మండలిలో వైఎస్సార్సీపీకి ఆ నలుగురు,వారికే ఎందుకు అవకాశం ఇచ్చినట్లు?

By Raju VS Jun. 11, 2021, 09:00 am IST
మండలిలో వైఎస్సార్సీపీకి ఆ నలుగురు,వారికే ఎందుకు అవకాశం ఇచ్చినట్లు?

ఆంధ్ర్రప్రదేశ్ శాసనమండలిలో ఉన్న మెజార్టీని చూసుకుని నిన్న మొన్నటి వరకూ తెలుగుదేశం అనేక అడ్డంకులు పెట్టే ప్రయత్నం చేసింది. చివరకు బడ్జెట్ ని ఆమోదించడానికి కూడా అడ్డుపుల్ల వేసి ప్రభుత్వ కార్యకలాపాలను ముందుకు సాగకుండా చేయాలనే సంకల్పంతో ఉన్నట్టు కనిపించింది. అయినా అన్నింటినీ సహనంతో అధిగమించి, జగన్ ప్రభుత్వం ముందుకెళుతోంది. ఇక ప్రస్తుతం టీడీపీ మెజార్టీకి కళ్ళెం వేస్తూ ఎగువ సభలో కూడా ఆధిక్యం సాధించబోతోంది. అందులో భాగంగా గవర్నర్ కోటాలో నలుగురు ఎమ్మెల్సీల నియామకానికి వైఎస్సార్సీపీ అధినేత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దానికి అనుగుణంగా ఫైల్ గవర్నర్ కి చేరింది.

Also Read:ఢిల్లీలో యోగి.. యూపీలో ఏం జ‌ర‌గ‌బోతోంది?

ఈసారి కొత్త ఎమ్మెల్సీలుగా అనుభవం, సామాజిక సమతూకం ప్రాధాన్యతతో ఎంపిక చేసినట్టు కనిపిస్తోంది. పార్టీ ప్రదాన కార్యాలయం ఇన్ఛార్జ్ గా ఉన్న గుంటూరు జిల్లా లేళ్ల అప్పిరెడ్డికి ఎమ్మెల్సీ అవకాశం దక్కింది. ఆయన సుదీర్ఘకాలంగా జగన్ వెంట ఉన్నారు. అంతేగాకుండా గుంటూరు వెస్ట్ నియోజకవర్గం నుంచి 2014లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2019లో యేసురత్నం కోసం టికెట్ ని త్యాగం చేశారు. దాంతో ఆయనకు తగిన స్థానం కల్పిస్తానని జగన్ ఇచ్చిన హామీని ప్రస్తుతం గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవి ద్వారా నెరవేర్చుతున్నట్టు కనిపిస్తోంది.

పశ్చిమ గోదావరి జిల్లాకి చెందిన సీనియర్ నేత కొయ్యా మోషేన్ రాజు ఇప్పటికే పలుమార్లు అవకాశాలు వచ్చి చివరి క్షణంలో చేజారిపోవడం ఆనవాయితీ అన్నట్టుగా కనిపించింది. కానీ ఈసారి జగన్ ఎస్సీ కోటాలో ఆయన పేరుని ఖరారు చేశారు. ఎమ్మెల్సీ ఖాళీలు భర్తీ చేయాల్సిన ప్రతీ సందర్భంలోనూ ఓ ఎస్సీ నేతకు అవకాశం ఇస్తున్నారు. ఈసారి ఆ ఛాన్స్ మోషేన్ రాజుకి దక్కింది. గతంలో కాంగ్రెస్ లో పనిచేసిన మోషేన్ రాజు వైఎస్సార్సీపీ ఆవిర్భావం నుంచి జగన్ వెంట ఉన్నారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పార్టీ కార్యక్రమాల నిర్వహణలో క్రియాశీలకంగా పనిచేశారు. దానికి ప్రతిఫలంగా ఆయన ఆశించిన ఎమ్మెల్సీ హోదా దక్కుతున్నట్టు కనిపిస్తోంది.

Also Read:జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న ఎందుకో ఇప్పుడైనా క్లారిటీ వ‌చ్చిందా..?

మరో సీనియర్ నేత తోట త్రిమూర్తులు పేరు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఖరారు కావడం రాజకీయంగా కీలక పరిణామం. గోదావరి జిల్లాల్లో కాపు సామాజికవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఆయనకు అవకాశం దక్కినట్టు చెబుతున్నారు. ఇప్పటికే రామచంద్రాపురం నియోజవర్గం నుంచి మంత్రిగా చెల్లుబోయిన వేణు ఉండగా, మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ప్రస్తుతం రాజ్యసభలో ఉన్నారు. అయితే ప్రస్తుతం మండపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్న తోట త్రిమూర్తులు వచ్చే ఎన్నికల్లో అక్కడ పాగా వేయాలని పావులు కదుపుతున్నారు. అదే సమయంలో జిల్లాలో కాపు వర్గంలో గుర్తింపు ఉన్న నేతగా ఆయనకు అవకాశం దక్కినట్టు కనిపిస్తోంది.

ఈసారి ఎమ్మెల్సీల ఎంపికలో కూడా జగన్ మార్క్ కనిపించింది. గతంలో విజయవాడ కార్పోరేటర్ గా పోటీ చేస్తున్న మహిళా నేతను ఎమ్మెల్సీ చేసిన జగన్, ఈసారి ప్రొద్దుటూరు కౌన్సిలర్ కి శాసనమండలిలో సీటు కల్పించడం ఆసక్తికరం. ఆర్వీ రమేష్ యాదవ్ ఇటీవల ప్రొద్దుటూరు మునిసిపల్ చైర్మన్ సీటు ఆశించారు. అయితే సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఆయనకు అవకాశం రాలేదు. దానికి తగిన హోదా కల్పిస్తామని అధిష్టానం నుంచి హామీ వచ్చింది. దానికి ప్రతిఫలంగా ప్రస్తుతం ఆయన ఎమ్మెల్సీగా ఎన్నిక ఖరారయ్యింది.

Also Read:ఉండవల్లి ఏం చేస్తున్నారు ? ! ..

నాలుగు ఎమ్మెల్సీ స్థానాలకు గానూ ఒక ఎస్సీ, ఒక బీసీ, ఒక కాపు, ఒక రెడ్డి సామాజిక వర్గాలకు కేటాయించడం గమనిస్తే సామాజిక సమతూకం ఏ స్థాయిలో పాటిస్తున్నారో అర్థమవుతుంది. ఇప్పటి వరకూ మండలికి నామినేట్ చేసిన దాదాపు అన్ని సందర్భాల్లో కూడా ఇదే పద్ధతి అవలంభించగా ఈసారి కూడా అదే పంథాలో సాగారు. చంద్రబాబు హయంలో ఆర్థికంగా బలమైన నేతలకు అటు రాజ్యసభ, ఇటు మండలిలో చోటు కల్పించడం అలవాటుగా ఉండేది. కానీ అనేక మంది సామాన్యులు, సామాజిక నేపథ్యంలో నుంచి ప్రస్తుతం మండలిలో అవకాశం దక్కించుకుంటుండడం జగన్ మార్క్ రాజకీయాలకు అద్దంపడుతోంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp