బంగారం.. భారతీయులు

By Jaswanth.T Aug. 01, 2020, 11:40 am IST
బంగారం.. భారతీయులు

భారతీయులకు, బంగారానికి ఉన్న బంధం గురించి ప్రపంచ దేశాలు ప్రత్యేకంగా చెప్పుకుంటుంటాయి. ఇతర దేశాల్లో కేవలం వ్యాపార దృక్ఫథంతో మాత్రమే బంగారాన్ని కొంటుంటారు. అయితే ఇక్కడ మాత్రం తమ జీవితంలో ఒక భాగంగా చూస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎంత చిన్న స్థాయిలో పెళ్ళి, లేదా కథాకార్యం జరుగుతున్నప్పటికీ ఎంతో కొంత బంగారాన్ని కొనడం ఆనవాయితీ. పండుగలు, ఫంక్షన్లలో మార్పులు ఉన్నప్పటికీ దాదాపు భారతదేశ మంతా ఏదో రీతిలో బంగారాన్ని కొనడానికి మొగ్గుచూపుతుంటారు.

ప్రపంచ గమనాన్ని మార్చివేసిన కోవిడ్‌ 19.. భారతీయుల బంగారం కొనుగోలు అలవాటును కూడా మార్చేసిందని గణాంకాలు తేల్చాయి. ముఖ్యంగా శ్రావణ మాసంలో దక్షిణాది రాష్ట్రల్లో బంగారం వినియోగం ఎక్కువగా ఉంటుంది. మంచి ముహూర్తాలు సరిగ్గా ఆ సమయంలోనే ప్రారంభం కావడంతో పాటు, శ్రావణ శుక్రవారం వంటి పండుగలకు మహిళలు తప్పకుండా బంగారాన్ని కొనడం ఆనవాయితీ. అయితే ఇప్పుడా ఆనవాయితీని కూడా పక్కన పెట్టేలా కరోనా చేసిందనే చెప్పాలి. పది గ్రామాలు ధర రూ. 52వేలు పలుకుతున్న కారణంగా ఒకటిగా చెబుతున్నప్పటికీ ఇదే స్థాయిలో గతంలో కూడా ధరలు పెరిగినప్పటికీ కొనుగోళ్ళు ఇప్పుడు తగ్గినంత భారీగా తగ్గలేదని వ్యాపారులు చెబుతున్నారు. గత ఇరవయ్యేళ్ళను పరిగణనలోకి తీసుకుంటే ఎక్కువ సంవత్సరాలు పది గ్రాముల బంగారం ధర రూ. 24–28వేలు మధ్య తచ్చాడింది. ఆ తరువాత ఉన్నంట్టుండి రూ. 33–35వేల మధ్యకు చేరుకుంది. అప్పట్లో అదే భారీ పెంపు. 33–35వేల మధ్యకు చేరినప్పుడు కూడా పెళ్ళి ముహూర్తాల సమయంలో కొద్దిగా అమ్మకాలు తగ్గినా వ్యాపారాల లావాదేవీల్లో మాత్రం పెద్దగా మార్పులేమీ లేవని ఆ నాటి సంఘటనలు ఇప్పుడు వ్యాపారులు ఉదహరిస్తున్నారు. 

కానీ లాక్డౌన్‌కు ముందు కూడా రూ. 38వేలకు అటూ ఇటూగా ఉన్న బంగారం పది గ్రాముల ధర ప్రస్తుతం 52వేలకు చేరుకుంది. వాస్తవానికి ధరల పెంపు భారతీయ కొనుగోలుదారులను పెద్దగా ప్రభావితం చేయదని గతంలోని వ్యాపారల లావాదేవీలు స్పష్టం చేస్తున్నాయి. కానీ ఈ సారి మాత్రం ఆ అంచనాలు ఫలించలేదని వ్యాపారులే పేర్కొంటున్నారు. గతానికంటే భిన్నంగా కార్పొరేట్‌ సంస్థలు బంగారం అమ్మకాల్లోకి వచ్చాయి. చిన్నచిన్న షాపులతో పోలిస్తే భారీగానే రాయితీలు ఇస్తూ కొనుగోలుదారులను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. అయినప్పటికీ కొనుగోలదారుల ఆర్ధిక పరిస్థితి నేపథ్యంలో బంగారం కొనుగోళ్ళు భారీగా తగ్గాయని అంచనా వేస్తున్నారు. గత యేడాది ఇదే సమయంలో బంగారం దిగుమతులతో పోలిస్తే ఈ యేడాది దిగుమతులు 95శాతం పైగా తగ్గిపోయినట్లుగా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. గత యేడాది ఏప్రియల్‌–జులై నెలలకు గాను సుమారు 248 టన్నుల వరకు బంగారాన్ని దిగుమతి చేసుకోగా, ఈ యేడాది అదే సమయంలో కేవలం 12 టన్నుల వరకు మాత్రమే దిగుమతైంది. ఈ లెక్కన భారతీయ మార్కెట్‌లో బంగారం కొనుగోళ్ళు ఏ స్థాయిలో దిగజారాయో అర్ధం చేసుకోవచ్చును.

శ్రావణ మాసం నుంచి ప్రారంభమయ్యే శుభకార్యాల నేపథ్యంలో కొనుగోళ్ళు భారీగా పెరిగేందుకు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంత మాత్రం అవకాశం లేదని వ్యాపారులు భావిస్తున్నారు. రానున్న రోజుల్లో కోవిడ్‌ 19 మరింతగా విస్తృతమవుతుందన్న అంచనాల నేపథ్యంలో ఈ భావన వ్యక్తమవుతోంది. వాస్తవానికి ధరల పెరుగుదల కంటే కూడా ఇప్పుడు వినియోగదారుల ఆర్ధిక స్థితిలో చోటు చేసుకున్న వ్యత్యాసాల వల్లే బంగారం మార్కెట్‌లో కొనుగోళ్ళు పడిపోవడానికి కారణంగా చెబుతున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp