రాజమండ్రి మరో వరంగల్ కాబోతుందా..?

By Voleti Divakar Sep. 23, 2020, 06:46 pm IST
రాజమండ్రి మరో వరంగల్ కాబోతుందా..?

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఎపితో పాటు, తెలంగాణాలోని లోతట్టు ప్రాంతాలన్నీ ముంపునకు గురయ్యాయి. హైదరాబాద్ రోడ్డు చెరువులను తలపించాయి. ప్రతీ ఏటా ఇది సాధారణ విషయమే. కానీ వరంగల్ నగర శివార్లలోని వడ్డేపల్లి ప్రాంతంలో జలప్రళయం సంభవించింది. ఇక్కడ ఇళ్లు, వాహనాలు వరద నీటిలో కొట్టుకుపోయాయి. స్థానికులు నిరాశ్రయులయ్యారు. భారీ ఆస్తినష్టం సంభవించింది. వడ్డేపల్లి పరిస్థితి చూస్తే సుమారు రెండేళ్ల క్రితం కేదార్‌నాద్లో సంభవించిన జలప్రళయం గుర్తుకు రాక మానదు.

భారీ వర్షాలకు వరద నీరు వడ్డేపల్లిలోనే ఎందుకు తన ప్రతాపాన్ని చూపించింది.. అంటే ఇక్కడ ఉండే వడ్డేపల్లి ట్యాంకు చెరువును పూర్తిగా కబ్జా చేసి, ఇళ్లు నిర్మించడమే కారణమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పలు నగరాలు, పట్టణ శివార్లలో చెరువులు, కుంటలను కబ్బా చేసి, పూడ్చి వేసి ఇళ్లు నిర్మించడం, డ్రైనేజీ సదుపాయం కల్పించకపోవడం వల్ల ఇలాంటి ఉత్పాతాలు సంభవిస్తున్నాయి.

రాజమహేంద్రవరం ఉభయ గోదావరి జిల్లాలకు ప్రధాన వాణిజ్య, రాజకీయ కేంద్రం. సాంస్కృతిక రాజధాని. రాజమహేంద్రవరం, శివారు  కొంతమూరులోనూ ప్రస్తుతం ఇదే పరిస్థితి కనిపిస్తోంది. నగరంలో చెరువులను కొంత అభివృద్ధి చేయడంతో పాటు, డ్రైన్లను నిర్మించడంతో ముంపు సమస్య కొంత వరకు పరిష్కారమైంది. అయితే కొంతమూరు, దిగున గ్రామాల్లో భారీ వర్షాలకు మధురపూడి విమానాశ్రయానికి వెళ్లే దారిలోని ప్రాంతాలు జలమయమవుతున్నాయి.

గతంలో ఇక్కడన్నీ పొలాలు ఉండేవి. గామన్ వంతెన నిర్మాణం, రాజమహేంద్రవరం నుంచి ఏజెన్సీకి రోడ్ల అభివృద్ధి, మధురపూడి విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయడంతో కొంతమూరులో ఇళ్ల స్థలాలకు గిరాకీ పెరిగింది. నగరపాలక సంస్థలో విలీనం అవుతుందన్న ఉద్దేశంతో కూడా కొంతమూరులో స్థలాలు, ఇళ్లకు డిమాండ్ ఏర్పడింది. దీంతో ప్రకాశం ఎంప్లాయిస్ కాలనీ వంటి రోడ్డు పక్కన ఉండే కాలనీల్లో బివిఆర్ లాంటి బిల్డర్లు కుంటలను పూడ్చివేసి భారీగా ఇళ్ల నిర్మాణాలను చేపట్టారు. కనీసం డ్రైనేజీ, సిసి రోడ్ల సదుపాయం కూడా లేకపోవడంతో వర్షాకాలంలో ఈ ప్రాంతం పూర్తిగా ముంపునకు గురై, ఇళ్లకు కూడా చేరుకోలేని పరిస్థితి నెలకొంది. దీనికి తోడు పారిశుద్ధ్యం ఆధ్వాన్నంగా ఉండటం మరింత ఆందోళన కలిగిస్తోంది.

వరంగల్ లోని వడ్డే వల్లి ట్యాంకు, హైదరాబాద్ వంటి పరిస్థితి ఇప్పుడిప్పుడే మహా నగరపాలక సంస్థగా మారుతున్న రాజనుహేంద్రవరం నగరానికి రాకుండా ఉండాలంటే శివారు గ్రామాల్లో డ్రైనేజీలు, సిసి రోడ్లు, తాగునీటి వంటి మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరం ఉంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp