ఆ ప్రాంతంలో తొలి సిజేరియన్... కఠినమైన సత్యం

By Raju VS Jul. 12, 2020, 06:00 pm IST
ఆ ప్రాంతంలో తొలి సిజేరియన్... కఠినమైన సత్యం

అత్యవసర వేళల్లో ఆదివాసుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. చిన్న సమస్య వచ్చినా చాలామంది ప్రాణాలు చిక్కుల్లో పడిపోతాయి. సాధారణ జ్వరాలకు కూడా ప్రాణాలు విలవిల్లాడిపోతుంటాయి. కొన్నిసార్లు తాగునీరు కలుషితం కావడంతో ప్రాణాలు గాలిలో కలిసిపోయే దుస్థితి ఏడు దశాబ్దాల స్వతంత్ర భారతంలో ఉందంటే మనసు చివుక్కుమనాల్సిందే. విశాఖ వంటి మహా నగరాలకు అతి సమీపంలోనే  మన్యం వాసుల కష్టాలు వింటే మానవత్వం ఉన్న వారంతా చలించక మానరు. అలాంటి సుదీర్ఘకాలంగా వెంటాడుతున్న సమస్యలను అధిగమించేందుకు ప్రస్తుతం కొంత ప్రయత్నం చేసిందీ ప్రభుత్వం. అవి ఫలితాన్నిస్తున్న తీరుతో ఏజన్సీ వాసులకు కొండంత ఊరట దక్కుతోంది.

ఆంధ్రప్రదేశ్ లో అత్యధికంగా తలసరి ఆదాయం ఉన్న జల్లాల్లో విశాఖ కూడా ముందు వరుసలో ఉంటుంది. కానీ అదే జిల్లాలోని ఏజన్సీ 11 మండలాల్లోని 36 ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో మొత్తం గైనకాలజిస్ట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే ఆశ్చర్యపోవాలసిందే. కేవలం పాడేరు, అరకు, చింతపల్లి, ముంచింగిపుట్టులో మాత్రం గైనిక్ పోస్ట్ లు ఉన్నాయి. అంటే గర్భిణీల కష్టాలు ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఎటువంటి అవసరం వచ్చినా దిగువకు ప్రయాణం చేయాల్సిందే. సీలేరు , జీకే వీధి, కొయ్యూరు , లంబసింగి ప్రాంతాల ప్రజలు నర్సీపట్నం వెళ్లాల్సిందే. పాడేరు, మాడుగుల ప్రాంతాల ప్రజలు చోడవరం పయనించాల్సిందే. డుంబ్రిగూడ, అరకు, అనంతగిరి వాసులు ఎస్ కోట వరకూ వెళ్లాల్సిందే. అందులోనూ మారుమూల ప్రాంతాల ప్రజలయితే ఢోలీ కట్టి మోసుకుని రావడం తప్ప మరో దిక్కు లేదు. సరైన రవాణా గానీ, తీరా కష్టపడి వచ్చిన వారికి ఆరోగ్య సదుపాయాలు గానీ అందుబాటులో లేకపోవడంతో ఏటా అకాల మరణాలు పాలవుతున్న వారి సంఖ్యకు అంతూపొంతూ లేదు. అందులోనూ చిన్న వయసులోనే చాలామంది ప్రాణాలు కోల్పోతున్న తీరు విషాదానికి పరాకాష్టగా ఉంటుంది.

Also Read:శ్రీవారి ఆస్తి ఎంత..? శ్వేతపత్రం విడుదలకు సిద్ధమైన టీటీడీ..!

ఇలాంటి పరిస్థితులను చక్కదిద్దాల్సిన ప్రభుత్వాలు సుదీర్ఘకాలంగా మాటలకే తప్ప ఆచరణలో ఎటువంటి చర్యలు చేపట్టలేదు. చివరకు గత టీడీపీ పాలనలో ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న బీజేపీ నాయకుడు కామినేని శ్రీనివాస్ వంటి వారయితే చాపరాయిలో కలుషిత నీరు తాగి మరణించిన బాధితులపై చేసిన వ్యాఖ్యలు మరింత కలవరపరుస్తాయి. మారుమూల ప్రాంతాల్లో ఇలాంటి మరణాలు ఏటా తప్పవంటూ ఆయన వ్యాఖ్యానించడం అప్పట్లో వివాదాస్పదం అయ్యింది. అదే సమయంలో మారేడుమిల్లి నుంచి అతి కష్టం కొండలు దాటుకుంటూ ప్రయాణం చేసి బాధితులను పరామర్శించిన నాటి ప్రతిపక్ష నాయకుడు జగన్ చెప్పిన మాటలకు ఇప్పుడు కట్టుబడి పాలనలో ఫలితాలు సాధించడం ఆసక్తికరం. ఏజన్సీలో వైద్య సదుపాయాలు మెరుగు పరచాలని నాడు డిమాండ్ చేసిన జగన్ ప్రస్తుతం దానికి ప్రాధాన్యతనిస్తూ ముందుకెళుతుండడంతో ఫలితాలు ప్రారంభమయ్యాయి.

అందులో భాగంగానే జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత విశాఖ జిల్లా పాడేరు ఆసుపత్రిని జిల్లా ఆసుపత్రిగా ప్రకటించారు. త్వరలో పాడేరులో బోధనాసుపత్రి సిద్దం చేసేందుకు ప్రణాళిక రెడీ అయ్యింది. ఈలోగా విశాఖ ఏజన్సీ వాసుల వెతలు తీర్చేందుకు స్థానిక ఎమ్మెల్యే కూడా చొరవ చూపుతుండడంతో ఊరట దక్కుతోంది. పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్షి తో పాటుగా ఆమె భర్త డాక్టర్ తమర్భ నరసింగ రావు ప్రయత్నాలు చేయడంతో పాడేరు జిల్లా ఆస్పత్రిలో మెరుగైన సేవలు అందుబాటులోకి వచ్చాయి. తాజాగా జూలై 7న పాడేరు ఆస్పత్రిలో తొలిసారిగా సిజేరియన్ చేయడం విశేషంగానే చెప్పవచ్చు. 73 ఏళ్ల స్వతంత్రభారతంలో తొలిసారిగా సిజేరియన్ చేయడాన్ని కూడా ఘనతగా చెప్పుకోవాల్సిన స్థితి ఉన్నందుకు చింతిస్తూనే ప్రస్తుతం ఓ అడుగు పడినందుకు ఆనందించాల్సి వస్తోంది. ప్రయత్నంతో ఆపరేషన్ థియేటర్ ఏర్పాటు చేశారు.

Also Read:కెసిఆర్ పీవీని విమర్శించాడు --ఎందుకు ఈ రాతలు?

ఆరోగ్య సదుపాయాలు అందుబాటులో లేకపోవడం, గైనకాలజిస్టులు ఎవరూ లేకపోవడంతో చాలామంది గిరిజనుల్లో ఇంటి దగ్గరే పురుడు పోసుకునే దుస్థితి ఇంకా ఉంది. ఇక ఎవరైనా ఆస్పత్రికి వెళ్లాలంటే చోడవరం, నర్సీపట్నం, ఎస్ కోట ఆస్పత్రులకు వెళ్లడమే తప్ప మరో దారి లేని నేపథ్యంలో ఇప్పుడు పాడేరు ఆస్పత్రి వారికి పెద్ద ఆసరగా మారే అవకాశం ఉంది. పాడేరు ఆస్పత్రిలో ఎమ్మెల్యే భర్త చొరవతో ఆపరేషన్ థియేటర్ సిద్ధం అయ్యింది. దాంతొ ఇన్నేళ్ల తర్వాత తొలిసారిగా హుకుంపేట మండలం సంతారి గ్రామానికి చెందిన లోచలి వసంత అనే 23 ఏళ్ల గర్భిణీ తన రెండో పురుడు కోసం ఆస్పత్రిలో చేరి సిజేరియన్ ఆపరేషన్ ని విజయవంతంగా పూర్తి చేసుకుంది.

పాడేరు ఆస్పత్రిలో తొలిసారిగా జరిగిన సిజేరియన్ ఆపరేషన్ సక్సెస్ కావడంతో వైద్యులు, అధికారులు, స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్ లో అత్యవసర సమయాల్లో గర్భిణీలు కొండ దిగువకు వెళ్లాల్సిన అవసరం లేదనే భరోసా దక్కిందని చెబుతున్నారు. అంతేగాకుండా పసికందులు కూడా జాండిస్ వంటి బారిన పడి స్వల్పకాలానికే ప్రాణాలు వదులుతున్న పరిస్థితి తొలగిపోతుందని భావిస్తున్నారు. మాతా, శిశు మరణాల రేటు అత్యధికంగా ఉన్న ప్రాంతంలో వాటికి ఇక ముగింపు పలికే సమయం ఆసన్నమయ్యిందని అంచనాలు వేస్తున్నారు.

Also Read:కృష్ణాలో నదీ జలాలు ఉరుకులు - ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఎత్తివేత

ఇక సిజేరియన్ చేయించుకున్న బాలింతను గిరిజన శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీ వాణీ పరామర్శించారు. ఎంపీ మాధవి, ఎమ్మెల్యేలు భాగ్యలక్ష్మి, శెట్టి పాల్గుణతో కలిసి ఆమె ఆస్పత్రిని సందర్శించారు. సిజేరియన్ చేసిన వైద్యులను అబినందించారు. గిరిజనుల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, మరిన్ని మెరుగైన సదుపాయాలు కల్పించబోతున్నట్టు వెల్లడించారు. మొత్తానికి మన్యంలో సుదీర్ఘకాలంగా ఉన్న సమస్యలకు త్వరలోనే శాశ్వత పరిష్కారం పూర్తిగా దక్కబోతుందనే ఆనందం ఆదివాసీ ప్రాంతాల్లో కనిపిస్తోంది. ఈ ప్రభుత్వం మన్యం వాసులకు చేసిన మహోపకారంగా ఈ ఏర్పాట్లు నిలిచిపోతాయని చెబుతుండడం గమనార్హం.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp