ఏలూరు కార్పొరేషన్‌: ఓట్ల లెక్కింపునకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

By Karthik P Jul. 22, 2021, 12:40 pm IST
ఏలూరు కార్పొరేషన్‌: ఓట్ల లెక్కింపునకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

ఏలూరు కార్పొరేషన్‌ ఎన్నికల ఫలితాలకు మార్గం సుగమమైంది. మార్చి 10వ తేదీన పోలింగ్‌ జరగ్గా.. కోర్డు ఆదేశాలతో కౌంటింగ్‌ ప్రక్రియ నిలిచిపోయింది. ఈ వివాదంపై విచారణ జరిపిన కోర్టు.. ఏప్రిల్‌ 19వ తేదీన తీర్పును రిజర్వ్‌ చేసింది. తాజాగా తీర్పును వెలువరిస్తూ ఫలితాలు వెల్లడించాలని ఆదేశాలు జారీ చేయడంతో పోటీ చేసిన అభ్యర్థులు ఊపిరి పీల్చుకున్నారు.

కోర్టు ఆదేశాలతో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఓట్ల లెక్కింపునకు తేదీ ఖరారు చేసింది. ఈ నెల 25వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తోంది. కోవిడ్‌ నిబంధనలతో ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు.

పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న ఏకైక కార్పొరేషన్‌ ఏలూరు. కార్పొరేషన్‌లో సమీప పంచాయతీలు విలీనమయ్యాయి. పంచాయతీల తీర్మాణాలు లేకుండానే విలీనం చేశారని, ఓటర్ల జాబితా శాస్త్రియంగా జరగలేదని, రిజర్వేషన్లు సక్రమంగా పాటించలేదనే కారణాలతో పలువురు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. తమ అభ్యంతరాలు పరిష్కరించే వరకూ ఎన్నికలను నిలిపివేయాలని కోరారు. ప్రతివాదులుగా ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వాన్ని చేర్చారు.

ఇరు వైపుల వాదనలు విన్న రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం మున్సిపల్‌ పోలింగ్‌ జరిగిన మార్చి 10వ తేదీకి ముందు రోజు రాత్రి తీర్పు వెల్లడించింది. పోలింగ్‌ నిర్వహించేందుకు అనుమతించిన ధర్మాసనం.. ఫలితాలను మాత్రం ప్రకటించవద్దని ఆదేశాలు జారీ చేసింది. తుది తీర్పునకు లోబడి ఫలితాలు వెల్లడించాలని స్పష్టం చేస్తూ తదుపరి విచారణను మార్చి 23వ తేదీకి వాయిదా వేసింది.

కోర్టు తీర్పు నేపథ్యంలో 11 కార్పొరేషన్లతోపాటు ఏలూరుకు ఎన్నికలు జరిగాయి. మార్చి 14వ తేదీన ఏలూరు మినహా 11 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలు, నగరపంచాయతీల ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఫలితాలు వెల్లడించారు. ఏలూరు ఎన్నికల ఓట్లు లెక్కింపు కోర్టు తీర్పుతో ఆగిపోయింది. 23వ తేదీన విచారణ జరగాల్సి ఉండగా.. విచారణలు ఎక్కువగా ఉండడంతో తదుపరి రోజునకు వాయిదా పడింది. ఈ వాయిదాల పర్వం 24వ తేదీతో ఆగలేదు. ఏప్రిల్‌ 1, 9 తేదీల్లోనూ విచారణ జరిగింది. చివరగా ఏప్రిల్‌ 20వ తేదీన ఇరువైపుల వాదనలు పూర్తవడంతో తీర్పును రిజర్వ్‌ చేసింది. తీర్పును ఈ రోజు రాష్ట్ర అత్యున్నత ధర్మాసనం వెల్లడించింది.

ఏలూరు కార్పొరేషన్‌లో 50 డివిజన్ల పరిధిలో 2,32,378 మంది ఓటర్లు ఉన్నారు. 56.82 శాతం పోలింగ్‌ నమోదైంది. ఈ నెల 25వ తేదీన అభ్యర్థుల భవితవ్యం తేలిపోనుంది. 11 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు గాను టీడీపీ కేవలం తాడిపత్రి మున్సిపాలిటీనే గెలుచుకోగలిగింది. ఈ నేపథ్యంలో ఏలూరులోనూ వైసీపీ హవానే సాగే అవకాశం ఉంది.

Also Read : పోరాట ఫలం.. ఆ మహిళా నేతకు పీఠం

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp