"అమ్మో"రికా : ప్ర‌మాణ స్వీకారం ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్దీ ఆందోళన

By Kalyan.S Jan. 14, 2021, 03:07 pm IST
"అమ్మో"రికా : ప్ర‌మాణ స్వీకారం ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్దీ ఆందోళన

అమెరికా అధ్య‌క్షుడి ఎన్నిక‌, గెలిచిన అభ్య‌ర్థిని అధికారికంగా ధ్రువీక‌రించేందుకు ఏర్పాటు చేసిన కాంగ్రెస్ స‌భ‌.. రెండూ అంశాలూ అమెరికాలో ఉద్రిక్త‌త‌కు దారి తీశాయి. ఇప్పుడు నూత‌న అధ్య‌క్షుడి ప్ర‌మాణ స్వీకారం ద‌గ్గ‌ర‌ప‌డుతున్న కొద్దీ అక్క‌డి వాతావ‌ర‌ణం వేడెక్కుతోంది. ఇప్ప‌టికీ ఓట‌మిని అంగీక‌రించ‌ని ట్రంప్ ఆందోళ‌న‌కారుల‌ను రెచ్చ‌గొడుతున్నారంటూ ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు బైడెన్‌ ప్రమాణస్వీకార తేదీ దగ్గరపడుతున్న కొద్దీ దేశమంతా ఉద్రిక్తత నెలకొంటోంది. ఈ పట్టాభిషేకాన్ని అడ్డుకునేందుకు దేశవ్యాప్తంగా సాయుధ నిరసన ప్రదర్శనలకు, దాడులకు సన్నాహాలు జరుగుతున్నాయని, ట్రంప్‌-అనుకూల అతివాద శక్తులు కుట్రపన్నుతున్నాయని ఎఫ్‌బీఐ వెల్లడించింది.

‘‘మొత్తం 50 రాష్ట్రాల్లోనూ ప్రదర్శనలకు సమాయత్తమవుతున్నారు. ట్రంప్‌ను గనక ముందస్తుగా తొలగిస్తే విరుచుకుపడాలని, ప్రభుత్వ కార్యాలయాలను, కీలక సంస్థలను, ఫెడరల్‌ భవనాలను ముట్టడించి విధ్వంసం సృష్టించాలని ఓ రాడికల్‌ గ్రూపు తమ సభ్యులకు సందేశాలు పంపింది. ఈనెల 16 నుంచి 20 దాకా రాష్ట్రాల్లోనూ, 17 నుంచి 20 దాకా వాషింగ్టన్‌లోనూ నిరసన హోరు కొనసాగించాలని అనేకమంది ట్రంప్‌-అనుకూలవాదులు నిర్ణయించారు’’ అని ఎఫ్‌బీఐ అంతర్గత భద్రతా బులెటిన్‌ పేర్కొంది. జనవరి 20న మిలియన్‌ మిలీషియా మార్చ్‌ నిర్వహణకు కొన్ని గ్రూపులు ప్రయత్నిస్తున్నట్లు వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ పేర్కొంది. హింస తప్పదనీ, కనీసం 28 ప్రధాన రాష్ట్రాల్లో పూర్తిస్థాయి భద్రతా ఏర్పాట్లు జరిపారనీ న్యూయార్క్‌ టైమ్స్‌ వెల్లడించింది.

ఇదిలా ఉండ‌గా.. పరిస్థితి చేజారకుండా చూసేందుకు వాషింగ్టన్‌ డీసీ పరిధిలో ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు ట్రంప్‌ ప్రకటించడం విశేషం. ఈనెల 24దాకా ఈ ఎమర్జెన్సీ అమల్లో ఉంటుందనీ, ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ జరగకుండా, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అంతర్గత భద్రతావిభాగం, ఫెడరల్‌ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్‌ ఏజెన్సీలు సంయుక్తంగా తగిన చర్యలు చేపట్టేందుకు ఈ ఎమర్జెన్సీ డిక్లరేషన్‌ వీలు కల్పిస్తుందనీ వైట్‌హౌస్‌ తెలిపింది. హింసా విధ్వంసాలకు తాను వ్యతిరేకిననీ ఆయన పునరుద్ఘాటించారు. మొత్తం 15,000 మంది నేషనల్‌ గార్డ్స్‌తో మున్నెన్నడూ లేనంత భద్రతను దేశ రాజధానిలో కల్పించారు. ఎక్కడా ఏ లోటూ జరగకుండా చూసేందుకు నేషనల్‌ గార్డ్డ్స్‌ బ్యూరో చీఫ్‌ డేనియల్‌ హొకాన్సన్‌ నిరంతర గస్తీని, గగనతల పర్యవేక్షణను ఇప్పటికే ప్రారంభించారు.

ట్రంప్ రాజీనామా చేయ‌ర‌ట‌..!

పదవీకాలం ముగియడానికి ముందే వైదొలగడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తిరస్కరించారు. రాజీనామా చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రాజ్యాంగం 25వ సవరణను అనుసరించి ఆయనను తక్షణం పదవీచ్యుతుణ్ణి చేయాలంటూ ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ను, కేబినెట్‌ను డెమొక్రాట్లు డిమాండ్‌ చేసిన తరుణంలో ట్రంప్‌- 20వ తేదీలోగా శ్వేతసౌధాన్ని వీడేది లేదని బలమైన సంకేతాలనిచ్చారు. అటు ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానంపై కూడా ఆయన పెద్ద ఆందోళన వ్యక్తం చేయలేదు. కేపిటల్‌ భవనంపై తిరుగుబాటును స్వయంగా ప్రోత్సహించిన నేరంపై 211 మంది కాంగ్రెస్‌ సభ్యులు తెచ్చిన ఈ తీర్మానంపై దిగువ సభ బుధవారంనాడు ఓటింగ్‌ జరుపుతుంది. సభలో డెమొక్రాట్లకు మెజారిటీ ఉన్నందున అక్కడ ఆమోదం పొందడం పెద్ద కష్టమేమీ కాదు. అంతేకాక- ఈ తీర్మానం నెగ్గడానికి కావల్సినది కూడా సాధారణ మెజారిటీయే. ఇక ఈ తీర్మానం సెనెట్‌ ఆమోదం పొందడంపైనే అనుమానాలున్నాయి. జో బైడెన్‌ ప్రమాణస్వీకారం చేసే లోగా ఈ తీర్మానంపై ఓటింగ్‌ నిర్వహించడం సాధ్యం కాదని సెనెట్‌ మెజారిటీ పక్ష నేత మిచ్‌ మెకానెల్‌ మంగళవారంనాడు స్పష్టం చేశారు.

సెనెట్‌ సమావేశమయ్యేదే 19వ తేదీనని, 24 గంటల్లో దీన్ని చర్చించి ఆమోదించడం అసాధ్యమని ఆయన వివరించారు. సెనెట్‌లో ఉభయ పక్షాలకూ చెరో 50 సీట్లున్నాయి. ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హారిస్‌తో కలుపుకుంటే డెమాక్రాట్ల బలం 51కు పెరుగుతుంది. మూడింట రెండొంతుల మంది సమర్థిస్తేనే తీర్మానం నెగ్గుతుంది. రిపబ్లికన్లలో ఎంతమంది అభిశంసనను సమర్థిస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. కేపిటల్‌ భవనం వెలుపల ప్రమాణస్వీకారం జరిపేందుకు తానేమీ భయపడడం లేదని కొత్త అధ్యక్షుడు జో బైడెన్‌ అన్నారు. ఏ ప్రదేశంలోనైతే ఆరో తేదీన ట్రంప్‌- అనుకూల నిరసనకారులు ఆందోళనకు, హింసకు దిగారో అక్కడే ఈ 20 వ తేదీన తాను, కమలా హారిస్‌ ప్రమాణం చేస్తామని ఆయన చెప్పారు. అయితే ఈ విషయంలో భద్రతా యంత్రాంగం తీసుకునే నిర్ణయంపై తమ తుదినిర్ణయం ఆధారపడి ఉంటుందన్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp