ఆలయాల విధ్వంసం వారి పనే.. పార్టీల ప్రమేయం లేదన్న ఉండవల్లి..!

By Voleti Divakar Jan. 13, 2021, 02:00 pm IST
ఆలయాల విధ్వంసం వారి పనే.. పార్టీల ప్రమేయం లేదన్న ఉండవల్లి..!

బిజెపి అమితంగా అభిమానించే స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ బిజెపి మతతత్వ విధానాలను తీవ్రంగా దుయ్యబట్టారు. ఈ మధ్య కాలంలో ఉండవల్లి బిజెపి, ఆపార్టీ మాతృసంస్థ ఆర్ఎస్ఎస్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. రాష్ట్రంలో జరుగుతున్న ఆలయాల విధ్వంసం వెనుక ఉన్న వ్యక్తులెవరో మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ బయటపెట్టారు. ఈ దాడుల వెనుక రాజకీయ ప్రమేయం లేదని, ఒకవేళ ఉన్నా అలాంటి వారిని ఆయా పార్టీల నుంచి బహిష్కరించాలని స్పష్టం చేశారు.

పేరుప్రతిష్టల కోసమే కొంతమంది ఆగంతకులు, లేదా అసాంఘిక శక్తులు ఆలయాల్లో విధ్వంసాలు సృష్టిస్తున్నారని, దీన్ని టిడిపి అధినేత చంద్రబాబునాయుడు, బిజెపి పార్టీలు రాజకీయ ప్రయోజనం కోసం వాడుకునే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. దేవుడి పేరిట రాష్ట్రంలో రాజకీయాలు చేయడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిణామాలు బిజెపికి కలసి వస్తాయని అభిప్రాయపడ్డారు. బిజెపి నేతలు భగవద్గీత పార్టీ కావాలా..బైబిల్ పార్టీ కావాలా అంటూ ప్రజల మధ్య చిచ్చు పెట్టే విధంగా వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ఇలాంటి పరిణామాలు దేశానికి ప్రమాదమని హెచ్చరించారు.

వీధికోటి చొప్పున రాష్ట్రంలోని అన్ని ఆలయాలకు కాపలా కాయడం, వాటిని పరిరక్షించడం సాధ్యం కాదని కూడా ఉండవల్లి కుండబద్దలుకొట్టారు. ఉండవల్లి వ్యాఖ్యలపై టీడీపీ, బీజేపి పార్టీలు ఎలా స్పందిస్తాయో..ఎందుకంటే ఇప్పటి వరకు అపార్టీలు అధికార వైస్సార్సీపిని లక్ష్యంగా చేసుకొని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ సంగతి తెలిసిందే.

రామతీర్థం ఎక్కడుందో ఈ మధ్యకాలం వరకు తనకు తెలియదని ఉండవల్లి అన్నారు. ఆలయంలో విధ్వంసం సృష్టించిన వారిని కఠినంగా శిక్షించే విధంగా పోలీసులకు స్వేచ్ఛను ఇవ్వాల్సిన అవసరం ఉందని ఉండవల్లి అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ఎన్నికల సంఘం నుంచి మతం వరకు అన్ని వ్యవస్థలు రెండుగా చీలిపోయాయన్నారు. రాజకీయాల్లోకి మతాన్ని లాగడం తగదన్నారు. బిజెపి ఉత్తరాదికి చెందిన అయోధ్య రాముడ్ని పూజిస్తుందని, అయితే భద్రాద్రి రాముడ్ని కొలవడం తెలుగువారి సాంప్రదాయమని ఉండవల్లి పేర్కొన్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp