సైబరాబాద్ నుండి - అమరావతి వరకు

By Krishna Babu Jan. 21, 2020, 11:38 am IST
సైబరాబాద్ నుండి - అమరావతి వరకు

అభివృద్ధి అనేది ఒక నిరంతర ప్రక్రియ. ఒక ప్రాంత ,రాష్ట్ర అభివృద్ధికి దీర్ఘకాలిక ప్రణాళిక,చిత్తశుద్ధి కలిగిన ప్రయత్నం అవసరం. రాత్రికి రాత్రే మంత్రం వేసినట్టు అభివృద్ది జరిగిపోదని అందరికీ తెలిసిన విషయమే. బెంగళూరు , చెన్నై, డిల్లీ, ముంబాయి , హైదరాబాద్ లాంటి మహా నగరాలు ఏర్పడటానికి వందల ఏళ్ళు పట్టింది. ఏ ప్రభుత్వమూ అభివృద్దిని అడ్డుకునే సాహసం చేయదు. ఒక ప్రభుత్వంలో శంఖుస్థాపన జరిగి, మరో ప్రభుత్వంలో పనులు ప్రారంభం అయి, ఇంకొక ప్రభుత్వంలో ప్రారంభోత్సవం జరిగిన ప్రాజెక్టులు ఈ దేశంలో,రాష్ట్రంలో అనేకం ఉన్నాయి .

సమస్య ఎప్పుడు వస్తుందంటే ,నేను రాక ముందు అభివృద్ధి అనేదే జరగలేదు,మొత్తం నేనే చేశానని ప్రభుత్వ అధినేతలు, రాజకీయ నాయకులు చెప్పుకోవటంతోనే ఇబ్బంది. ఉదాహరణకు మన అందరికి సుపరిచితం అయిన సైబర్ టవర్స్. నిజానికి సైబర్ టవర్స్ ఉన్న ప్రాంతంలో సాఫ్ట్ వేర్ హబ్ నిర్మాణానికి శంఖుస్థాపన చేసింది స్వర్గీయ నేదురుమల్లి జనార్ధన రెడ్డి సైబర్ టవర్స్ బిల్డింగ్ వచ్చింది నారా చంద్రబాబు హయాంలో. సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీ హైదరాబాద్ శివారు ప్రాంతంగా ఉన్న నానక్ రాం గూడ వరకు విస్తరించటానికి కారణం దివంగత ముఖ్యమంత్రి వై.యస్ రాజశేఖరర్ రెడ్డి.

Read Also: చేతులెత్తి వేడుకుంటున్నా.. చంద్రబాబు

రాజీవ్ గాంధి హత్య మొదటి వర్ధంతి 21-May-1992న రాజీవ్ దార్శనికతకి,టెక్నాలజీకి ఇచ్చిన ప్రాముఖ్యతను చిహ్నంగా అప్పటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన రెడ్డి గారు స్వయంగా ఇప్పటి సైబర్ టవర్స్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అప్పట్లో దాని నిర్మాణ అంచనా వ్యయం 4.5 కోట్లు. ఈ వ్యవహారాలని పర్యవేక్షించటానికి ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. దానికి R.పార్ధసారధి ఎండిగా వ్యవహరించేవారు. అప్పుడే అనేక అమెరికా కంపెనీలు ఇక్కడ తమ వ్యాపారకార్యకలాపాల నిర్వహణకు సంసిద్దం వ్యక్తం చేశాయి. ఒక హార్డ్వేర్ పార్క్ నిర్మాణానికి జపాన్ కంపెనీ కూడా ముందుకు వచ్చింది. 400 కోట్ల సాఫ్ట్ వేర్ ఉత్పత్తుల వార్షిక ఎగుమతుల లక్ష్యాన్ని కూడా నిర్ధేశించుకున్నారు. ప్రపంచవ్యప్తంగా ఉన్న దాదాపు 200 ప్రముఖ కంపెనీలకు లేఖలు రాసి, రాష్ట్రం కల్పించే ఐటి సదుపాయాలు వినియోగించుకోవాల్సిందిగా కోరారు. భవిష్యత్తులో హైదరాబాద్ వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్ కు, చిప్ డిజైనింగ్ కు కేంద్రం అవుతుంది అని అప్పుడే జోస్యం చెప్పారు నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి గారు.

సైబర్ టవర్స్ శంకుస్థాపన జరిగిన ఆరు నెలలకే జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవటం, కోట్ల పదవిలోకి రావటం,తక్కువ సమయంలోనే ఎన్నికలు రావడం, అందులో కాంగ్రెస్ ఓడిపోవటం, ఎన్టీఆర్ గెలుపు , వైశ్రాయ్ సంఘటన... వెరసి సైబర్ టవర్స్ పనులు మరుగునుపడ్డాయి.

చంద్రబాబు ఐటీ పితామహుడా?

1995లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత ఆ ప్రాజెక్టు కొనసాగింపుగా అక్కడ సైబర్ టవర్స్ నిర్మాణం చేపట్టారు. అప్పటి నుంచి 2004 వరకు ఐ.టిలో పెద్ద చెప్పుకోదగ్గ పురోగతి జరగలేదు. ఇప్పుడు ఎంతో రద్దీగా మారిన కూకట్ పల్లి, మాదాపూర్ , మెహదీపట్నం గచ్చిబౌలి రోడ్లు 2004 వరకు ఎంత నిర్మానుష్యంగా ఉండేవో ఆనాడు చూసిన వారికి తెలుసు. అంతే కాకుండా ఆనాడు జరిగిన అభివృద్ది గణంకాల రూపంలో ఇప్పటికి భద్రంగా ఉంది. దాని ప్రకారం 1994 -1995 సంవత్సరంలో మూడవసారి తెలుగుదేశం అధికారంలోకి వచ్చినప్పుడు మన దేశం యొక్క సాఫ్ట్వేర్ ఎగుమతులు 250 కోట్లు. ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి 22 కోట్లు అంటే 9%. 1998-99 సంవత్సరంలో సాఫ్ట్వేర్ ఎగుమతులు 22 కోట్లు నుండి 575 కోట్లు అయింది కానీ దేశ వ్యాప్తంగా లెక్కలు వేస్తే అదే సంవత్సరం భారత దేశానికి సంబంధించిన సాఫ్ట్వేర్ ఎగుమతులు 6,300 కోట్లు , ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి కేవలం 575 కోట్లు అంటే 9% మాత్రమే. అదే యేడు కర్నాటక సాఫ్ట్వేర్ ఎగుమతులు 2,888 కోట్లు ఉంది. నోయిడా కు సంబంధించి 1430 కోట్లు ఉంది. తమిళనాడుకి సంబంధించి 800 కోట్లు ఉంది. ఇంక చంద్రబాబు 2004 లో దిగిపోయే సమయానికి రాష్ట్రం ఎగుమతులలో 3వ స్థానం నుండి 5వ స్థానానికి వచ్చాము.

వైఎస్ హయాంలో ఐటీ పరిస్థితి ఏంటి?

ఇక 2004 తరువాత వై.యస్ ముఖ్యమంత్రి అయ్యాక చంద్రబాబు నా వల్లే ఐ.టి అభివృద్ది అని చెప్పుకున్నా, వై.యస్ ఐ.టి ని నిర్లక్ష్యం చేయలేదని మనకి గణంకాల రూపంలో తెలుస్తుంది. రాష్ట్రంలో వైఎస్సార్‌ హయాంలోనే ఐటీ రంగంలో అత్యధికంగా ఉద్యోగాల కల్పన జరిగింది. 2003–04 ఐటీ రంగంలో 71,445 మందికి ఉద్యోగాలను కల్పించారు. ఇదే 2009లో ఈ సంఖ్య 2,51,786కు పెరిగింది. 2004 వరకు రాష్ట్రం నుంచి రూ.5025 కోట్ల రూపాయల విలువైన ఐటీ ఎగుమతులు మాత్రమే ఉండేవి. 2010లో ఐటీ ఉత్పత్తుల విలువ రూ.36 వేల కోట్లకు పెరిగింది. భారత ఐటీ ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్‌ వాటా 15 శాతం. ఐటీలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానిది దేశంలోనే నాలుగో స్థానం. వైఎస్సార్‌ హయాంలోనే రాష్ట్రానికి ఐటీ రంగంలోని దిగ్గజ కంపెనీలు వచ్చాయి. ఇన్ఫోసిస్, టిసిఎస్, కాగ్నిజెంట్‌ వంటి ప్రముఖ కంపెనీల స్థాపనకు ప్రోత్సహించారు. వైఎస్సార్‌ హయాంలోనే ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్‌ రీజియన్‌(ఐటీఐఆర్‌)ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. 50 వేల ఎకరాల్లో రెండు దశల్లో ఐటీఐఆర్‌ అభివృద్ధి, రూ. 219 కోట్లు ఖర్చు చేసి 15 లక్షల మందికి ఉద్యోగాలు కల్పన ఈ కార్యాచరణ ఉద్దేశం.

Read Also: పోలీసుల నిర్బంధంలో పవన్..

ప్రముఖ ఐటీ కంపెనీలు అన్నీ హైదరాబాద్‌లో శాశ్వతంగా ఏర్పాటు కావాలనే ఉద్దేశంతో వైఎస్సార్‌ ప్రత్యేక చొరవ తీసుకుని కోకాపేట, గచ్చిబౌలి, నానక్‌రామ్‌గూడ వంటి ప్రాంతాలను కలుపుతూ ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ను ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ స్థాయి ఐటీ కంపెనీలు అన్నీ ఇక్కడ ఏర్పాటవుతున్నాయి. దాంతో పాటు మౌళిక సదుపాయాల్లో భాగంగా నేడు లక్షల మంది రోజు వెళ్లే ఫ్లై ఓవర్లు నిర్మించారు. కూకట్ పల్లి - హైటెక్ సిటి ఫ్లై ఓవర్ శంకుస్థాపన 2007లో జరిగితే పూర్తైంది మాత్రం 2013లో. సైబర్ టవర్స్ ఫ్లై ఓవర్ 2008లో మొదలైతే అక్టోబర్ 2010 లో పూర్తైంది. గచ్చిబౌలి ఫ్లై ఓవర్ 2011లో పూర్తైంది. దీంతో పాటు హైదరాబాద్ లోనే అభివృద్దిని కేంద్రీకరించకుండా అభివృద్దిని అన్ని జిల్లాలకు వికేంద్రికరిస్తూ, విశాఖ భీమిలిలో ఐ.టి కారిడార్, దువ్వాడలో ఐ.టి సెజ్, పరవాడలో ఫార్మా కారిడార్, నెల్లూరు నాయుడు పేట మండలం లో మేనకూరు సెజ్, తడా మండలం మాంబట్టు సెజ్, సత్యవేడు శ్రీ సిటీ, ఏర్పాటు చేశారు. దీంతో 2008-09 సంవత్సరం లో 32,507 కోట్ల ఎగుమతులు ఈ రంగంలో సాధించారు. ఇది జాతీయ ఎగుమతులలో 15 % (జాతీయ వృద్ది రేటు 32% ఉండగా రాష్ట్ర వృద్ది రేటు 41 %)

జగన్ కు అమరావతి అవసరం లేదా ?

ఈ రోజు హైదరాబాద్ లో ఐ.టి ఇంతలా అభివృద్ది చెంది దేశ విదేశాల నుండి వచ్చిన వారిలో అనేక మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది అంటే దాని వెనక నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి దగ్గరనుండీ కే.సి.ఆర్ వరకు వచ్చిన పాలకుల చేసిన కృషి ఫలితమే. ఇలా అభివృద్ది అనేది ఒకరి వల్ల కానీ ఒకరి హయాంలో కానీ జరిగే పని కాదు. ఒకరు ఒక దానిని అభివృద్ది చేయటం మొదలు పెడితే, నిజంగా అది ప్రజలకు రాష్ట్రాభివృద్దికి మేలు చేసే ప్రణాళికే అయితే దానిని అడ్డుకునే సాహసం ఏ పాలకుడు చేయడు.

ఎందుకంటే అభివృద్ది అనేది ప్రజలతో పాటు పాలకుడికి అవసరమే. నేడు జగన్ అమరావతితో పాటు మరో రెండు ప్రాంతాలను కూడా రాజధానులుగా ప్రకటించారు అంటే అమరావతిని నాశనం చేస్తునట్టు కాదు. చంద్రబాబు అమరావతిని తన బ్రాండ్ గా మార్చుకున్నారు కాబట్టి జగన్ దానిని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు అనేది అపొహే తప్ప నిజం కాదు. చంద్రబాబు విధానం అభివృద్ది కేంద్రీకృతం అయితే జగన్ విధానం వికేంద్రీకృతం. నాడు బాబు హయాంలో ఐ.టి లో పురోగతి లేకపొయినా చేసుకున్న ప్రచారం వలన అయనకి ఐ.టి పితామహుడు అని పేరు వచ్చింది. అలా అని తరువాత వచ్చిన వై.యస్ ఐ.టిని నిర్లక్ష్యం చేయలేదు. అలాగే నేడు రాజధాని పేరిట అమరావతిలో ఒక్క శాశ్వత కట్టడం లేకపొయినా అమరావతి అంటే చంద్రబాబు అన్నంతగా ప్రచారం జరుగుతుంది, అలా అని జగన్ అమరావతిని నిర్లక్ష్యం చేయరు. ఎందుకంటే అభివృద్ది అందరికి అవసరమే.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp