సీఎం రిలీఫ్ ఫండ్ కాజేసే య‌త్నం : ఏసీబీ విచార‌ణ‌కు ఆదేశించిన జ‌గ‌న్

By Kalyan.S Sep. 20, 2020, 08:02 pm IST
సీఎం రిలీఫ్ ఫండ్ కాజేసే య‌త్నం : ఏసీబీ విచార‌ణ‌కు ఆదేశించిన జ‌గ‌న్

ఏకంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచే కోట్లు కొట్టేయాల‌ని ప్ర‌య‌త్నించారు కొంద‌రు దుండ‌గులు. బ్యాంక్ అధికారుల అప్ర‌మ‌త్త‌త‌తో వారి పాచిక పార‌లేదు. ఏపీ ప్ర‌భుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆప‌ద‌లో ఉన్న వారిని ఆదుకునేందుకు విరివిగా ఆదుకుంటోంది. దాన్ని ఆస‌రాగా చేసుకుని ఆ సొమ్మును పక్కదారి పట్టించేందుకు ప్రయత్నించారు కొందరు కేటుగాళ్లు. ఒకటి కాదు.. రెండు కాదు... ఏకంగా రూ.112 కోట్లు కొల్లగొట్టేందుకు ప్రయత్నించారు.

ఆప‌ద‌లో ఉన్న వారికి ఆప‌న్న‌హ‌స్తంగా..

అనారోగ్యం, ఇతర సమస్యలతో బాధ పడుతున్నవారు తమను ఆదుకోవాలంటూ చేసుకునే విజ్ఞప్తులకు స్పందించి... సీఎంఆర్ఎఫ్‌ విడుదల చేస్తారు. దీన్ని ఆసరాగా తీసుకున్న గుర్తుతెలియని వ్యక్తులు... మూడు నకిలీ చెక్కుల్ని తయారు చేశారు. బెంగళూరు సర్కిల్, మంగళూరులోని మూడ్‌బద్రి శాఖకు రూ.52.65 కోట్లు, ఢిల్లీలోని సీసీపీసీఐకి రూ.39.86 కోట్లు, కోల్‌కత్తా సర్కిల్‌లోని మోగ్‌రాహత్‌ శాఖకు రూ.24.65 కోట్ల చెక్కులను క్లియరెన్స్‌ కోసం ఎస్‌బీఐకి పంపారు. ఢిల్లీ, బెంగళూరు, కోల్‌కతా సర్కిళ్లకు చెందిన.. బ్యాంకు అధికారులు వెలగపూడిలోని ఎస్‌బీఐ బ్రాంచికి ఫోన్‌ చేయడంతో కుంభకోణం బట్టబయలైంది. దీంతో ఈ నకిలీ వ్యవహారం బయటపడింది. రంగంలోకి దిగిన పోలీసులు దుంగడుల వివరాలు కనుక్కొనే పనిలో పడ్డారు.

ఏసీబీ విచార‌ణ‌కు జ‌గ‌న్ ఆదేశం

ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) నకిలీ చెక్‌ల వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సీరియస్ అయింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ వ్యవహారంపై ఏసీబీ విచారణకు ఆదేశించారు. సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాలతో రెవెన్యూ ఉన్నతాధికారులు ఏసీబీ డైరెక్టర్‌కు లేఖ రాశారు. మరోవైపు ఫాబ్రికేటెడ్‌ చెక్కులపై కూడా తుళ్లూరు పోలీస్‌స్టేషన్‌లో ఇప్పటికే కేసు నమోదైంది. రెవిన్యూ శాఖ అసిస్టెంట్‌ సెక్రటరీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటు ఈ మూడు చెక్కులపై రెవెన్యూ శాఖ సెక్రటరీ టు గవర్నమెంట్‌ అన్న స్టాంప్, సంత‌కాలు కూడా ఉండ‌డం గ‌మ‌నార్హం.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp