు.

Also Read : Telangana Congress Bhatti Vikramarka -భ‌ట్టిపై టీఆర్ఎస్ గురి.. కారెక్కేస్తారా?

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp