మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి గోదావరి

By Jaswanth.T Aug. 14, 2020, 09:35 pm IST
మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి గోదావరి

ఎగువ ప్రాంతాల నుంచి వచ్చి పడుతున్న వరద నీటితో గోదారమ్మ పరవళ్ళు తొక్కుతోంది. శనివారం నాటికి మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి వరద చేరుకుంటుందని ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ఇరిగేషన్‌ అధికారులు అంచనా వేస్తున్నారు. బ్యారేజీకి ఉన్న 175 గేట్లు తెరిచి ఉండగా, నీటిమట్టం 11.75 అడుగులకు చేరుకుంటే మొదటి ప్రమాదహెచ్చరిక జారీ చేస్తారు. ఇప్పుడు వచ్చి చేరుతున్న నీటి ఉధృతిని అంచనా వేయడం ద్వారా శనివారం ఈ స్థాయికి వరద చేరుకుంటుందన్న అభిప్రాయపడుతున్నారు. నీటి మట్టం 13.75 లక్షలకు చేరుకుంటే రెండో ప్రమాద హెచ్చరిక, 17.75 అడుగులకు చేరుకుంటే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. వరద ప్రభావం వల్ల ధవళేశ్వరం దిగువన ఉన్న కోనసీమ లంక గ్రామాల్లో పంటలు మునిగిపోయే ప్రమాదం ఉంది.

ప్రస్తుతం 10 అడుగులకు నీటి మట్టం చేరుకుంది. అలాగే 7,86,935 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. భారీ వర్షాలకు గోదావరి క్యాచ్‌మెంట్‌ ఏరియాలోని శబరి, ఇంద్రావతి, సీలేరు నదుల నుంచి భారీగా వరద నీరు గోదావరికి వస్తోంది. కాళేశ్వరం వద్ద 8.380 మీటర్లు, పేరూరు వద్ద 11.080 మీటర్లు, దుమ్ముగూడెం వద్ద 11.010 మీటర్లు, భద్రాచలం వద్ద 37.90 అడుగులు, కూనవరం వద్ద 15.600 మీటర్లు, కుంట వద్ద 11.450 మీటర్లు, కోయిడ వద్ద 20.360 మీటర్లు, కాఫర్‌డ్యామ్‌ వద్ద 26.750 మీటర్లు, పోలవరం వద్ద 11.990 మీటర్లు, రాజమహేంద్రవరం పాత రైల్వే బ్రిడ్జి వద్ద 15.670 మీటర్లు నీటి మట్టం నమోదైంది.


సుమారు గంట వ్యవధిలోనే ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నుంచి విడుదల చేసే నీరు 7,77,286 క్యూసెక్కుల నుంచి 7,86,935 క్యూసెక్కులకు పెరిగింది. దీంతో రానున్న 24 గంటల్లో మరింతగా వరద నీరు పెరుగుతుందన్న అంచనాలు వేస్తున్నారు. కాగా డెల్టాలోని పంట కాలువలకు 9,250 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇదిలా ఉండగా తూర్పుగోదావరి జిల్లా పరిధిలో పోసమ్మగండి వద్ద అమ్మవారి ఆలయం సమీపానికి వరదనీరు చేరుకుంది. అలాగే పోలవరం వద్ద వరద ఉగ్రరూపానికి సమీపంలోని పంట పొలాలు నీట మునిగాయి. పోలవరం ప్రాజెక్టుకు ఎగువన ఉన్న ఏజెన్సీ గ్రామాలకు ఉన్న రోడ్డు మార్గంపై సుమారు 20 అడుగుల ఎత్తు వరకు నీరు ప్రవహిస్తోంది. గోదావరిపై బోట్లు ప్రయాణాన్ని అధికారులు నిషేధించారు.


idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp