పరిషత్‌ పోరు - 8 గంటలకు విచారణ..!

By Harinath.P Apr. 07, 2021, 07:57 am IST
పరిషత్‌ పోరు - 8 గంటలకు విచారణ..!

పరిషత్‌ పోరుకు సర్వం సిద్ధమైన దశలో హఠాత్తుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను నిలిపివేస్తూ సింగిల్‌ జడ్జి మంగళవారం ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ హైకోర్టులో రాత్రి హౌస్‌ మోషన్‌ రూపంలో అప్పీల్‌ దాఖలు చేసింది. ఉత్తర్వులు రద్దు చేయాలని అభ్యర్థిస్తూ కమిషన్‌ కార్యదర్శి కన్నబాబు దాఖలు చేసిన అప్పీల్‌ను హైకోర్టు ధర్మాసనం బుధవారం ఉదయం 8 గంటలకు విచారించే అవకాశం ఉంది.

గురువారం జరగాల్సిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఈ నెల 1న జారీ చేసిన నోటిఫికేషన్‌లో తదుపరి చర్యలన్నీ తదుపరి ఉత్తర్వులు జారీ చేసేవరకు నిలిపివేస్తూ హైకోర్టు సింగిల్‌ జడ్జి జస్టిస్‌ ఉప్మాక దుర్గాప్రసాదరావు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల తేదీకి నాలుగు వారాల ముందు ఎన్నికల నియమావళిని అమలు చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను ఎన్నికల కమిషన్‌ అమలు చేయలేదని, సుప్రీం ఆదేశాలకు భిన్నంగా ఉన్నందున నిలుపుదల చేయడం తప్పనిసరి అని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను తు.చ. తప్పకుండా అమలు చేస్తామని పేర్కొంటూ తాజాగా నోటిఫికేషన్‌ జారీ చేయాలని సూచించారు. ఈ వివరాలతో ఈ నెల 15కల్లా అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఎన్నికల కమిషన్‌ను ఆదేశిస్తూ టీడీపీ నేత వర్ల రామయ్య దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను అనుమతించారు. ఇదే సమయంలో గత ఏడాది ఎన్నికల కమిషన్‌ జారీ చేసిన నోటిఫికేషన్లలో తదుపరి చర్యలన్నీ నిలుపుదల చేసేందుకు నిరాకరించారు.

‘సాధారణంగా న్యాయస్థానాలు ఒకసారి ఎన్నికల ప్రక్రియ మొదలైన తరువాత ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకునేందుకు రాజ్యాంగంలోని అధికరణ 226 కింద తనకున్న విశేషాధికారాలను ఉపయోగించవు’ అని విచారణ సందర్భంగా జస్టిస్‌ ఉప్మాక దుర్గాప్రసాదరావు పేర్కొన్నారు. ‘ఈ విషయంలో అధికరణ 329 ప్రకారం నిషేధం ఉంది. అభ్యంతరం ఉన్న వ్యక్తులు సంబంధిత అథారిటీ ముందు ఎన్నికల పిటిషన్‌ దాఖలు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఎన్నికల అంశాల్లో అధికరణ 226 కింద న్యాయస్థానాలు న్యాయ సమీక్ష చేయరాదనడం అవాస్తవం. న్యాయస్థానాలు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో జోక్యం చేసుకోవచ్చని వ్యాఖ్యానించారు. అధికరణ 226 కింద తనకున్న విశేషాధికారాలను ఉపయోగించి ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవడం అనివార్యం’ అని పేర్కొంటూ తదుపరి విచారణను ఈ నెల 15కి వాయిదా వేస్తున్నట్లు జస్టిస్‌ దుర్గాప్రసాదరావు ప్రకటించారు.

కాగా, వర్ల రామయ్య వ్యక్తిగత హోదాలో దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌కు విచారణార్హత ఉందని చెప్పడం ద్వారా సింగిల్‌ జడ్జి తప్పు చేశారు. వ్యక్తిగత హోదాలో దాఖలు చేసిన ఈ వ్యాజ్యాన్ని కొట్టేసి ఉండాల్సిందని ఎన్నికల కమిషన్‌ కార్యదర్శి కన్నబాబు తన అప్పీల్ లో విజ్ఞప్తి చేశారు. " అలాగే కమిషన్‌ పనితీరు విషయంలో న్యాయస్థానాల జోక్యానికి పరిమితులున్నాయి. నియమావళి అమలు విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మొత్తానికి భాష్యం చెప్పాలే కానీ ఒక్కో వాక్యానికి కాదు. అభివృద్ధి కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకునే సుప్రీంకోర్టు ఎన్నికల నియమావళికి నాలుగు వారాల గరిష్ట గడువు విధించింది. నాలుగు వారాలు కచ్చితంగా అమలు చేయాలన్నది ఉద్దేశం కాదు. ఎన్నికల కమిషన్‌ విధుల్లో జోక్యం చేసుకోరాదన్న సుప్రీంకోర్టు ఉత్తర్వులను సింగిల్‌ జడ్జి పూర్తిస్థాయిలో పరిగణలోకి తీసుకోలేదు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని సింగిల్‌ జడ్జి ఉత్తర్వులను రద్దు చేయాలని" ఆయన తన అభ్యర్థనలో పేర్కొన్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp