కాటి ఖర్చులూ పెంచేశారు..!

By Voleti Divakar Aug. 13, 2020, 08:05 pm IST
కాటి ఖర్చులూ పెంచేశారు..!

ఈ కరోనా కాలంలో రెప్పపాటు జీవితం వ్యాపార వస్తువుగా మారిపోయింది. కరోనా సోకితే వైద్యానికి ఖర్చు...కన్నుమూస్తే కాటికి ఖర్చు. తాజాగా దేశంలోని నెలకొన్న దుస్థితి ఇది. కరోనా మహమ్మారి పేద, ధనిక భేదం లేకుండా అందరి జీవితాలను చిన్నాభిన్నం చేస్తోంది. కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన తొలి నాళ్లలో కరోనా అంటేనే ఆమడ దూరం పారిపోయేవారు.

ఇప్పుడు మహమ్మారి అందర్నీ చుట్టేస్తుండటంతో కాస్త దగ్గు, రొంప వస్తే చాలు ఏదో అయిపోయిందన్న ఆందోళనతో ఆసుపత్రుల వెంట పరుగులు తీస్తున్నారు. పెరుగుతున్న కేసులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రవ్యాప్తంగా కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్య సేవలకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ప్రజల్లోని ఆందోళనే ప్రైవేటు ఆసుపత్రులకు ఆదాయంగా మారింది. విజయవాడలో స్వర్ణ ప్యాలెస్ లో జరిగిన దుర్ఘటనే ఇందుకు నిదర్శనం.

ప్రభుత్వం నిర్ణయించిన ధరల మేరకు వైద్యం అందించాల్సిన ప్రైవేటు ఆసుపత్రులు పరీక్షలు, ఇతరత్రా ఫీజుల పేరుతో రోగులను పీల్చి పిప్పి చేస్తున్నాయి. ప్రభుత్వాసుపత్రులపై ఎగువ మధ్య, ధనిక వర్గాలకు ఉన్న అపోహలు కూడా ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీకి దోహదం చేస్తున్నాయి. కరోనా కష్ట సమయంలో ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు సామాజిక బాధ్యతను, మానవత్వాన్ని కూడా విస్మరించి వైరస్ తో వ్యాపారం చేస్తున్నాయి. ఆర్థిక స్తోమత కాస్త తక్కువగా ఉన్న వారిని చేర్చుకునేందుకు బెడ్లు ఖాళీ లేవన్న సాకును చూపించి తిరస్కరిస్తున్నారు. ఒకవైపు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పడకలు ఖాళీ లేక ప్రైవేటు ఆసుపత్రుల్లో ఖర్చులు భరించలేక పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు.

ప్రైవేటు ఆసుపత్రుల పరిస్థితి అలా ఉంటే రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో నడుస్తున్న స్మశానవాటికలు కూడా కరోనా రేట్లు వసూలు చేస్తున్నట్లు మృతుల కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంత్యక్రియలను వీరు ఒక వ్యాపారంగా మార్చేశారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉదాహరణకు రాజమహేంద్రవరం నగరంలో రోటరీ కైలాస భూమి పేరిట రెండు స్మశానవాటికలను ప్రైవేటు వ్యక్తులు నిర్వహిస్తున్నారు. రెండు నెలలకు ముందు వరకు ఇక్కడ ఒక మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించాలంటే రూ. 4-5వేల వరకు వసూలు చేసేవారు. కరోనా మృతుల సంఖ్య పెరగడంతో అంత్యక్రియల రేట్లు 7-8వేలకు పెంచేశారు.

పల్లెల్లో కరోనా పట్ల ప్రజల్లో ఉన్న భయాందోళనల నేపథ్యంలో భౌతికకాయాలను సమీపంలోని నగరాలు, పట్టణాలకు తీసుకుని వచ్చి అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. స్మశానవాటికల వారికి ఇదో అవకాశంగా మారింది. ప్రభుత్వం ఇస్తున్న 15 వేల రూపాయల్లో సగం స్మశాన వాటికల నిర్వాహకుల జేబుల్లోకి వెళుతోంది. కరోనా మృతులకే కాక సహజంగా చనిపోయిన వారి అంత్యక్రియలకు అదే మొత్తం వసూలు చేస్తున్నారు. అధిక చార్జీలు వసూలు చేస్తున్న శ్మశాన వాటికల నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp