రెండు అణు బాంబు దాడుల నుంచి బయట పడ్డ మృత్యుంజయుడు

By Sannapareddy Krishna Reddy Aug. 09, 2020, 10:51 am IST
రెండు అణు బాంబు దాడుల నుంచి బయట పడ్డ మృత్యుంజయుడు

అణుబాంబు కలిగించే విధ్వంసం అంతాఇంతా కాదు.ఈ విధ్వంసాన్ని మానవాళి ప్రత్యక్షంగా చూసింది మాత్రం జపాన్ మీద అమెరికా వేసిన రెండు అణుబాంబుల ద్వారానే. బాంబు పేలిన మొదటి క్షణంలోనే రెండు మూడు కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రాంతాన్ని నేలమట్టం చేసి, ఆ పరిధిలో ఉన్న ప్రాణులన్నింటినీ చంపేస్తుంది. ఆ తరువాత మొదటి గంటల్లో, మొదటి రోజులో, మొదటి మాసంలో మరణించేవారే కాకుండా రేడియేషన్ వల్ల సంక్రమించిన కేన్సర్ లాంటి జబ్బులతో దీర్ఘకాలంగా బాధపడి చనిపోయే వాళ్లు కూడా ఉంటారు.

అయితే అణుబాంబు దాడి నుంచి బయటపడి దీర్ఘకాలం ఎటువంటి సమస్యలు లేకుండా జీవించిన వారు కూడా ఉన్నారు. వీరిని జపనీస్ భాషలో హిబకూషా (hibakusha) అంటారు. రెండు అణుబాంబు దాడుల నుంచి క్షేమంగా బయటపడి, తొంభై సంవత్సరాలు పైగా జీవించిన డబుల్ హిబకూషా సుతోమో యమగూచి. ఇలాంటి వ్యక్తులు మరికొందరు ఉన్నా రెండు అణుబాంబు దాడుల నుంచి క్షేమంగా బయటపడినట్టు జపాన్ ప్రభుత్వం అధికారికంగా గుర్తించిన వ్యక్తి ఈయన ఒక్కడే.

ఆగస్టు 6,1945 న హిరోషిమా

మిత్సుబిషి భారీ పరిశ్రమలు అనే కంపెనీలో పనిచేస్తూ, కంపెనీ పని మీద మూడు నెలలుగా హీరోషిమాలో ఉండి ఆరోజు ఉదయం తమ స్వస్థలానికి తిరిగి వెళ్ళడానికి, తన ఇద్దరు సహోద్యోగులతో సహా హోటల్ నుంచి బయటకు వచ్చాడు యమగూచి. ఇంతలో పైన విమానం ఎగుర్తున్న శబ్దం రావడంతో అది తమ విమానమా, శత్రు దేశపు విమానమా అని తల పైకెత్తి చూశాడు. అప్పుడు సమయం ఉదయం 8:15.

విమానం లోనుంచి ప్యారాచూట్ బయటకు రావడంతో దానికి తగిలించి ఉన్న చిన్న వస్తువు ఏమిటా అని చూస్తుండగానే కళ్ళు చెదిరే మెరుపు లాంటి కాంతితో, దిక్కులు దద్దరిల్లి పోయే శబ్దంతో అది పేలిపోవడం, ఆ పేలుడికి యమగూచి గాల్లోకి ఎగిరి పక్కనున్న గుంటలో పడి స్పృహ కోల్పోవడం జరిగాయి.

కాసేపటికి స్పృహలోకి వచ్చిన యమగూచి చుట్టూ శిధిలాలు, తన శరీరంలో ఎడమ వైపు అంతా కాలిపోయి ఉంది. అలాగే పడుతూ లేస్తూ తనలాగే గాయపడి ప్రాణాలతో ఉన్న తన ఇద్దరు సహోద్యోగులతో కలిసి ఆ రాత్రికి బాంబు దాడుల నుంచి పౌరులు రక్షణ కోసం నిర్మించిన షెల్టర్ లో తల దాచుకున్నాడు. రైళ్ళు నడుస్తూ ఉన్నాయని అక్కడ ఎవరో చెప్తే మరుసటి రోజు ఉదయం రైల్వే స్టేషన్ కు వెళ్ళాడు.

నగరంలో ప్రవహిస్తున్న ఓటా నది మీద బ్రిడ్జి కూలిపోడంతో, నదిలో తేలుతున్న శవాల మధ్య ఈదుకుంటూ రైల్వే స్టేషన్ చేరుకున్నాడు. దారిలో జరిగిన విధ్వంసం కళ్ళారా చూసిన యమగూచి ఒక బాంబు ఇంత నష్టం కలిగిస్తుందని నమ్మలేకపోయాడు. యుద్ధం మొదలైనప్పటినుంచి బాంబు దాడులు ఎన్నో చూసి, రోజూ వార్తల్లో చదివి ఉన్న యమగూచి, అతని కొలీగ్స్ ఆ విధ్వంసం చూసి నిచ్చేష్టులయ్యారు.

రైలు నిండా తమలాగే వొళ్ళంతా గాయాలతో ఉన్న ప్రయాణీకులు ఉన్నారు. ఎలాగో తన స్వస్థలం నాగసాకిలోని ఇంటికి చేరుకున్న యమగూచి తన భార్య, ఏడాది వయసున్న కొడుకు క్షేమంగా ఉండటం చూసి ఊపిరి పీల్చుకున్నాడు.

ఆగస్టు 9,నాగసాకి

ఒకరోజు విశ్రాంతి తీసుకుని, ఆగస్టు 9 ఉదయం వంటినిండుగా బ్యాండేజీలతో ఆఫీసుకి వెళ్ళాడు. అప్పటికే హిరోషిమాలో జరిగిన విధ్వంసం గురించి దేశమంతా పాకిపోయింది. అయితే ఎంత నష్టం జరిగిందో ఎవరూ అంచనా వేయలేకపోయారు. తను కళ్ళారా చూసింది యమగూచి చెప్తుంటే అతని మేనేజర్ ఏమాత్రం నమ్మడం లేదు. ఒక బాంబు అంత నష్టం కలిగించగలదు అన్నది అతని ఊహకు ఏమాత్రం అందడం లేదు. యమగూచి అతిశయోక్తులు జోడించి జరిగిన దాన్ని ఎక్కువ చేసి చెప్తున్నాడని అతని నమ్మకం.

ఇలా ఇద్దరి మధ్య వాదోపవాదాలు జరుగుతున్నప్పుడు అక్కడ సమయం ఉదయం పదకొండు గంటలు. హిరోషిమా తర్వాత కూడా జపాన్ లొంగుబాటు ప్రకటన చేయకపోవడంతో రెండవ అణుబాంబు దాడికి అమెరికా అధ్యక్షుడు ట్రూమన్ ఆదేశం ఇవ్వడంతో, హీరోషిమా మీద వేసిన యురేనియం బాంబు కాకుండా, ఫ్యాట్ మ్యాన్ అన్న పేరున్న ప్లుటోనియం బాంబు తీసుకుని జపాన్ లోని కోకురా నగరం మీద వేయడానికి బయలుదేరిన అమెరికా యుద్ధ విమానం అక్కడ వాతావరణం అనుకూలించక పోవడంతో, ప్రత్యామ్నాయంగా నిర్ణయించిన నాగసాకి నగరం మీద ఆ బాంబు వేసింది.

ఈసారి కూడా అదృష్టం యమగూచి వైపు ఉంది. బాంబు పేలిన స్థలానికి రెండు మైళ్ళ దూరంలో ఉన్న అతను గాయాలతో బయట పడ్డాడు. ఆ గాయాలతోనే శిధిలమైన భవనాల మధ్య నడుచుకుంటూ ఇంటికి చేరిన అతనికి భార్య, కొడుకు క్షేమంగా కనిపించారు. కొద్ది వారాలు విపరీతమైన వాంతులతో బాధపడ్డా, కొన్నాళ్ళకు పూర్తిగా కోలుకున్నాడు యమగూచి.

యుద్ధానంతరం

రెండు అణుబాంబుల దాడికి గురయినా ఆ రేడియేషన్ ప్రభావం అతని మీద ఏమీ లేకుండా పోయింది. ఆ తరువాత ఇద్దరు ఆరోగ్యవంతమైన పిల్లలకు తండ్రి అయ్యాడు. ఉద్యోగం చేస్తూనే అణ్వస్త్రాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న సంస్థలతో చేతులు కలిపి పోరాడాడు.

నాగసాకి బాంబు దాడినుంచి తప్పించుకున్న విషయం అందరికీ తెలిసినా, హిరోషిమా బాంబు నుంచి కూడా అతను తప్పించుకున్నాడని చాలా రోజులు బయటపడలేదు. రెండు బాంబుల నుంచి తప్పించుకున్న వారు 150 వరకూ ఉన్నా జపాన్ ప్రభుత్వం మాత్రం సుతోమో యమగూచి ఒకడినే రెండు అణుబాంబుల నుంచి తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డ డబుల్ హిబకూషగా 2009లో గుర్తించింది. ఆ మరుసటి సంవత్సరమే తొంభై మూడు సంవత్సరాల వయసులో అతను కడుపులో కేన్సర్ తో మరణించాడు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp