భ‌యం పోయిందా ? క‌రోనా పోయిందా?

By G.R Maharshi Oct. 17, 2020, 06:20 pm IST
భ‌యం పోయిందా ? క‌రోనా పోయిందా?

జీవితం మ‌ళ్లీ నార్మ‌ల్‌. క‌రోనా పోయిందా, క‌రోనా అంటే భ‌యం పోయిందో తెలియ‌దు. టిఫిన్ బ‌ళ్ల‌లో వేడివేడి ఇడ్లీలు పొగ‌లు కక్కుతున్నాయి. దోశెలు సుయ్యిసుయ్యిమ‌ని పెనం మీద సౌండ్ చేస్తున్నాయి. చినుకులు ప‌డుతున్న‌ప్పుడు బ‌జ్జీలు, వ‌డ‌లు చేతులు మారుతున్నాయి. స‌ర్వీస్ ఆటోలు జ‌నాల‌తో రోడ్ల మీద ప‌డుతూ లేస్తూ తిరుగుతున్నాయి. మూతికి మాస్కులు పోలేదు. చేతులు క‌డ‌గ‌డం ఆగ‌లేదు.

క‌రోనా టెస్టుల కోసం క్యూలు లేవు. వ‌చ్చిన వాళ్ల కోసం రెడ్‌జోన్లు, అంబులెన్స్‌లు లేవు. ఎవడికి వాడు ఇళ్ల‌లో స‌ర్దేసుకుంటున్నారు. పిల్ల‌ల స్కూల్ బ్యాగులు మాత్రం ఇంకా చీల‌కు వేలాడుతున్నాయి. వాటిని ఎప్ప‌టికైనా మోయ‌క త‌ప్ప‌ద‌ని దిగులుగా చూస్తున్నారు.

రైళ్లు ఇంకా కూత పెట్ట‌డం లేదు. బ‌స్సులు కొంచెం భ‌యంగానే తిరుగుతున్నాయి. థియేట‌ర్ల గేట్లు తెరుచుకోవాలా వ‌ద్దా అన్న‌ట్టు చూస్తున్నాయి. ఈ 6 నెల‌ల్లో ఎంద‌రో మిత్రులు క‌రోనాని ఎదుర్కొని కోలుకున్నారు. కొంద‌రు వెళ్లిపోయారు. క‌నీసం చివ‌రి చూపు కూడా చూడ‌లేని నిస్స‌హాయ‌త‌.

క‌రోనా రాక‌పోతే చాలా విష‌యాలు ఎప్ప‌టికీ అర్థ‌మ‌య్యేవి కావు. ఒక పంజ‌రంలోని ప‌క్షి బాధ‌, ఊరికి , కూలీకి దూర‌మైన ఒక మ‌నిషి దుక్కం తెలిసింది. మ‌నుషుల్లో చాలా మంది మంచోళ్లు ఉంటార‌ని , వాళ్లు క‌రోనాకి కూడా భ‌య‌ప‌డ‌కుండా వేలాది మందికి అన్నం పెడ‌తార‌ని , ఆద‌రిస్తార‌ని క‌ళ్ల‌కి క‌నిపించింది.

మ‌నం రోజూ చూసే అంద‌మైన న‌గ‌రం వెనుక కొన్ని ల‌క్ష‌ల మంది శ్ర‌మ జీవులున్నార‌ని , వేలాది మైళ్లు దాటి వ‌చ్చి ప‌నిచేసినా ఒక చిరిగిపోయిన మూట త‌ప్ప ఇంకేమీ మిగుల్చుకోలేని క‌ష్ట‌మైన బ‌తుకుల‌ని తెలిసింది. ఈ దేశ‌మంతటా కోట్లాది మంది వ‌ల‌స కూలీలున్నార‌ని, హ‌ఠాత్తుగా లాక్‌డౌన్ ప్ర‌క‌టిస్తే వాళ్లు తిండిలేక మాడిపోతార‌నే క‌నీస ప‌రిజ్ఞానం కూడా దేశాన్ని పాలించే వాళ్ల‌కి లేద‌ని కూడా అర్థ‌మైంది.

క‌రోనాతో చ‌చ్చిపోతామో లేదో తెలియ‌దు. కానీ ఆక‌లితో గ్యారెంటీగా చ‌చ్చిపోతాం. ఇది అంద‌రికీ తెలుసు. ఆక‌లిని ఎదుర్కోవ‌డం కంటే క‌రోనాని ఎదుర్కోవ‌డం సుల‌భం. అదే జ‌రుగుతోంది.

కాలం ఎవ‌రి కోసం ఆగ‌దు. ఆకురాలు కాలం పోయి , ప‌చ్చ‌టి చిగురు తొడిగే కాలం వ‌స్తుంది. పార్కుల్లో ప‌క్షుల అరుపుల‌తో పాటు ప‌సిబిడ్డ‌ల కేక‌లు కూడా వింటాం. ఆట‌లు చూస్తాం.

బ‌తుకు బండి వేగం పెరిగింది. దాన్ని ఎవ‌రూ ఆప‌లేరు, ఆగ‌దు కూడా. క‌రోనా చిన్న‌చిన్న ఆనందాల్ని తినేసింది. అంద‌రి ఆశీస్సుల‌తో, అక్షింత‌ల‌తో పెళ్లి చేసుకోవాల‌నుకున్న వ‌ధూవ‌రులు భ‌యంభ‌యంగా పెళ్లి చేసుకున్నారు. పండ‌గ‌లు ఇల్లు దాటి బ‌య‌టికి రాలేదు. రంజాన్ నెల‌లో ఇష్టంగా తినే హ‌లీం కూడా లేకుండా పోయింది.

పాప్‌కార్న్ తింటూ ఈలలేస్తూ సినిమాలు చూసే రోజులు మ‌ళ్లీ రావాలంటే చాలా కాల‌మే ప‌ట్టేలా ఉంది.

భార్యాభ‌ర్త‌లు ఒక‌ర్నొక‌రు చూసుకుంటూ నెల‌లు గ‌డ‌ప‌డం వ‌ల్ల కొంద‌రి మ‌ధ్య ప్రేమ‌లూ పెరిగాయి, యుద్ధాలు పెరిగాయి. ఎవ‌రికేది ద‌క్కిందో వాళ్లు చెబితే త‌ప్ప తెలియ‌దు. ఇంటిగుట్టు క‌దా!

మందుబాబులు తొలిరోజుల్లో ఒడ్డున ప‌డిన చేప‌ల్లా గిల‌గిల కొట్టుకున్నారు కానీ, త‌ర్వాత న‌ల్లా వ‌దిలారు. ఇప్పుడు ప్ర‌వాహ‌మే. మునిగితేలారు.

అర‌టి , పూల‌రైతులు క‌న్నీళ్ల‌లో త‌డిసి , ఇపుడిపుడే కోలుకుంటున్నారు. బ‌య‌ట Take awayలు ఇంత కాలం లేక‌పోవ‌డంతో ఎవ‌రి వంట‌ను వాళ్లే వండుకున్నారు. ప‌నిలో ప‌నిగా చాలా మంది మ‌గాళ్లు వంట‌తో పాటు అంట్లు తోమ‌డం నేర్చుకున్నారు. నేర్చుకోలేని వాళ్లు త‌ల‌మీద బొప్పితో తిరిగారు.

జీవితం ఎప్పుడూ ఒక‌లా ఉండ‌దు. ఇలాంటి రోజులు కూడా వ‌స్తాయి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp