అత్యంత శక్తివంతమైన మహిళ

By Kranti Dec. 09, 2020, 05:20 pm IST
అత్యంత శక్తివంతమైన మహిళ

ప్రతికూల పరిస్థితుల్లోనూ సమర్థవంతమైన పాత్ర నిర్వర్తిస్తున్న భారతదేశ ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కు అరుదైన గౌరవం దక్కింది. 2020 ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో చోటుదక్కించుకున్నారు. ఫోర్బ్ పతిక్ర విడుదల చేసిన ఈ జాబితాలో నిర్మల సీతారామన్ తో పాటు, బయోకాన్ ఫార్మా వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా, హెచ్ సీఎల్ కార్పోరేషన్ సీఈఓ రోష్నీ నాదర్ మల్హోత్రా కూడా ఉన్నారు. ఫోర్స్ ప్రతియేటా విడుదల చేసే 100 మంది అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో జర్మన్ ఛాన్సెలర్ ఏంజెలా మెర్కెల్ మొదటి స్థానం దక్కించుకున్నారు. అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హారిస్ మూడో స్థానంలో నిలిచారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఫోర్బ్స్ జాబితాలో నిర్మలా సీతారామన్ 41వ స్థానంలో నిలిచారు.

2019 సంవత్సరంలోనూ నిర్మలా సీతారామన్ ఈ గౌరవాన్ని దక్కించుకున్నారు. ఈ సారి జాబితాలో రోషినీ నాదర్ మల్హోత్రా 55 వ స్థానంలో, కిరణ్ మజుందార్ షా 68 స్థానంలో నిలిచారు. వేరు వేరు రంగాలకు చెందిన ఈ మహిళలంతా సంక్లిష్ట సమయాల్లో ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించడానికి తమదైన పద్ధతిలో పనిచేస్తున్నారని ఫోర్బ్స్ తెలిపింది. ఫోర్బ్స్ జాబితాలో మొదటి స్థానం దక్కించుకున్న మెర్కెల్ వరుసగా పదోసారి ఈ గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. జర్మనీ చాన్సెలర్ గా కొనసాగుతున్న మెర్కెల్ జర్మనీ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టడంలో కీలకంగా వ్యవహరించారు.

నిర్మలా సీతారామన్ భారతదేశ ఆర్థిక మంత్రి పదవి చేపట్టిన తొలి మహిళ కావడం గమనార్హం. ఈ కీలక బాధ్యతలు చేపట్టిన నాటినుంచీ దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఆమె ప్రయత్నిస్తూ ఉన్నారు. కరోనా సంక్షోభం వల్ల ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు అనూహ్యంగా దెబ్బతిన్నాయి. అలాంటి సందర్భంలో కూడా దేశంలో పరిశ్రమలు నిలదొక్కుకునేందుకు ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటించింది కేంద్రం. చిన్న పరిశ్రమలు నిలదొక్కుకోవడం ద్వారా ఉత్పత్తి పెరుగుతుందని, తద్వారా తిరిగి ఆర్థిక వ్యవస్థ పురోగతి సాధిస్తుందని ఆర్థికమంత్రి ప్రకటించారు. దేశ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టడంలో కీలకంగా వ్యవహరిస్తున్న నిర్మలా సీతారామన్ కు ఈ గౌరవం దక్కడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp