రాజీనామా ఎవరు చేయాలి..?

By Voleti Divakar Aug. 05, 2020, 03:00 pm IST
రాజీనామా ఎవరు చేయాలి..?

మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఎవరు రాజీనామా చేయాలి?. ఎవరైతే సవాల్ విసురుతారో వారే ముందుగా దాన్ని స్వీకరించాలి. ఇది నిబంధన. అయితే రాజకీయ జిమ్మిక్కుల్లో పండిపోయిన టిడిపి అధినేత చంద్రబాబునాయుడు రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు నిరసనగా 48గంటల్లో రాజీనామా చేసి, ఎన్నికల ద్వారా ప్రజల రెఫరెండంను కోరాలని సవాల్ చేశారు. ముందుగా తన పార్టీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి, అధికార పక్షానికి సవాల్ విసిరితే సమంజసంగా ఉండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

హైదరాబాద్ నుంచి జూమ్ ద్వారా మూడు రాజధానులపై ఆందోళన చేస్తున్న చంద్రబాబునాయుడు సవాల్ పై సొంత పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజీనామాలకు టిడిపి ఎమ్మెల్యేలు ఎవరూ పెద్దగా ఆసక్తి చూపించడం లేదన్నది వాస్తవం. చంద్రబాబు విసిరిన సవాల్ పై మద్దతు ప్రకటిస్తూ 23 మంది టిడిపి ఎమ్మెల్యేల్లో సగం మంది కూడా స్పందించకపోవడం గమనార్హం. మంత్రి బొత్స సత్యనారాయణ విసిరిన ప్రతీ సవాల్ పై టిడిపి ఎమ్మెల్యేలెవరూ స్పందించలేదు. గత ఎన్నికల్లో ఓటమి అంచుల వరకూ వెళ్లిన పలువురు టిడిపి ఎమ్మెల్యేలు జనసేన అభ్యర్థులు ఓట్లు చీల్చడం వల్ల, వైసిపి పార్టీలోని అంతర్గత కుమ్ములాటల వల్లే గెలుపొందారన్నది అందరికీ తెలిసిందే.

తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం, రూరల్, మండపేట, పెద్దాపురం నియోజకవర్గాల్లో ఈ కారణాల వల్లే టిడిపి ఎమ్మెల్యేలు గెలుపొందారు. రాజధానికి సంబంధం లేని తూర్పుగోదావరి వంటి జిల్లాల్లో ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహిస్తే టిడిపి ఎమ్మెల్యేలు గెలవలేరన్నది కూడా వాస్తవం. టీడీపీ గెలిచిన 23 స్థానాల్లోని మెజారిటీ చోట్ల ఇదే పరిస్థితి.

రాష్ట్ర రాజధానిగా అమరావతి ని ప్రకటించినా గత ఎన్నికల్లో వైసిపి అభ్యర్థులు రాజధాని ప్రాంతమైన మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాల్లో గెలుపొందడం గమనార్హం. దీన్ని బట్టి అమరావతిలో టిడిపి పట్టు ఎంతన్నది అర్థమైపోతోంది. ఈనేపథ్యంలో మంత్రి బొత్స సత్యనారాయణ సవాల్ ను స్వీకరించి టిడిపి ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే రాష్ట్రంలో రాజకీయం రసకందాయంలో పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే అంత ధైర్యం టిడిపి ఎమ్మెల్యేలు చేయలేరన్నది చంద్రబాబు చేసిన సవాల్ ను బట్టే అర్థమవుతోంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp