ఎమ్మెల్యే రాజాసింగ్ పై ఫేస్ బుక్ నిషేధం

By Kalyan.S Sep. 03, 2020, 08:25 pm IST
ఎమ్మెల్యే రాజాసింగ్ పై ఫేస్ బుక్ నిషేధం

ఫేస్ బుక్ పోస్టుల‌పై ఇటీవ‌ల కొంత కాలంగా జ‌రుగుతున్న వివాదాలు తెలిసిందే. ఈ వివాదాలు ఇప్పుడు జాతీయ స్థాయి నుంచి తెలుగు రాష్ట్రాల్లోకి కూడా పాకాయి. ఫేస్ బుక్ బీజేపీతో కుమ్మక్క‌యింద‌న్న ఆరోప‌ణ‌లు జాతీయ స్థాయిలో బాగానే గుప్పు మంటున్నాయి. ఈ నేప‌థ్యంలో తెలంగాణ కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే పై ఫేస్ బుక్ నిషేధం విధించ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై ఫేస్‌బుక్ యాజమాన్యం నిషేధం విధించింది. ద్వేషపూరిత, వివాదాస్పద వ్యాఖ్యల విషయంలో ఫేస్‌బుక్ నియమాలను ఆయన పాటించలేదని ఫేస్‌బుక్ పేర్కొంది. ద్వేష పూరిత, వివాదాస్పద వ్యాఖ్యల విషయంలో ఫేస్‌బుక్ విధించిన నియమావళిని ఆయన ఉల్లంఘించారని ఫేస్‌బుక్ ప్రతినిధి తెలిపారు.‘‘వివాదాస్పద వ్యాఖ్యలు, హింసను ప్రేరేపించే వ్యాఖ్యల విషయంలో మా నియమావళిని ఎమ్మెల్యే ఉల్లంఘించారు. అందుకే ఎమ్మెల్యే రాజా సింగ్‌పై నిషేధం ప్రకటించాం’’ అని తెలిపారు.

రాజాసింగ్ వివ‌ర‌ణ‌

ఫేస్ బుక్ వివాదాల నేప‌థ్యంలో రాజాసింగ్ పై ఆరోపణలు రావడంతో వారం క్రితమే ఆయన ఓ వివరణ ఇచ్చారు. తనకు అధికారికమైన ఫేస్‌బుక్ పేజ్ లేదని, తన పేరుమీదుగా చాలా మంది ఫేస్‌బుక్ పేజీని నడుపుతున్నారని స్పష్టం చేశారు. తనకు అధికారికమైన ఫేస్‌బుక్ పేజీ లేదని, అందుకే ఏ పోస్టుకూ తాను బాధ్యుడ్ని కాదని కూడా రాజా సింగ్ గతంలో స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ ఫేస్ బుక్ వివాదం కొంత‌కాలంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య పెను చిచ్చు రేపుతూనే ఉంది. కాంగ్రెస్ నేత శశి థరూర్ ని పార్లమెంట్ పానెల్ చైర్మన్ పదవి నుంచి తొలగించాలని కోరుతూ గ‌త నెల‌లో బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే..లోక్ సభ స్పీకర్ కి లేఖ రాశారు. ఇన్ఫర్మేషన్, టెక్నాలజీలపై గల పార్లమెంటరీ స్థాయీ సంఘానికి శశిథరూర్ చీఫ్ గా ఉన్నారు. ఈ పదవి నుంచి ఆయనను తొలగించాలని దూబే.. స్పీకర్ కి లేఖ రాయగా, దీన్ని కేంద్రమంత్రి రాజ్యవర్ధన్ రాథోడ్ కూడా సమర్థించారు. బీజేపీ నేతలు చేసిన ద్వేషపూరిత ప్రసంగాలు, వ్యాఖ్యలను ఫేస్ బుక్ కావాలనే పక్కన పెడుతోందంటూ వాల్ స్ట్రీట్ జర్నల్ లో ప్రచురితమైన ఓ ఆర్టికల్ బీజేపీ- కాంగ్రెస్ పార్టీల మధ్య చిచ్చు రేపింది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp