ప‌వ‌న్ పై గెలిచిన ఆ ఇద్ద‌రిలో ఒక‌రికి జ‌గ‌న్ కేబినెట్లో చోటు?

By Kalyan.S Sep. 06, 2021, 08:15 am IST
ప‌వ‌న్ పై గెలిచిన ఆ ఇద్ద‌రిలో ఒక‌రికి జ‌గ‌న్ కేబినెట్లో చోటు?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ అధికార పార్టీ వైసీపీలో కొంత కాలంగా ప‌ద‌వుల జాత‌ర కొన‌సాగుతూనే ఉంది. వివిధ కోటాల్లో నామినేటెడ్ ప‌ద‌వుల‌ను భ‌ర్తీ చేస్తూనే ఉన్నారు. తాజాగా రాష్ట్రంలో 47 కార్పొరేషన్లకు డైరెక్ట‌ర్ల‌ను నియ‌మించారు. ఇప్పుడు అంద‌రి దృష్టీ మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌పై ప‌డింది. తొందరలోనే మంత్రివర్గ ప్రక్షాళన ఉంటుందని అధికార వైసీపీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మంత్రివర్గ ఏర్పాటు సందర్భంగా రెండున్నరేళ్ళ తర్వాత మళ్ళీ ప్రక్షాళన చేస్తానని అప్పట్లోనే సీఎం జ‌గ‌న్ చెప్ప‌డ‌మే ఇందుకు కార‌ణం. పనితీరు ఆధారంగా కొందరిని ఉంచి మిగిలిన వాళ్ళందరినీ మార్చేస్తానని జగన్ హింట్ కూడా ఇచ్చారు. ఇప్పుడు స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతుండ‌డంతో మంత్రుల్లో టెన్ష‌న్ మొద‌లు కాగా, ప‌లువురు ఎమ్మెల్యేల‌కు కొత్త ఆశ‌లు పుట్టుకొస్తున్నాయి.

మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో వీరికి చోటంటూ కొంద‌రు ఎమ్మెల్యేల పేర్లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఈ క్ర‌మంలో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ పై గెలిచిన ఇద్ద‌రు ఎమ్మెల్యేలు కూడా మంత్రి ప‌ద‌వుల‌పై ఆశ‌లు పెట్టుకున్నారు. కాగా, మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ జ‌రిగితే వారిలో ఒక‌రికి ఖాయ‌మ‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. వారే... భీమవరం, గాజువాక ఎమ్మెల్యేలు. మొన్నటి ఎన్నికల్లో పై రెండు నియోజకవర్గాల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేసిన విషయం తెలిసిందే. ఆ రెండు నియోజకవర్గాల్లో పవన్ ఏరికోరి పోటీ చేయడానికి కారణం ఏమిటంటే అక్కడ కాపులు ఎక్కువుగా ఉండటమే అనే ప్రచారముంది. అయితే ఆశ్చర్యంగా రెండో చోట్లా పవన్ ఓడిపోయారు.

భీమవరంలో పవన్ పై గ్రంధి శ్రీనివాస్ పోటీచేసి సుమారు 3900 ఓట్ల మెజార్టీతో గెలిచారు. అలాగే గాజువాకలో పవన్ పై పోటీ చేసిన తిప్పల నాగిరెడ్డి సుమారు 4 వేల ఓట్లతో గెలిచారు. రెండు చోట్లా టైట్ ఫైట్ జరిగినా చివరకు రెండుచోట్లా పవన్ ఓడిపోయారు. దాంతో ఇద్దరికీ జెయింట్ కిల్లర్స్ అని పేరు పడింది. అప్పట్లో పవన్ ను ఓడించారన్న పేరు ఇపుడు మంత్రివర్గంలో బెర్తుకు మార్గం సుగమం చేస్తోందనే ప్రచారం మొదలైంది. ఈ ఇద్దరిలో కూడా గ్రంధి శ్రీనివాస్ అయితే మంత్రివర్గంపై బాగా ఆశలు పెట్టుకున్నారు.

ఎందుకంటే భీమవరంలో పవన్ను ఓడించటం అంత తేలిక కాదంటున్నారు. ఎందుకంటే పవన్ ది కూడా పశ్చిమగోదావరి జిల్లాయే. జిల్లాలో కాపుల మెజారిటియే ఎక్కువ ఉంది. కాకపోతే ఇటు పవన్ అటు గ్రంధి ఇద్దరు కాపులే కావటంతో కాపుల ఓట్లు చీలిపోయాయి. దానికి తోడు క్షత్రియుల ఓట్లు గంపగుత్తగా వైసీపీకి పండింది. అలాగే బీసీల ఓట్లు కూడా గ్రంధికి బాగా కలిసొచ్చింది. దాంతో పవన్ పై గ్రంధి గెలుపు సాధ్యమైంది. ఆ ఇద్దరు ఎంఎల్ఏలు పవన్ పై గెలవడంతో తొందరలో తమకు అమాత్య యోగం ఖాయమని ఎవరికి వారే చెప్పుకొంటున్నారు. మ‌రి ఆ చాన్స్ ఎవ‌రికి ద‌క్కుతుందో చూడాలి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp