అధికారంలో ఉన్నప్పుడే పులులు,విపక్షంలో ఉంటే నామినేషన్ కూడా వేపించలేరు

By Sanjeev Reddy Mar. 04, 2021, 09:15 pm IST
అధికారంలో ఉన్నప్పుడే పులులు,విపక్షంలో ఉంటే నామినేషన్ కూడా వేపించలేరు

2019 ఎన్నికలలో పల్నాటి నడిబొడ్డు గురజాల నియోజక వర్గం నుంచి భారీ విజయం సాధించిన వైసీపీ యువ నాయకుడు కాసు మహేష్ రెడ్డి అనునిత్యం స్థానికులతో మమేకమవుతూ సంక్షేమ , అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణతో పాటు నియోజకవర్గంలోని దాచేపల్లి , గురజాల మండలాలను మున్సిపాలిటీలుగా అప్ గ్రేడ్ చేయించుకోవటంతో పాటు నియోజక వర్గానికి మెడికల్ కాలేజి కేటాయింపు కోసం కృషి చేసి సాధించుకోవటంతో అధికారం చేపట్టిన తర్వాత మరింత సానుకూలత సంపాదించుకొన్నారని చెప్పొచ్చు .

ఇటీవలి పంచాయితీ ఎన్నికలు , మున్సిపల్ ఎన్నికల క్లీన్ స్వీప్ కావడంలో ఈ అంశాలతో పాటు కాసు వ్యూహ చతురత కూడా ప్రధాన కారణంగా చెప్పొచ్చు . మరో వైపు ప్రతిపక్ష టీడీపీ నుండి 33 స్థానాలకు గాను ఒక్క చోట కూడా టీడీపీ అభ్యర్థిని నిలబెట్టలేకపోవటం స్థానిక టీడీపీ ఇంచార్జ్ యరపతినేని ప్రస్తుత రాజకీయ బలాన్ని తెలియజేస్తుంది .

యరపతినేని శ్రీనివాసరావు , టీడీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో గుంటూరు జిల్లాలో సంచలన వ్యాఖ్యలకు , వివాదాస్పద ఘటనలకు , తీవ్ర అవినీతి ఆరోపణలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు . జిల్లా నుండి మంత్రులుగా చేసిన ప్రత్తిపాటి , రావెల , నక్కా ఆనంద బాబుల కన్నా ఎక్కువగా వార్తల్లో నిలిచారు యరపతినేని .

టీడీపీ పార్టీ నుండి జిల్లాలో డిఫాక్టో మంత్రిగా పేరు పడ్డ యరపతినేనికి మొదట్లో మంత్రి పదవి వస్తుందని భావించారు . అయితే సామాజిక సమీకరణాల వలన , కోడెలకి సైతం మంత్రి పదవి ఇవ్వకుండా చివరికి స్పీకర్ తో సరిపుచ్చడం వలనో కానీ కోడెల మాజీ శిష్యుడైన యరపతినేనికి మంత్రి పదవి విషయంలో మాత్రం రిక్తహస్తం ఎదురైంది . అధికారం వచ్చిన కొత్తలో పేకాట క్లబ్బుల వ్యవహారంతో వెలుగులోకి వచ్చిన అక్రమాల ఆరోపణలు వేల కోట్ల మైనింగ్ అక్రమాల విచారణలో హైకోర్టు తీవ్రంగా పరిగణించి ఆక్షేపించే వరకూ కొనసాగాయి .

మరో వైపు నాటి ప్రతిపక్ష వైసీపీ పై తీవ్ర వ్యాఖ్యలు , దాడులు విషయంలో కూడా జిల్లాలో ఉన్న టీడీపీ నేతలందరిలోకీ యరపతినేనిదే పై చేయి అని చెప్పొచ్చు . 2014 లో టీడీపీ అధికారంలోకి రాగానే గతంలో వైఎస్ జగన్ తన సిమెంట్ ఫ్యాక్టరీ అవసరాల కోసం 2007 లో దాచేపల్లి మండలంలో రైతుల దగ్గర్నుండీ మార్కెట్ ధర కన్నా ఎక్కువ చెల్లించి కొనుగోలు చేసుకొన్న భూమిని మీ భూమి మీరు స్వాధీనం చేసుకోండంటూ అమ్మకందారులను రెచ్చగొట్టి దున్నించిన ఘటనలో సూత్రధారి యరపతినేని .

పలు భూ ఆక్రమణలతో పాటు మైనింగ్ క్వారీ ఆక్రమణలు , అక్రమ క్వారీయింగ్ కి పాల్పడి వందల కోట్లు కొల్లగొట్టడంటూ పలువురు బాధితులు కోర్టులని ఆశ్రయించగా అక్రమ క్వారీయింగ్ పై కోర్టు సీబీఐ విచారణకు సైతం ఆదేశించింది . యరపతినేని బాధితుల్లో సామాన్య ప్రజలు , వ్యాపారస్తులే కాకుండా రాజకీయంగా పేరున్న కుటుంబాలకు చెందిన వారు ఉండటం కూడా విశేషం . పిడుగురాళ్లకు చెందిన మాజీ ఎమ్మెల్యే గుడిపూడి మల్లిఖార్జున రావు కుటుంబీకులకు చెందిన మైనింగ్ క్వారీ బలవంతంగా లాక్కున్న యరపతినేని తమని వేధింపులకు గురిచేస్తున్నారని ఆక్రోశిస్తూ మల్లిఖార్జున రావు కుమారుడు ఆత్మహత్యా యత్నానికి పాల్పడటం జరిగింది .

పలు అక్రమాల గురించి సోషల్ మీడియాలో నిజాలు వెల్లడించిన సోషల్ మీడియా కార్యకర్తల పై సైతం దౌర్జన్యాలు కొనసాగాయి . మైనింగ్ అక్రమాల గురించి వెల్లడించిన ముగ్గురు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల పై కేసులు బనాయించి వేధించిన యరపతినేని విదేశాల్లో నివసిస్తున్న వైసీపీ వలంటీర్లకి కూడా ఫోన్లు చేసి బెదిరించడం విశేషం .

అధికారంలో ఉన్న ఐదేళ్లు గుత్తాధిపత్యం చెలాయించిన యరపతినేని టీడీపీ అధికారం కోల్పోయాక తన మైనింగ్ అక్రమాల బాధితుల పిర్యాదులతో కేసులు నమోదు అయ్యి సీబీఐ విచారణ మొదలు కాగానే కొంతకాలం అజ్ఞాతంలోకి వెళ్లారు . తర్వాత సైతం నియోజక వర్గంలో క్రియాశీలకంగా లేకపోయినా అప్పుడప్పుడు మీడియాలో వైసీపీ పై , ప్రస్తుత గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ పై ఆరోపణలు చేస్తూ మళ్లీ వార్తల్లో నిలిచే ప్రయత్నం చేశారని చెప్పొచ్చు .

పల్నాడు ప్రాంతానికి పౌరుషాల పురిటిగడ్డ అని పేరు . చరిత్రకెక్కిన పల్నాటి యుద్ధం నుండి నేటి వరకూ ఇక్కడ జరిగిన పలు సంఘటనల ఆధారంగా ఈ పేరు వచ్చి ఉండొచ్చు.పల్నాడు ప్రాంతం నుండి రాజకీయ ప్రాతినిధ్యం వహించే వారి కొన్ని ప్రసంగాలు , సవాళ్లు కూడా దీన్నే ప్రతిబింబిస్తుంటాయి . ఇటీవల ఓ టివి ఛానెల్ డిబేట్లో పాల్గొన్న గురజాల మాజీ ఎమ్మెల్యే ,టీడీపీ నేత యరపతినేని శ్రీనివాసరావు అదే డిబేట్లో ఉన్న వైసీపీ నేత , ప్రస్తుత గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ ని ఉద్దేశించి నాకు మీసం ఉంది అని మీసం తిప్పుతూ నీకు మీసం లేదు అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు . అందుకు ప్రతిగా స్పందించిన కాసు మహేష్ గొప్పతనం మీసాల్లో ఉండదని ఎంచుకున్న రంగంలో అభివృద్ధి పథంలో నడవడంలోనూ, ప్రజలకు మేలు చేసి మెప్పు పొందడంలోనూ ఉంటుందని యరపతినేని గతాన్ని ఎత్తిచూపుతూ సున్నితంగా చురకలు వేశారు.

ఈ ఘటన జరిగిన వారాల వ్యవధిలోనే ఐదేళ్లు అప్రతిహతంగా పెత్తనం సాగించిన నియోజక వర్గంలోని స్థానిక ఎన్నికల్లో అన్ని పంచాయితీలు వైసీపీ క్లీన్ స్వీప్ చేయడంతో పాటు , పిడుగురాళ్ల మునిసిపల్ ఎన్నికల్లో కూడా 33 వార్డుల్లో ఒక్క స్థానంలో కూడా టీడీపీ అభ్యర్థిని నిలుపుకోలేకపోవడం చూస్తే యరపతినేని పలుమార్లు మీసం తిప్పుతూ చేసిన సవాళ్ళన్నీ ప్రగల్బాలుగా మిగిలిపోయాయని అని స్థానిక ప్రజలు అభిప్రాయపడుతున్నారు

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp