పందెం కోళ్లలో రకాలు.. వాటి ధరలు ఎలా ఉంటాయో తెలుసా..?

By Prasad Jan. 13, 2022, 05:30 pm IST
పందెం కోళ్లలో రకాలు.. వాటి ధరలు ఎలా ఉంటాయో తెలుసా..?

నెమలి... కాకి.. డేగ... రసంగి.. ఇవన్ని కేవలం జంతువుల పేర్లు మాత్రమే కాదు. రోషానికి.. పౌరుషానికి పేరుగాంచిన పందెెం కోళ్లకు సైతం ఇవే పేర్లతో పిలుస్తారంటే ఆశ్చర్యం అనిపించకమానదు. కోళ్ల రకాలను బట్టి... వాటి రంగులను బట్టి  ఆయా పేర్లతో వీటిని పిలుస్తారు. గౌడ నెమలి, తెల్ల నెమలి, కోడి నెమలి, కాకి డేగ, కక్కేరి, రసంగి, గాజు కుక్కురాయి, అబ్రాస్‌, ఎర్ర డేగ వంటి జాతులు ఉంటాయి. వాటిలో తెల్ల నెమలి, గౌడ నెమలి, రసంగి, అబ్రాస్‌ పుంజులు ఎంతటి పందాన్నైనా గెలిచే శక్తి ఉంటుంది. ఒక్కో పుంజు ఖరీదు రూ.80వేల నుంచి రూ.1.20 లక్షల వరకు ఉంటాయంటే వాటి డిమాండ్‌ను ఊహించుకోవచ్చు. 

ఈకల రంగులను బట్టి పందెం కోళ్ల రకాలు విభజించబడతాయి. అవి ఏమిటంటే...

కాకి : నల్లని ఈకలు గల కోడిపుంజు

సేతు : తెల్లని ఈకలు గల కోడిపుంజు

పర్ల : మెడ పై నలుపు, తెలుపు ఈకలు సమానంగా గల కోడిపుంజు

సవల : మెడ పై నల్లని ఈకలు గల కోడిపుంజు

కొక్కరాయి : నల్లటి శరీరం 2,3 ఇతర రంగుల ఈకలు గల కోడిపుంజు

డేగ : ఎర్రటి ఈకలు గల కోడిపుంజు

నెమలి : రెక్కల పై, లేదా వీపు పై పసుపు రంగు ఈకలు గల కోడిపుంజు

కౌజు : నలుపు, ఎరుపు, పసుపు ఈకలు గల కోడిపుంజు

మైల : ఎరుపు, బూడిద రంగుల ఈకలు గల కోడిపుంజు

పూల : ఒక్కొక్క ఈకపై నలుపు, తెలుపు, ఎరుపు రంగులు గల కోడిపుంజు

పింగళ : తెలుపు రెక్కలపై అక్కడక్కడా నలుపు రంగు, లేత గోధుమ రంగు ఈకలు గల కోడిపుంజు

ముంగిస : ముంగిస జూలు రంగు ఈకలు గల కోడిపుంజు

అబ్రాసు : లేత బంగారు రంగు ఈకలు గల కోడిపుంజు

గేరువా : తెలుపు, లేత ఎరుపు ఈకలు గల కోడిపుంజు

మిశ్రమ రకాలు :

కోడి నెమలి, కాకి నెమలి, పచ్చ కాకి, తెలుపు గౌడు (నలుపు, తెలుపు ఈకలు గల కోడిపుంజు), ఎరుపు గౌడు (నలుపు, ఎరుపు ఈకలు గల కోడిపుంజు), నల్ల సవల (రెక్కల పై నల్ల మచ్చలు గల కోడిపుంజు), నల్ల మచ్చల సేతు (తెల్లని ఈకల పై నల్ల మచ్చలు గల కోడిపుంజు).

ఔరా అనిపిస్తున్న పందేం కోళ్ల ధరలు:

ఈ ఏడాది పందెం కోళ్ల ధరలు ఎక్కువగానే ఉన్నాయి. వీటి ధరలు చూస్తే ఔరా అనిపిస్తాయి. కోడి రకాన్ని బట్టి ధరలు నిర్ణయిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పందెం కోళ్ల రకాన్ని బట్టి రూ.పది వేల నుంచి రూ.లక్ష వరకు ధర పలుకుతుంది. బరిలో దిగితే నువ్వానేనా అన్నట్టుగా తలపడే రకాల్లో సేతువా జాతి ముందుంటుంది. దీని ధర రూ.70 వేల నుంచి రూ.లక్ష వరకు ఉంది. తరువాత స్థానాల్లో పర్ల, పచ్చకాకి, డేగ, కాకి పుంజు, పెట్ట మారు జాతులు ఉన్నాయి. పర్ల, నెమలి రూ.50 వేల నుంచి రూ.60 వేలు, కాకి డేగ, పర్ల రకాలు రూ.25 వేల నుంచి రూ.30 వేలు. ఎర్రకెక్కి రాయి రూ.40 వేలు, పచ్చకాకి డేగ రూ.30 వేల నుంచి రూ.40 వేలు ధరలు పలుకుతున్నాయి. వీటితో పాటు రసంగి, కెక్కరి, పూల, అబ్రస్‌, పండుడేగ, మైయిలా, సింగాలి, పెట్టమారు, పింగళ రకాలు రూ.25 వేల నుంచి రూ.30 వేల ధరలకు పందెం రాయుళ్లు కొనుగోలు చేస్తున్నారు. పుంజుల ప్రత్యేకతలు, సామర్థ్యం ఆధారంగా ధరలు ఉంటున్నాయి.

Also Read : కోడి... పందేలకు రె ‘ఢీ’

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp