విచారణ నిలిపివేయండి, వివరాలు మీడియాలో వద్దు

By Raju VS Sep. 16, 2020, 08:24 am IST
విచారణ నిలిపివేయండి, వివరాలు మీడియాలో వద్దు

ఏపీ మాజీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ ప్రధాన నిందితుడిగా ఉన్న అమరావతి భూకుంభకోణం కేసులో హైకోర్ట్ ఆదేశాలు వెలువరించింది. ఏసీబీ కేసుపై దమ్మాలపాటి హౌస్ మోషన్ ఫిర్యాదు చేయడంతో హైకోర్ట్ విచారణ చేసింది. నాలుగు వారాల పాటు దర్యాప్తు నిలిపివేయాలని , ఎటువంటి విచారణ చేయవద్దని స్పష్టం చేసింది. అంతేగాకుండా తన ఎఫ్ ఐ ఆర్ వివరాలను మీడియాలో ప్రస్తావించకుండా ఆదేశాలు ఇవ్వాలన్న దమ్మాలపాటి పిటీషన్ పై కోర్ట్ సానుకూలంగా స్పందించింది. రాత్రి 9 గంటలు దాటిన తర్వాత కోర్ట్ నుంచి ఈ మేరకు ఉత్తర్వులు విడుదలయ్యాయి.

ఈ కేసుకి సంబంధించిన వివరాలను సోషల్ మీడియాలో కూడా ప్రస్తావించకూడదని ఆదేశాలు ఇచ్చారు. ఈ మొత్తం వ్యవహారంపై నాలుగు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని కోర్ట్ ఆదేశించింది. ఆ మేరకు హోం శాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, ఏసీబీ డీజీ, సీఐడీ అదనపు డీజీ, ఇంటెలిజెన్స్‌ డీఐజీ కొల్లి రఘురామిరెడ్డిలకు ఆదేశాలు జారీ అయ్యాయి. అదే సమయంలో ఈ కేసులో సీఎం వైఎస్ జగన్ ని వ్యక్తిగతంగా ప్రతివాదిగా చేయాలన్న పిటీషనర్ వాదనను కోర్ట్ తిరస్కరించింది. నోటీసులు ఇచ్చేందుకు నిరాకరించింది. అందుకు అనుగుణంగా నాలుగు వారాలపాటు గడువు ఇస్తూ హైకోర్ట్ సీజే మహేశ్వరి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు.

తొలుత ఈ పిటిషన్‌ జస్టిస్‌ దొనాడి రమేశ్‌ వద్ద విచారణకు వచ్చింది. కేసుల విచారణ ప్రారంభించడానికి ముందే జస్టిస్‌ రమేశ్‌ కేసు విచారణ నుంచి తప్పుకున్నారు. కేసును మరో బెంచ్‌కి పంపాలని ఆయన సూచించారు. కేసు ఫైల్ ని సీజే ముందుంచాలని రిజిస్ట్రీని ఆదేశించారు. ఆయన విచారణ నుంచి తప్పుకోవడానికి కారణాలు మాత్రం వెల్లడించలేదు.

దాంతో హౌస్ మోషన్ పై సాయంత్రం 6.30 నిమిషాల ప్రాంతంలో విచారణ ప్రారంభించారు. దమ్మాలపాటి తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాదులు ముకుల్‌ రోహత్గీ, శ్యాం దివాన్‌లు వాదనలు వినిపించారు. హోంశాఖ ముఖ్య కార్యదర్శి తరఫున ఏజీ శ్రీరామ్, ఏసీబీ తరఫున సీనియర్‌ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి, సీఐడీ తరఫున మరో సీనియర్‌ న్యాయవాది ఎస్‌.సత్యనారాయణప్రసాద్‌లు వాదించారు. . దాదాపు 40 నిమిషాల పాటు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వాదనలు సాగాయి. చివరకు దమ్మాలపాటి తరుపున న్యాయవాదుల విజ్ఞప్తి మేరకు తదుపరి దర్యాప్తు నిలిపివేస్తూ హైకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp