వివేక్ వెంకటస్వామి పార్టీ మారడం లేదట..! అదంతా ఫేక్ ప్రచారమట..!

By Ritwika Ram Jul. 15, 2021, 05:00 pm IST
వివేక్ వెంకటస్వామి పార్టీ మారడం లేదట..! అదంతా ఫేక్ ప్రచారమట..!

గతంలో కాంగ్రెస్ పార్టీని వీడి వెళ్లిపోయిన నేతలు.. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకున్నాక ఒక్కొక్కరుగా తిరిగి వస్తున్నారు. చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, డీఎస్ కొడుకు, నిజామాబాద్ మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ తదితరులు కాంగ్రెస్ చేరుతామని ప్రకటించారు. కూన శ్రీశైలం గౌడ్ కూడా సొంత గూటికి చేరుతారని నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని, మాజీ ఎంపీ, ప్రస్తుత బీజేపీ కోర్ కమిటీ మెంబర్ వివేక్ వెంకటస్వామి కలిశారని, దాదాపు రెండు గంటలపాటు భేటీ అయ్యారని వార్తలు వచ్చాయి. బీజేపీలో భవిష్యత్ లేదని, రేవంత్ రెడ్డి వచ్చాక కాంగ్రెస్ కు పూర్వ వైభవం వచ్చిందని వివేక్ మాట్లాడినట్లు పుకార్లు షికార్లు చేశాయి. కానీ ఈ వార్తలను వివేక్ కొట్టిపారేశారు. అవి ఫేక్ వార్తలని చెప్పారు.

తప్పుడు ప్రచారం చేస్తున్నారు

తాను పార్టీ మారుతున్నట్లు ఊహాగానాలు రావడంతో వివేక్ వెంకటస్వామి వెంటనే స్పందించారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన క్రెడిబిలిటీని దెబ్బతీసేందుకు సోషల్ మీడియాలో కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. న్యూస్ చానల్స్ పేరుతో ఫేక్ ఫొటోలు తయారు చేసి, పార్టీ మారుతున్నట్లు ప్రచారం చేస్తున్నారని, దీనిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీడియోలు, ఫోటోలు మార్ఫింగ్ చేస్తున్నవారితో పాటు.. వాటిని సర్క్యులేట్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే తాను రేవంత్ తో భేటీ అయ్యారా? లేదా? అనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.

Also Read : జగన్‌ పాలన గొప్పగా ఉంది.. బాబు మాటలతో ..

గతంలో వార్తలు హల్ చల్

వివేక్ తిరిగి కాంగ్రెస్ లోకి చేరుతున్నారని వార్తలు రాగానే.. బీజేపీ వర్గాల్లో కలకలం రేగింది. రాజకీయంగా ఎంతో పలుకుబడి ఉన్న కాకా వెంకటస్వామి కొడుకు కావడం, తెలంగాణలో మీడియా హౌజ్ కు యజమాని కావడమే ఇందుకు కారణం. అయితే వివేక్ విషయంలో ఇలా ఫొటోలు వైరల్ కావడం ఇదే మొదటి సారి కాదు. గతంలో కూడా.. ఆయన తిరిగి టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు వార్తలు బయటికి వచ్చాయి. కానీ అందులో ఎలాంటి నిజం లేదని తేల్చాశారు వివేక్. ఇక ఎన్నికలు వచ్చినప్పుడల్లా.. వీ6 చానల్ ఫొటోలు, వెలుగు న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్ ను మార్ఫింగ్ చేసి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. గతంలో వీటిపైనా సైబర్ క్రైమ్ కు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు బయటికి వచ్చిన వార్తలు కూడా అలాంటివేనని వివేక్ స్పష్టం చేస్తున్నారు.

అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు..

2009లో రాజకీయాల్లోకి వచ్చారు వివేక్ వెంకటస్వామి. 2014 దాకా ఎంపీగా ఉన్నారు. బిజినెస్ మన్ గా సూపర్ సక్సెస్ అయిన వివేక్.. రాజకీయాల్లో కొన్ని సార్లు తప్పటడుగులు వేశారు. 2014లో తెలంగాణ ఏర్పాటు సమయంలో టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు ప్రకటించారాయన. కానీ తర్వాత మనసు మార్చుకున్నారు. ఎన్నికలయ్యేదాకా కాంగ్రెస్ లోనే ఉండిపోయారు. ఆ ఎన్నికల్లో పెద్దపల్లి నుంచి ఎంపీగా పోటీ చేసి బాల్క సుమన్ చేతిలో ఓడిపోయారు. తర్వాత కొన్నాళ్లకు మళ్లీ టీఆర్ఎస్ లోకి చేరారు. ప్రభుత్వ సలహాదారుగా పని చేశారు. కానీ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కానీ, 2019 లోక్ సభ ఎన్నికల్లో కానీ టీఆర్ఎస్ ఆయనకు టికెట్ ఇవ్వలేదు. దీంతో 2019 మార్చిలో లోక్ సభ ఎన్నికలకు ముందే టీఆర్ఎస్ నుంచి వివేక్ బయటికి వచ్చారు. బీజేపీలో చేరినా.. ఆ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండిపోయారు. రానున్న ఎన్నికల్లో మంచిర్యాల లేదా పెద్దపల్లి నుంచి పోటీ చేయాలని ఆయన భావిస్తున్నారు.

Also Read : రేవంత్ పై మాజీ ఎంపీ, బీజేపీ నేత వివేక్‌ వెంకటస్వామి పొగడ్తల వర్షం.. సొంత గూటికి చేరడం ఖాయమేనా..?

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp