సిక్కోలు ప్రగతి చిత్రం మారుతోంది

By Ramana.Damara Singh May. 05, 2021, 08:22 pm IST
సిక్కోలు ప్రగతి చిత్రం మారుతోంది

దశాబ్దాలుగా పాలకుల నిర్లక్ష్యం కారణంగా వెనుకబాటుతనంతో కుంగిపోతున్న శ్రీకాకుళం జిల్లాకు ఇంతకాలానికి మంచి రోజులు వచ్చినట్లు కనిపిస్తోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వరుసగా తీసుకుంటున్న నిర్ణయాలు జిల్లా ప్రగతిపై కొత్త ఆశలు చిగురింపజేస్తున్నాయి. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సీఎం జగన్ జిల్లాపై దృష్టి సారించడంతో పెండింగ్ ప్రాజెక్టులతో పాటు.. పలు కొత్త ప్రాజెక్టులు, పనులు మంజూరవుతున్నాయి. తాజాగా జిల్లాకు వెటర్నరీ పాలిటెక్నిక్ మంజూరు చేస్తూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఇటీవలే జిల్లాకు ఐదు ఆక్వా ల్యాబ్ లు కూడా మంజూరయ్యాయి.

పాడి పరిశ్రమలో ఉపాధికి..

శ్రీకాకుళం జిల్లాలో గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాలే అధికం. అధిక శాతం ప్రజలు వ్యవసాయం, పాడి పరిశ్రమపై ఆధారపడి జీవనం సాగిస్తుంటారు. ఈ రెండు రంగాలకు ఊతమిచ్చే పశు సంవర్థక విభాగంలో సాంకేతిక విలువలతో కూడిన విద్య, ఉపాధి అవకాశాలు పెంచితే పాడి, పంటల సాగు మరింత అభివృద్ధి చెందుతాయని ప్రభుత్వం భావించింది. ఆ ఉద్దేశంతోనే జిల్లాకు పశు సంవర్థక(వెటర్నరీ) పాలిటెక్నిక్ మంజూరు చేసింది. దీనికి రాష్ట్ర మంత్రివర్గ ఆమోదం కూడా లభించింది. సరుబుజ్జిలి మండలం వెన్నెలవలసలో దీన్ని ఏర్పాటు చేస్తారు. తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయానికి అనుబంధంగా పనిచేసే ఈ విద్యాసంస్థ భవనాల నిర్మాణానికి రూ. 9.55 కోట్లు కేటాయించారు. 30 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తారు. జిల్లాలో పాడితోపాటు మేకలు, గొర్రెల పెంపకం కూడా ఎక్కువే. వీటి పోషణకు ఉపకరించే సాంకేతిక కోర్సులు ఈ పాలిటెక్నిక్ లో అందుబాటులోకి తెస్తారు.

ఆక్వా ఉత్పత్తుల్లో నాణ్యత కోసం..

మరోవైపు జిల్లాలో పెరుగుతున్న ఆక్వా సాగులో నాణ్యత ప్రమాణాల పెంపునకు ఉపకరించే పరీక్ష కేంద్రాలు మంజూరయ్యాయి. జిల్లాలో గార, కళింగపట్నం, పోలాకి, సోంపేట తదితర తీర మండలాల్లో ఇటీవలి కాలంలో ఆక్వా సాగు పెరుగుతోంది. దీనికి సంబంధించి సీడ్(విత్తనం), ఫీడ్ తయారీలో నాణ్యత పెంచితే ఎగుమతులు పెరుగుతాయి. ఈ నాణ్యత పరీక్షల కోసం ఉత్తరాంధ్రలో విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో టెస్టింగ్ ల్యాబ్స్ ఉన్నా పాత కాలంనాటి పరికరాలు దాదాపు పనిచేయడంలేదు. వాటిని ఆధునికీకరించడంతో పాటు కొత్తగా రాష్ట్రంలో మంజూరు చేసిన 27 ల్యాబ్స్ లో 5 శ్రీకాకుళానికి, ఒకటి విజయనగరానికి కేటాయించారు. ఇందుకు రూ. 50.30 కోట్లు ఇటీవలే విడుదల చేశారు. ఈ నిధుల్లో రూ. 20 కోట్లు ఆధునిక పరికరాల కొనుగోలుకు, మిగతా రూ. 30.30 కోట్లను భవనాల నిర్మాణానికి వినియోగిస్తారు. వైఎస్సార్ అగ్రి ల్యాబ్స్ కు అనుబంధంగా పనిచేసే ఈ ల్యాబ్స్ లో సీడ్, ఫీడ్ నాణ్యత పరీక్షలతో పాటు మట్టి, నీటి నమూనాలు పరీక్షిస్తారు. ఉత్పత్తి చేసే సీడ్, ఫీడ్ నమూనాలను ఇక్కడ పరీక్షించి.. ఆమోదిస్తేనే వాటిని మార్కెట్లోకి వెళ్లనిస్తారు. వీటి ఏర్పాటు ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహిస్తుందని భావిస్తున్నారు. ఇవే కాకుండా ఏళ్ల తరబడి అంతర్రాష్ట్ర వివాదంలో ఉన్న నెరడి బ్యారేజ్ విషయమై ఒడిశా సీఎంకు లేఖ రాయడం ద్వారా జగన్ కదలిక తీసుకొచ్చారు. అలాగే దశాబ్దాల కోరిక అయిన భవనపాడు పోర్టు, కళింగపట్నం ఫిష్ లాండింగ్ జెట్టీ ఏర్పాటుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp