పాకిస్తాన్‌లో ఘోర విమాన ప్రమాదం

By Srinivas Racharla May. 22, 2020, 06:21 pm IST
పాకిస్తాన్‌లో ఘోర విమాన ప్రమాదం

శుక్రవారం మధ్యాహ్నం పాకిస్తాన్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది.కరాచీ విమానాశ్రయంలో ల్యాండింగ్ అవడానికి ఒక్క నిమిషం ముందు పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఫ్లైట్ నంబర్ పీకే 8303 కుప్పకూలిపోయింది. లాహోర్ నుంచి ప్రయాణికులతో కరాచీ వెళుతున్న విమానం కరాచీ ఎయిర్‌పోర్టుకు సమీపంలోని నివాస ప్రాంతాలలో కూలిపోయింది. కరాచీలోని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయానికి నాలుగు కి.మీల దూరంలో మలీర్‌లోని ఓ మోడల్‌ కాలనీ వద్ద ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ప్రమాదం సమయంలో విమానంలో 99 మంది ప్రయాణికులు,8 మంది సిబ్బంది సహా 107 మంది ఉన్నట్టు తెలుస్తోంది.

విమానం కుప్పకూలిన వెంటనే ఆ ప్రాంతంలో భారీగా మంటలు, పెద్ద ఎత్తున పొగలు వచ్చాయి. నివాస ప్రాంతంలో విమానం కూలడంతో పలు ఇళ్లు దెబ్బతిన్నాయి. విమానం కూలిపోయిన మోడల్ కాలనీ ఎక్కువగా పేదల నివసించే ప్రాంతం కావడంతో ప్రాణ నష్టంపై ఆందోళన నెలకొంది. విమానం కూలిపోవడానికి ముందు ఎయిర్ పోర్ట్‌లో ల్యాండ్ అయ్యేందుకు ప్రయత్నించినట్టు స్థానికులు తెలిపారు.

ప్రమాద సమాచారం అందుకున్న ఆర్మీ, పోలీసు బృందాలు ఆ ప్రాంతాన్ని తమ అదుపులోకి తీసుకొని సహాయక చర్యలు చేపట్టాయి.
ఈ ఘటనతో కరాచీలోని అన్ని పెద్ద ఆస్పత్రులలో పాకిస్థాన్‌ ఆరోగ్యశాఖ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. కాగా విమాన ప్రమాదంపై విచారణకు ఆదేశించామని పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ సీఈవో అర్షద్ మలిక్ ప్రకటించారు. 

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp