కార్పొరేష‌న్ లు అన్నింటికీ ఒకేసారి ఎన్నిక‌లా..?

By Kalyan.S Sep. 25, 2020, 05:08 pm IST
కార్పొరేష‌న్ లు అన్నింటికీ ఒకేసారి ఎన్నిక‌లా..?

తెలంగాణ లో ఎన్నిక‌ల సంద‌డి ఊపందుకుంది. ఓ వైపు కార్పొరేష‌న్.. మ‌రోవైపు ఎమ్మెల్సీ ఎన్నిక‌ల హ‌డావిడి మొద‌లైంది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా టీఆర్ఎస్ శ్రేణుల‌తో స‌మావేశ‌మై నేత‌ల‌కు ఎన్నిక‌ల‌కు సంబంధించి దిశా నిర్దేశం చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల‌కు సంబంధించి ఇప్ప‌టికే స‌ర్వే కూడా నిర్వ‌హించిన‌ట్లు ఆయ‌నే స్వ‌యంగా ప్ర‌క‌టించారు. దీంతో ఎన్నిక‌ల వాతావ‌ర‌ణం మొద‌లైంది. జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల‌కు సంబంధించి క‌మిష‌న‌ర్ లోకేష్ కుమార్ నోడ‌ల్ అధికారుల‌ను కూడా ప్ర‌క‌టించారు. వారికి విభాగాల వారీగా బాధ్య‌త‌లు అప్ప‌గించారు. అయితే జీహెచ్ఎంసీ తో పాటు గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ (జీడ‌బ్ల్యూఎంసీ), ఖ‌మ్మం కార్పొరేష‌న్ ఎన్నిక‌లు కూడా క‌లిపి నిర్వ‌హిస్తారా..? లేదా విడివిడిగా నిర్వ‌హిస్తారా అనే చ‌ర్చ మొద‌లైంది.

ఆ 35 రోజుల‌కే గ్రేట‌ర్ వ‌రంగ‌ల్..

గ్రేట‌ర్ హైద‌రాబాద్ మునిసిప‌ల్ కార్పొరేష‌న్ (జీహెచ్ఎంసీ) ప‌ద‌వీ కాలం ఫిబ్ర‌వ‌రి 10తో ముగియ‌నుంది. ఈ పాల‌క‌మండ‌లి ప‌ద‌వీ కాలం ముగిసిన 35 రోజుల‌కే జీడ‌బ్ల్యూఎంసీ, ఖ‌మ్మం కార్పొరేష‌న్ ల పాల‌క‌మండ‌లి గ‌డువు కూడా ముగియ‌నుంది. అంటే మార్చి 14, 2021తో వాటి గ‌డువు ముగియ‌నుంది. దీంతో వాటి మ‌ధ్య త‌క్కువ వ్య‌వ‌ధే ఉంది కాబ‌ట్టి ఒకేసారి ఎన్నిక‌లు నిర్వహిస్తారా..? విడివిడిగానా అనే చ‌ర్చ మొద‌లైంది. జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల‌కు సంబంధించి ఇప్ప‌టికే ఏర్పాట్లు మొద‌ల‌య్యాయి. అధికారుల మీటింగ్ లు, చ‌ర్చ‌లు చ‌క‌చ‌కా జ‌రుగుతున్నాయి. వ‌రంగ‌ల్, ఖ‌మ్మం కార్పొరేష‌న్ల‌లో ప్ర‌స్తుతానికి ఆ హ‌డావిడి లేదు. దీనిపై త్వ‌ర‌లోనే ఓ నిర్ణ‌యానికి రానున్న‌ట్లు తెలుస్తోంది.

వేర్వేరుగా అయితే...

ఆ మూడు కార్పొరేష‌న్ ల‌కు వేర్వేరుగా ఎన్నిక‌లు నిర్వ‌హిస్తే జీహెచ్ఎంసీలో జ‌న‌వ‌రి లేదా ఫిబ్ర‌వ‌రిలో ఎన్నిక‌లు జ‌రిగే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో వ‌రంగ‌ల్, ఖ‌మ్మం జిల్లాల‌కు ఫిబ్ర‌వ‌రి లేదా మార్చి నెల‌లో ఎన్నిక‌లు నిర్వ‌హించ‌వ‌చ్చు. ఈ కార్పొరేష‌న్ ల‌తో పాటు సిద్ధిపేట, అచ్చంపేట తో పాటు మ‌రికొన్ని మున్సిపాలిటీల ‌ప‌ద‌వీ కాలం కూడా ఏప్రిల్ మొద‌టి వారంలో ముగియ‌నుంది. దీన్ని బ‌ట్టి తెలంగాణ‌లో వ‌చ్చే ఏడాది ప్రారంభం నుంచి ఏప్రిల్ వ‌ర‌కూ వ‌ర‌స ఎన్నిక‌లు జ‌రిగే అవ‌కాశం ఉంది. ఈ మేర‌కు అధికారులు డిసెంబ‌ర్ నాటికే ఏర్పాట్లు పూర్తి చేసేలా స‌మాయ‌త్తం అవుతున్నారు. ఈసీ తో పాటు ప్ర‌భుత్వ నిర్ణ‌యంపై కూడా ఈ ఎన్నిక‌లు ఆధార‌ప‌డి ఉంటాయి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp