విశాఖ మేయర్ పోటీలో ముందంజలో ఉన్న ఆ ఇద్దరు...

By Suresh Mar. 04, 2021, 02:49 pm IST
విశాఖ  మేయర్ పోటీలో ముందంజలో ఉన్న ఆ ఇద్దరు...

దాదాపు 14 ఏళ్ల తర్వాత జరగనున్న మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ (జీవీఎంసీ) ఎన్నికల్లో టీడీపీకి ఎదురుగాలి వీయనుందా? అంటే రాజకీయ విశ్లేషకులు మాత్రం అవుననే సమాధానం ఇస్తున్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ ఎంపీలు, మంత్రులు ఉద్యమం చేపట్టడం, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రధాన అనుచరుడు కాశీవిశ్వనాధ్‌ వైసీపీలో చేరడం, గంటా శ్రీనివాసరావు కూడా వైసీపీలోకి చేరనున్నారనే సంకేతాలు అన్ని కలిసి వైసీపీకి విశాఖ మేయర్‌ పీఠాన్ని కట్టబెట్టనున్నాయనేది విశ్లేషకుల మాట.

మహా విశాఖ నగరపాలక సంస్థలో 98 డివిజన్ల నుంచి 1,361 నామినేషన్లు దాఖలు కాగా 99 నామినేషన్లను అధికారులు పరిశీలనలో తిరస్కరించారు. మిగిలిన 1,262 నామినేషన్లు ఆమోదించగా అందులో ఐదుగురు మతిచెందారు. వారి స్థానంలో అదే పార్టీకి చెందిన వ్యక్తులు నామినేషన్‌ దాఖలు చేసుకునేందుకు అవకాశం కల్పించగా ముగ్గురే నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో 1,260 నామినేషన్లు ఉన్నాయి. వీటిలో 673 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకోగా 587 మంది పోటీలో నిలిచారు. అంటే ఒక్కో వార్డుకు సగటున ఆరుగురు చొప్పున బరిలో ఉన్నారు. 32వ వార్డులో అత్యధికంగా 12 మంది పోటీలో నిలవగా, 64వ వార్డులో 11 మంది, 37 వార్డులో పదిమంది పోటీలో ఉన్నారు. అత్యల్పంగా 28వ వార్డులో టీడీపీ, వైసీపీ అభ్యర్థులు మాత్రమే పోటీ పడుతున్నారు. తర్వాత 23, 84 వార్డుల్లో ముగ్గురేసి చొప్పున పోటీలో ఉన్నారు.

4 డివిజన్లలో టీడీపీకి అభ్యర్థులే లేరు
వైసీపీ అన్ని డివిజన్లలోనూ పోటీ చేస్తుండగా టీడీపీ 94 డివిజన్‌ల్లో అభ్యర్థులను నిలిపింది. మిగిలిన 4 డివిజన్లలో ఆ పార్టీ అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకోగా పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో రెండు వార్డుల్లో వామపక్షాలకు మద్దతు పలికింది. మరో రెండు వార్డుల్లో ఇండిపెండెంట్‌లకు మద్దతు ఇస్తూ సరిపెట్టుకుంది. వైసీపీ 98, టీడీపీ 94, కాంగ్రెస్‌ 67, జనసేన 51, బీజేపీ 44, సీపీఎం 19, సీపీఐ 6, బీఎస్‌పీ 9, ఇతర రిజిస్టర్డ్‌ పార్టీలు 1, ఇండిపెండెంట్లు 178 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు.

టీడీపీకి రెబల్స్‌ బెడద
భీమిలి నియోజకవర్గ పరిధిలోని నాలుగో డివిజన్‌ అభ్యర్థిగా తొలుత ప్రకటించిన గరికిన కింగ్‌ను కాదని అదే డివిజన్‌ నుంచి నామినేషన్‌ దాఖలు చేసిన పాతి నరసింగరావుకు టీడీపీ బీఫారం ఇచ్చింది. విశాఖ విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 47వ వార్డు నుంచి టిక్కెట్‌ ఆశించిన లక్ష్మీపూజ బదులుగా యాగాటి ఆదిలక్ష్మికి బీఫారం ఇచ్చారు. దీంతో లక్ష్మీపూజ నామినేషన్‌ ఉపసంహరించకుండా బరిలో ఉండిపోయారు.

విశాఖ దక్షిణ నియోజకవర్గంలో 31వ వార్డు నుంచి గతంలో బీఫారం తీసుకున్న దొడ్డి బాపూఆనంద్‌కు బదులుగా వానపల్లి రవికుమార్‌కు టిక్కెట్‌ ఇచ్చారు. దీనికి నిరసనగా దొడ్డి బాపూఆనంద్‌ పార్టీకి రాజీనామా చేసి అధికార పార్టీలో చేరనున్నట్టు ప్రకటించారు. 35వ వార్డు నుంచి టిక్కెట్‌ ఆశించిన పిల్లి వెంకటరమణ కూడా పార్టీకి రాజీనామా చేసినప్పటికీ ఎన్నికల బరిలో వున్నట్టు ప్రకటించారు. 36వ వార్డు నుంచి టిక్కెట్‌ ఆశించిన ఇమంది సత్యవతి పోటీలో ఉన్నారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 91వ వార్డు నుంచి టిక్కెట్‌ ఆశించిన నమ్మి కష్ణమూర్తి టీడీపీ రెబల్‌గా బరిలో ఉన్నారు. గాజువాక పరిధిలోని 87వ వార్డు టిక్కెట్‌ ఆశించిన గొర్లె వెంకునాయుడు కూడా టీడీపీ రెబల్‌గా పోటీలో ఉన్నారు.

మేయర్‌ పదవిపైనే గురి
జీవీఎంసీకి 14 ఏళ్ల తర్వాత ఎన్నికలు జరుగుతున్నాయి. మేయర్‌ పదవి బీసీ జనరల్‌కు రిజర్వు అయ్యింది. ఇక్కడ మేయర్‌ రేసులో సీహెచ్‌ వంశీకష్ణశ్రీనివాస్‌ (21వ వార్డు కార్పొరేటర్‌ అభ్యర్థి), శరగడం చిన్నఅప్పలనాయుడు (96వ వార్డు అభ్యర్థి), తిప్పల వంశీరెడ్డి (74వ వార్డు అభ్యర్థి) నిలిచారు. వారితో పాటుగా తొమ్మిదో వార్డు నుంచి పోటీ చేస్తున్న కోరుకొండ వెంకటరత్నస్వాతితో పాటు 12వ వార్డు నుంచి పోటీ చేస్తున్న అక్కరమాని రోహిణి, 75వ వార్డు నుంచి పోటీచేస్తున్న తిప్పల ఎమిలీ జ్వాల రేసులోకి వస్తారంటున్నారు.

అవకాశం ‌ తిప్పాల,వంశీకృష్ణ ఇద్దరిలో ఎవరికి?
మేయర్‌ రేసులో ఎంతమంది ఉన్నప్పటికీ ప్రముఖంగా సీహెచ్‌ వంశీకృష్ణ శ్రీనివాస్‌తో పాటుగా తిప్పాల వంశీరెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. వంశీకృష్ణ శ్రీనివాస్‌ వైసీపీ నగర అధ్యక్షునిగా కొనసాగుతున్నారు. దీంతోపాటుగా ఆయన ఎంపీ విజయసాయిరెడ్డికి సానిహిత్యంగా ఉంటున్నారు. అదేవిధంగా గాజువాక ఎమ్మెల్యే తిప్పాల నాగిరెడ్డికి వంశీరెడ్డి బంధువు అవుతారు. వంశీరెడ్డికి ఆయన అండదండలతో పాటుగా భీమిలి నియోజకవర్గ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్‌ అండదండలు కూడా పుష్కలంగా ఉన్నాయి. దీంతో మేయర్‌ రేసు వీరిద్దరి మధ్యనే ప్రధానంగా ఉంటుందని ప్రచారం సాగుతోంది.

విశాఖ ఉక్కు ఉద్యమంతో వైసీపీకి ఊపు
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రులు అవంతి శ్రీనివాస్‌, కురుసాల కన్నబాబు, పార్టీ ఎమ్మెల్యేలు చేపట్టిన ఉద్యమంతో పార్టీ విజయం ఇక్కడ నల్లేరుపై నడకకానుందనేది విశ్లేషకుల భావన. ఇప్పటి వరకూ ప్రతిపక్ష పార్టీలే ఉద్యమాలు చేపట్టడం జరుగుతుంది. కానీ కేంద్రం వైఖరిని నిరసిస్తూ కార్మికుల తరపున అధికారపక్ష ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఉద్యమం చేపట్టడం విశేషం. టీడీపీ కూడా దీనిపై ఉద్యమం చేపట్టినప్పటికీ అది కేవలం ముణ్ణాళ్ల ముచ్చటగానే మిగిలిపోయిందని చెప్పాలి. ఇది టీడీపీకి ప్రతికులాంశంగా చెప్పొచ్చు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp