గామన్ గతి ఇంతేనా..?

By Voleti Divakar Aug. 13, 2020, 08:49 pm IST
గామన్ గతి ఇంతేనా..?

'గామన్ వంతెన గతీ ఇంతేనా. మా ప్రయాణ కష్టాలు ఇప్పట్లో తీరవా?.' ఇదీ ఉభయ గోదావరి జిల్లాల ప్రజల ఆవేదన. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్సార్ హయాంలో ఉభయ గోదావరి జిల్లాలను కలిపే విధంగా గోదావరి నదిపై సుమారు రూ. 800కోట్లకు పైగా వెచ్చించి రోడ్డు వంతెనను నిర్మించారు. ఈవంతెనను గామన్ సంస్థ నిర్మించడంతో గామన్ వంతెనగా పేరుపొందింది.

కోల్ కత్తా- చెన్నై ప్రధాన మార్గంలో ఉన్న రోడ్డుకంరైలు వంతెన దెబ్బతినడంతో రోడ్డు రవాణాకు అత్యంత కీలకంగా భావించి మాజీ మంత్రి దివంగత జక్కంపూడి రామ్మోహనరావు, మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ విజ్ఞప్తి మేరకు నాటి ముఖ్యమంత్రి వైఎస్సార్ వెంటనే వంతెన నిర్మాణానికి అనుమతులు ఇచ్చారు. విశాఖపట్నం నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాలకు ఈ మార్గం ఎంతో అనువుగా ఉంటుంది. 5వ నెంబరు జాతీయ రహదారి కన్నా ఈ మార్గంలో ప్రయాణిస్తే సుమారు 30-40 కిలోమీటర్ల దూరం, ఆమేరకు ఇంధన వ్యయం కలిసి వస్తాయి. దీంతో కోల్ కత్తా-చైన్నై మధ్య ప్రయాణించే భారీ వాహనాలు, లారీలు ఇదే మార్గంలో ప్రయాణిస్తాయి. దీంతో రాజమహేంద్రవరం నగరంలో వాహనాల రద్దీ కాస్త తగ్గుతుంది.

అయితే నేతలు ఆశించినది ఒకటి అయితే ప్రస్తుతం జరుగుతున్నది మరోటి. ఈ మార్గం వల్ల వాహనదారులు, ప్రయాణీకులకు జరిగే మేలు కన్నా కీడు ఎక్కువగా జరుగుతోంది. వంతెనకు అనుసంధానంగా ఉన్న ఈ రోడ్డు అంత్యంత అధ్వాన్నంగా ఉన్నా ఈ వంతెన మీదుగా వెళ్లాలంటే కార్లకు రూ. 70, మధ్యతరహా వాహనాలకు 170, భారీ వాహనాలకు రూ. 270 టోల్ టాక్స్ ను చెల్లించాల్సిందే. టోల్ టాక్సును వసూలు చేసే గామన్ సంస్థ వంతెన నిర్వహణను మాత్రం గాలికి వదిలేసింది.


వంతెన మార్గంలో అడుగుకో గుంత చొప్పున రోడ్డంతా గుంతల మయంగా మారింది. ఇవి ఒకటి నుంచి 3 అడుగుల లోతులో రోడ్డంతా ఆక్రమించాయి. దీంతో ఈ మార్గంలో వాహనంలో కన్నా నడిచి వెళ్లడమే మంచిదన్న భావన నెలకొంది. ఈ రోడ్డు గురించి తెలియని వాహనదారులు ఈ మార్గంలోకి వచ్చి బలైపోతున్నారు. తక్కువ సమయంలో, తక్కువ ఇంధనంతో గమ్యాన్ని చేరుకోవచ్చని ఆశ పడిన వారికి ఈ ప్రయాణం నరకప్రాయమవుతోంది.

గామన్ వంతెన దుస్థితి పై వచ్చిన కథనాల పై స్పందించిన కాపు కార్పొరేషన్ చైర్మన్, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, రాజమహేంద్రవరం ఎంపి మార్గాని భరత్ రామ్ పరిశీలించారు. వెంటనే ఈ రోడ్డుకు మరమ్మతులు చేయాలని గామన్ సంస్థ ప్రతినిధులను ఆదేశించారు. రోడ్డుకు మరమ్మతులు చేసే వరకు టోల్ టాక్స్ వసూలు చేయరాదని జక్కంపూడి రాజా స్పష్టం చేశారు. అయినా గామన్ సంస వారి ఆదేశాలను పట్టించుకోవడం లేదు. రోడ్డు ఎలా ఉన్నా.. టోల్ వాసులు చేస్తూనే ఉంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp