టీడీపీపై ఇళ్ల స్థ‌లాల ల‌బ్దిదారుల తిరుగుబావుటా మొదలైంది..!

By Kalyan.S Sep. 19, 2020, 01:17 pm IST
టీడీపీపై ఇళ్ల స్థ‌లాల ల‌బ్దిదారుల తిరుగుబావుటా మొదలైంది..!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఇల్లు లేని, దారిద్య్ర రేఖకు దిగువనున్న కుటుంబాలకు తెల్ల కార్డే అర్హతగా ఎంపిక చేసిన సుమారు 30 లక్షల మందికి నివాస స్థలాలను విక్రయ దస్తావేజుల (కన్వేయన్స్‌ డీడ్ల) రూపంలో రిజిస్ట్రేషన్‌ చేసి ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ నిర్ణ‌యించిన సంగ‌తి తెలిసిందే. ల‌బ్దిదారుల‌కు అంద‌జేసేందుకు సిద్ధంగా కూడా ఉన్నారు. కానీ రాజ‌కీయ స్వ‌లాభంతో పేద‌ల క‌ల నెర‌వేర‌కుండా ర‌క‌ర‌కాల కార‌ణాల‌ను సాకుగా చూపి కోర్టు కేసుల ద్వారా అడ్డుప‌డుతోంది ప్ర‌తిప‌క్ష టీడీపీ. "చంద్ర‌బాబు సారూ.. ద‌య‌చేసి అడ్డుకోవ‌ద్దు.." అంటూ ఇంత‌కాలం పేద‌లంద‌రూ బ‌తిమ‌లాడుతూ వ‌చ్చారు. ఇక‌పై నిర‌స‌న స్వ‌రం పెంచుతున్న‌ట్లు క‌నిపిస్తోంది. తూర్పుగోదావ‌రి జిల్లాలో మొద‌లైన ఈ మార్పు ఎలా రూపాంత‌రం చెందుతుందో చూడాలి.

మీరు ఇవ్వ‌లేదు.. ఇచ్చేవార‌ని అడ్డుకుంటారా..?

ఇళ్ల స్థ‌లాల పంపిణీకి టీడీపీ నేత‌లు అడ్డుప‌డుతున్నార‌న్న విష‌యాన్ని గ్ర‌హిస్తున్న ల‌బ్దిదారులు ఆందోళ‌న బాట ప‌డుతున్నారు. శుక్ర‌వారం జ‌రిగిన ఈ సంఘ‌ట‌నే దీనికి నిద‌ర్శ‌నం. టీడీపీ ప్రభుత్వ హయాంలో నిరుపేదలకు ఒక్క సెంటు భూమిని కూడా గ్రామంలో మంజూరు చేయని అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి ప్రస్తుతం గ్రామంలో ఇళ్ల స్థలాల పంపిణీకి ప్రభుత్వం సేకరించిన భూమిపై మాట్లాడే అర్హతలేదని లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తంచేశారు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరంలోని మాజీ ఎమ్మెల్యే ఇంటి వద్దకు చేరుకున్న నియోజవకర్గంలోని పెదపూడి మండలం అచ్యుతాపురత్రయం గ్రామానికి చెందిన పలువురు లబ్ధిదారులు ఆయన ఇంటి ముందు నిరసన తెలిపారు. మీరు ఇవ్వ‌లేదు.. ఇచ్చేవార‌ని అడ్డుకుంటారా..? అని ప్ర‌శ్నించారు.

సెంటు భూమి కూడా పంపిణీ చేయ‌లేదు..

పేదలకు పంపిణీ చేసేందుకు సేకరించిన భూమి నివాసానికి అనువైనది కాదని, దీనిని లబ్ధిదారులు సైతం వ్యతిరేకిస్తున్నారంటూ రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన వివరణ ఇవ్వాలంటూ వారు డిమాండ్ చేశారు. టీడీపీ హయాంలో రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పేదలకు సెంటు భూమి కూడా పంపిణీ చేయలేదని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే భూసేకరణ జరిపి ఇళ్ల స్థలాల పంపిణీకి చర్యలు చేపట్టడంతో తామంతా సంతోషంగా ఉన్నామ‌ని, అడ్డుకుంటే ఊరుకునేది లేద‌ని హెచ్చ‌రించారు. ఇళ్ల స్థ‌లాల పంపిణీ ని టీడీపీ అడ్డుకునే చ‌ర్య‌లు మాన‌క‌పోతే ఇలా ఆ పార్టీ నేత‌లంద‌రూ ల‌బ్దిదారుల ఆగ్ర‌హానికి గురికాక త‌ప్ప‌దు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp