కృష్ణాలో నదీ జలాలు ఉరుకులు - ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఎత్తివేత

By Raju VS Jul. 12, 2020, 09:30 am IST
కృష్ణాలో నదీ జలాలు ఉరుకులు - ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఎత్తివేత

వరుసగా రెండో ఏడాది కూడా కృష్ణా నదిలో వరద ఉధృతి మొదలయ్యింది. నదీ జలాల ప్రవాహపు పరుగులతో ప్రకాశం బ్యారేజ్ నుంచి మిగులు జలాలు సముద్రంలోకి వదులుతున్నారు. అది కూడా గత ఏడాదితో పోలిస్తే నెల రోజుల ముందుగానే బ్యారేజ్ గేట్లు ఎత్తాల్సిన పరిస్థితి రావడం విశేషం. నిరుడు ఆగష్ట్ 12 నాడు ప్రకాశం బ్యారేజ్ నుంచి సముద్రంలోకి నీటిని వదిలేందుకు గేట్లు ఎత్తితే ఈసారి అది జూలై 11నాడే గేట్లు ఎత్తే పరిస్థితి రావడం విశేషం. అదే సమయంలో పట్టిసీమ నుంచి కృష్ణా నదిలోకి నీటిని తరలించే ప్రక్రియను కూడా తాత్కాలికంగా నిలిపివేశారు. ఎగువ నుంచి కృష్ణా నదిలోకి ఇన్ ఫ్లో ఆశాజనకంగా ఉండడంతో లిఫ్ట్ ని తాత్కాలికంగా ఆపేసినట్టు అధికారులు ప్రకటించారు.

ప్రకాశం బ్యారేజ్ వద్దకు 16వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లోస్ నమోదవుతున్నాయి. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో కృష్ణమ్మకు జలకళ సంతరించుకుంది. ఇక ఆల్మట్టి నుంచి కూడా మిగులు జలాలు విడుదలయ్యే పరిస్థితి ఏర్పడడంతో శ్రీశైలం ప్రాజెక్ట్ కి కూడా నీరు చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఆ తర్వాత నాగార్జున సాగర్, పులిచింతల ద్వారా ప్రకాశం బ్యారేజ్ కి ఎగువ నుంచి భారీగా వరద జలాలు వచ్చి పడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దాంతో బ్యారేజ్ వద్ద నీటిని క్రమబద్ధీకరించడం కోసంమంటూ ఆదివారం ఉదయానికి 7 గేట్లు ఎత్తేశారు. 10,816 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.

కృష్ణా నదిలో జూలైలో వరద తాకిడి కనిపించడం చాలా అరుదు. అలాంటిది ఈసారి త్వరగా నదిలో వరద తాకిడి కనిపించడంతో ఈసారి కూడా కృష్ణా డెల్టా ఆయకట్టు రైతులకు ఊరట లభిస్తుందని అంతా భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం కృష్ణా నదికి వస్తున్న జలాలు ఖమ్మం జిల్లాలో కురుస్తున్న వర్షాల కారణంగానేనని చెబుతున్నారు. వెలగలేరు వాగు నుంచి భారీగా ఇన్ ఫ్లోస్ వస్తున్నట్టు చెబుతున్నారు. ఆ తర్వాత కృష్ణా నదీ జలాలు కూడా వచ్చి చేరితో బ్యారేజ్ వద్ద మరింతగా మిగులుజలాలు నమోదయ్యే అవకాశం ఉంది. దాంతో పట్టిసీమ లిఫ్ట్ స్కీమ్ నిలిపివేశారు. జూన్ 18న ఈ సీజన్ లో పట్టిసీమ నుంచి నీటిని తరలించే ప్రక్రియ ప్రారంభించగా జూలై 11న నిలిపివేయడం విశేషం . మరోవైపు కృష్ణా డెల్టాకు బ్యారేజ్ నుంచి 10 టీఎంసీల నీటిని విడుదల చేశారు.

గోదావరిలో కూడా వరద తాకిడి కనిపిస్తోంది. ఆదివారం ఉదయానికి ధవళేశ్వర బ్యారేజ్ వద్ద 8.10 అడుగులకు నీటి మట్టం చేరింది. 98వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. దిగువన లంకల్లోకి ఇప్పటికే వరద నీరు చేరింది. వశిష్ట, వైనతేయ , గౌతమీ పాయల్లో గోదావరి ఉరకలెత్తుతోంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp