కేంద్రం ప్ర‌త్యేక ప‌థ‌కం.. అస‌లు అది నిజ‌మేనా?

By Kalyan.S Jul. 12, 2020, 09:09 pm IST
కేంద్రం ప్ర‌త్యేక ప‌థ‌కం.. అస‌లు అది నిజ‌మేనా?

ఆడ‌పిల్ల‌ల కోసం కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌త్యేక ప‌థ‌కం ప్ర‌వేశ పెట్టిందా? ఇంట్లో ఆడ పిల్ల ఉంటే సంవ‌త్స‌రానికి రూ.24 వేలు వ‌స్తాయ‌ట‌. అంటే ఈ లెక్క‌న ప్ర‌తి నెల‌కూ రెండు వేల రూపాయ‌లు వ‌స్తాయి. డైరెక్టుగా బ్యాంకులోనే ఆడ‌పిల్ల‌ల పేరిట కేంద్ర ప్ర‌భుత్వం డ‌బ్బులు జ‌మ చేస్తుంద‌ట‌‌. ఆ ప‌థ‌కం పేరు ప్ర‌ధాన‌మంత్రి క‌న్యా ఆశీర్వాద్ యోజ‌న ప‌థ‌కం. దానికి ద‌రఖాస్తు చేసుకుంటే కేంద్ర ప్ర‌భుత్వం సంవత్స‌రానికి 24 వేల రూపాయ‌లు ఇస్తుందంటూ.. ఓ వార్త వాట్సాపుల్లో, ప‌లు సోష‌ల్ మీడియా యాప్స్‌లో తెగ ట్రోల్ అవుతోంది. దీంతో ఈ వార్త నిజ‌మేన‌ని చాలా మంది న‌మ్మ‌డ‌మే కాకుండా మిగ‌తా వారికి కూడా షేర్ చేస్తున్నారు.

ఈ మ‌ధ్య ప‌లు ఫేక్ వార్త‌లు బాగా వైర‌ల్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇలాంటివి న‌మ్మి ప్ర‌జ‌లు కూడా మోస‌పోతున్నారు. ఇప్ప‌టికే కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఇలాంటి ఫేక్ వార్త‌లు న‌మ్మ‌వ‌ద్ద‌ని, ఎవ‌రికీ షేర్ చేయ‌వ‌ద్ద‌ని పేర్కొంటున్నాయి కూడా. అసలు నిజానికి ‘ప్ర‌ధానమంత్రి క‌న్యా ఆశీర్వాద్ యోజ‌న’ పేరుతో ఎలాంటి ప్ర‌భుత్వ ప‌థ‌కం లేదు. ఆ ప‌థ‌కం గురించి కేంద్రం ఎప్పుడూ.. ఎక్క‌డా పేర్కొన‌లేదు. అయితే సామాజిక మాధ్య‌మాల్లో మాత్రం ఈ అస‌త్య‌పు పథకం గురించి ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఆ పేరుతో ఏ ప‌థ‌క‌మూ లేదు..

అన్ని రాష్ట్రాలలోని 5 నుంచి 18 ఏళ్ళ ఆడపిల్లలకు ప్రతి నెలా రెండు వేలు కేంద్రం ప్ర‌భుత్వం వారి త‌ల్లిదండ్రుల ఖాతాలో వేస్తుంది. తొందరగా అప్లై చేసుకోండి అని చెప్తూ వైర‌ల్ అవుతున్న వీడియో, మెస్సేజ్ త‌ప్పు. అటువంటి ప‌థ‌కం ఏదీ లేదు. అని ప్రెస్ ఇన్‌ఫ‌ర్మేష‌న్ బ్యూరో (పీబీఐ) వివ‌ర‌ణ ఇచ్చింది. అది పూర్తిగా ఫేక్ న్యూస్ అని, దానిని ప్ర‌జ‌లు ఎవ‌రూ న‌మ్మ‌వ‌ద్ద‌ని త‌న ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా పేర్కొంది. అలాగే.. పీఐబి ఫ్యాక్ట్ చెక్ పేరుతో.. 8799711259 వాట్సాప్ నెంబ‌ర్, [email protected] మెయిల్ ఐడీ ఆ పోస్ట్ లో ఉన్నాయి. ఆ పోస్ట్ కు చాలా మంది నెటిజ‌న్లు స్పందించారు. ఇటువంటి ఫేక్ పోస్టులు సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అవుతున్నాయ‌ని, ఏది నిజ‌మో.. ఏది అబ‌ద్ద‌మో తెలియ‌డం లేద‌ని పేర్కొన్నారు. దీనిపై వివ‌ర‌ణ ఇచ్చినందుకు కొంద‌రు కృత‌జ్ఙ‌త‌లు తెలిపారు. ఆయా నెంబ‌ర్, లేదా మెయిల్ ఐడీ ద్వారా కేంద్ర ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌కు సంబంధించిన స‌మాచారం తెలుసుకునే అవ‌కాశం ఉందా..? అని మ‌రి కొంద‌రు ప్ర‌శ్నించారు.

అందుకే వేగంగా వైర‌ల్...

దాదాపు మూడు నెల‌ల‌కు పైగా ప్ర‌జ‌లంద‌రూ లాక్ డౌన్ తో ఇళ్ల‌కే ప‌రిమితం అయ్యారు. గ‌త నెల నుంచి భారీ సడ‌లింపులు ఊర‌ట ఇచ్చినా.. ప్ర‌జ‌ల ఆర్థికాభివృద్ధిలో పెద్ద‌గా పురోగ‌తి క‌నిపించ‌డం లేదు. వ్యాపారాలు పెద్ద‌గా సాగ‌డం లేదు. చాలా ప్రైవేటు కంపెనీ ఉద్యోగుల వేత‌నాల్లో కొత‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి. ఈ ప‌రిస్థితుల్లో ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌పై భారీగా ఆశ‌లు పెట్టుకుంటున్నారు. వాటికి సంబంధించి సోష‌ల్ మీడియాలో ఏ స‌మాచారం చూసినా.. చ‌దివినా.. వేగంగా వైర‌ల్ చేస్తున్నారు. ప్ర‌ధాన‌మంత్రి క‌న్యా ఆశీర్వాద్ యోజ‌న ప‌థ‌కానికి సంబంధించిన ఫేక్ మెస్సేజ్ కూడా కొద్ది రోజుల్లోనే ఎక్కువ మందికి చేరువై పోయింది. ఈ నేప‌థ్యంలో ఎలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలో తెలుసుకోవ‌డానికి స్థానిక కార్యాయాల‌కు వెళ్లి వాక‌బు చేస్తుండ‌డం.. ప్ర‌భుత్వ వెబ్ సైట్ ద్వారా విన‌తులు పంపండం వంటి చ‌ర్య‌ల వ‌ల్ల... దీనిపై పీబీఐ స్పందించింది. లాక్ డౌన్ నేప‌థ్యంలో ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెట్టి ఉంటుందిలే అని ఎక్కువ మందిలో ఆస‌క్తి రేకెత్తించిన ఆ ప‌థ‌కం చివ‌ర‌కు అవాస్త‌వ‌మ‌ని తెలియ‌డంతో విచారం వ్య‌క్తం చేశారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp