ప్రజల జ్ఞాపకాలు చెరిపి వేసే పరికరం ఎంతైనా అవసరం

By Sannapareddy Krishna Reddy Sep. 25, 2020, 08:04 pm IST
ప్రజల జ్ఞాపకాలు చెరిపి వేసే పరికరం ఎంతైనా అవసరం

మెన్ ఇన్ బ్లాక్ అని హాలీవుడ్ లో సూపర్ హిట్ ఫ్రాంఛైజ్ ఉంది. అందులో అమెరికా ప్రభుత్వానికి చెందిన అత్యంత రహస్యమైన సంస్థకి చెందిన ఇద్దరు ఏజెంట్లు మన మధ్య సాధారణ మనుషుల్లా తిరుగుతున్న గ్రహాంతర వాసులను వెతికి అంతం చేస్తూ ఉంటారు. మామూలు మనుషుల్లా ఉండే గ్రహాంతర వాసులను వీరు చూడగానే భీభత్సమైన ఆకారాలలోకి మారిపోయి, భీకరమైన పోరాటం చేసి, ఈ ఇద్దరు ఏజెంట్ల చేతుల్లో అంతమవుతారు. తమ మధ్య ఇలాంటి భయంకరమైన ఏలియెన్స్ ఉన్నారని తెలిస్తే ప్రజలు భయాందోళనకు గురవుతారని పోరాటం ముగిసిన వెంటనే జేబులో నుంచి ఒక చిన్న టార్చిలైటు లాంటి పరికరం బయటకు తీసి నొక్కగానే ఆ చుట్టుపక్కల ఉన్నవారి మెదడులో నుంచి ఆ పోరాటం తాలూకు ఙాపకం పూర్తిగా మాయమౌతుంది.

ప్రజల ఙాపకాలు చెరిపి వేయడం రాజకీయ పార్టీలకు చాలా అవసరం. అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట చెప్తుంటారు. ఎన్నికల తర్వాత అటుఇటూ అయితే ప్రజలు ఇంతకుముందు చెప్పిన మాటలు గుర్తు పెట్టుకుని నిలదీయకుండా ఉండాలంటే అంతకుముందు వారు చెప్పిన మాటలు ప్రజలకు గుర్తు ఉండకూడదు.

సాంప్రదాయక మీడియా ఒకటే ఉండి, అది తమ చెప్పుచేతలలో ఉన్నంత కాలం ప్రజల జ్ఞాపకాలు చెరిపివేయడం పెద్ద కష్టమైన పనిగా ఉండేది కాదు. మీడియాలో ఏదో ఒకటి పదేపదే రాస్తూ ఉంటే సహజంగానే ఙాపకశక్తి తక్కువ ఉన్న జనం అదే నిజమని నమ్మేస్తూ వచ్చారు. ఎవరైనా పాత విషయాలన్నీ గుర్తు పెట్టుకున్నా వారి సంఖ్య తక్కువగా ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఉండదు. ఒకవేళ ఎవరైనా పాత విషయాలను ప్రస్తావించినా నేనలా అనలేదనో, చేయలేదనో దబాయిస్తే ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి.

మారిన మీడియా ముఖచిత్రం

ఉవ్వెత్తున దూసుకొచ్చిన సాంకేతిక, సమాచార విప్లవం వల్ల మీడియా ముఖచిత్రమే మారిపోయింది. ఏదో ఒక వర్గానికో, పక్షానికో కొమ్ము కాసే మీడియాని ఇప్పుడు ఎవరూ నమ్మడం లేదు. ఇంటర్నెట్, గూగుల్, యూట్యుబ్ లాంటి వాటిలో ఎవరు ఎప్పుడు ఏం చెప్పారో, ఏం చేశారో రికార్డయి అందరికీ అందుబాటులో ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసే సౌలభ్యం వచ్చింది. గతంలో నేనలా చేయలేదని దబాయించే వీలు లేకుండా పోయింది. స్మార్ట్ ఫోన్ తీసి గూగుల్ ఓపెన్ చేస్తే జాతకమంతా అరచేతిలో ప్రత్యక్షమౌతుంది. అలా వెలికితీసిన వాడు అంత ఓపిక లేనివారికి చూపించడానికి ఫేస్ బుక్, ట్విట్టర్, బ్లాగుల రూపంలో సోషల్ మీడియా తయారయింది.

ఇప్పుడు రాష్ట్రంలో గతంలో తను చెప్పిన మాటలతో, చేసిన పనులతో బాగా ఇబ్బంది పడుతూ, ప్రజల ఙాపకాలు చెరిపివేసే పరికరం తన చేతిలో ఉంటే బాగుండేది అని కోరుకుంటున్న నాయకుడు చంద్రబాబు. ఇప్పుడు ఆయన ఏ విషయాలలో అధికార పక్షం మీద విమర్శలు గుప్పించినా గతంలో తను అవే పనులు చేసి ఉండడంతో అందరూ వాటిని బయటకు తీస్తూ ఆ విమర్శలు ఆయన తలకే చుడుతున్నారు.

పార్టీ ఫిరాయింపు- జే టాక్స్

తాజాగా విశాఖపట్నానికి చెందిన తన పార్టీ ఎమ్మెల్యే జగన్ పంచన చేరి, కొడుకులిద్దరికీ వైసిపి కండువా కప్పి, తాను కూడా వైసీపీతో కలిసి పని చేస్తానని చెప్పగానే, జే టాక్స్ ద్వారా సంపాదించిన అక్రమార్జనతో జగన్ ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొంటున్నాడు అని ఒక ట్వీట్ పెట్టాడు చంద్రబాబు. జే టాక్స్ అనేది లోకేష్ బాబు ట్విట్స్ లో తప్ప మరెక్కడా లేదు. ఎవరైనా జే టాక్స్ చెల్లించి ఉంటే, అధికార పక్షం మీద చీమంత నెగటివిటీ ఉంటే ఏనుగంత చేసి చూపించే పచ్చ మీడియా ఊరుకుంటుందా. లోకేష్ బాబు ట్విట్టర్ అకౌంట్లో తప్ప మరెక్కడా లేని జే టాక్స్ అనగానే ప్రజలకు గతంలో ఒక నాయకుడి సంతానం కే టాక్స్ పేరిట తమ నియోజకవర్గంలో బడా వ్యాపారుల నుంచి బక్కచిక్కిన బండి వ్యాపారుల వరకూ ముక్కు పిండి చేసిన వసూళ్లు గుర్తుకు వస్తాయి.

ఎమ్మెల్యేల కొనుగోళ్లు అనగానే గతంలో చంద్రబాబు ప్రతిపక్ష పార్టీకి చెందిన ఇరవైమూడు మందిని రకరకాలుగా అశ చూపి తనవైపు చేర్చుకుని, నలుగురికి ఏకంగా మంత్రి పదవులు కట్టబెట్టడం, బద్థవిరోధులైన ఇద్దరు ఎమ్మెల్యేలను కూర్చోబెట్టి ఆక్రమార్జన చెరిసమానంగా పంచుకోమని సాక్షాత్తు చంద్రబాబు చెప్పారని వారిలో ఒకరు చెప్పిన వీడియో బయటకు వచ్చింది కూడా!

హిందూ హృదయ సామ్రాట్ అవతారానికీ ఇదే ఇబ్బంది

రాష్ట్రంలో కులాల పోలరైజేషన్ దాదాపు పూర్తయిన పరిస్థితిలో, హిందువుల ఓట్లు రాబట్టడం కోసం అక్కడక్కడా జరిగిన రధం దగ్ధం లాంటి సంఘటనల నేపథ్యంలో చంద్రబాబు హిందూ ధర్మ పరిరక్షకుడి అవతారం ఎత్తాలని చేసిన ప్రయత్నాలకు ఆయన గతం దెబ్బ కొట్టింది. కృష్ణా పుష్కరాల సందర్భంగా నలభై పైగా ఆలయాలను తొలగించడం, కాళ్ళకు బూట్లతో పూజలు చేయడం లాంటి విషయాలు బయటకు తీసి దానికి అడ్డుకట్ట వేస్తున్నారు ప్రత్యర్థులు.

ఏ అంశం తీసుకున్నా ఇదే సమస్య

ప్రభుత్వ వైద్యుడు సుధాకర్ బాబు ఫుల్లుగా మద్యం సేవించి దారిలో కనిపించిన వారినీ, ముఖ్యమంత్రినీ పచ్చి బూతులు తిడుతుంటే అక్కడున్న జనం చొక్కా విప్పి, చేతులు వెనక్కి విరిచికట్టి పోలీసులకు అప్పగిస్తే, ప్రభుత్వ ఉద్యోగులతో వ్యవహరించే తీరు ఇదేనా అని ప్రభుత్వం మీద విమర్శలు చేయబోతే గతంలో మహిళా తహసీల్దారును తమ ఎమ్మెల్యే ఏం చేశాడో సాక్ష్యాలతో సహా బయటకు తీస్తున్నారు. అలాగే ఇసుక అక్రమ రవాణా అని ఏమైనా అంటే ఏర్పేడులో తమ పార్టీకి చెందిన ఇసుక మాఫియా అమాయక జనాన్ని లారీతో తొక్కి చంపిన ఘటన బయటకు వస్తుంది.

విద్యుత్ రంగంలో తమ ప్రభుత్వం అద్భుతమైన పనితీరు ప్రదర్శించిందనీ, తమ హయాంలో బిల్లులు తక్కువగా ఉండేవనీ, ఉచిత విద్యుత్ కూడా తనవల్లనే వచ్చిందనీ చెప్పుకునే ప్రయత్నం చేశారు బాబు గారు. పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని ఆందోళన చేసిన వారిపై కాల్పులు జరిపి, ముగ్గురి మరణానికి కారణమైన బషీర్ బాగ్ ఘటన, ఉచిత విద్యుత్ ఇస్తే కరెంటు తీగలు బట్టలు ఆరవేసుకోవడానికే పనికొస్తాయని గతంలో బాబు గారు అన్న మాటలు ఆడియో, వీడియో క్లిప్పుల రూపంలో బయటకు తీస్తారు నెటిజెన్లు.

మద్యం పాలసీ తీసుకున్నా ఆదే తీరు

మద్యం ధరలు పెంచి, మద్యం షాపులు తగ్గించి, క్రమంగా రాష్ట్రంలో మద్యం లేకుండా చేయాలన్న జగన్ ఆలోచన మందు బాబుల్లో అసంతృప్తి పెంచడం మంచి అవకాశంగా భావించారు చంద్రబాబు, లోకేష్ బాబులు. ఇద్దరూ ట్విట్టర్ వేదికగా ప్రభుత్వం మీద చెలరేగి పోయారు. అయితే తాము అధికారంలో ఉండగా వీధి వీధికి బెల్టుషాపులు, గడప గడపకు మద్యం డెలివరీ చేయించిన రోజులు గుర్తు చేశారు సోషల్ మీడియాలో. ప్రెసిడెంట్ మెడల్ అన్న బ్రాండ్ మద్యం మీద తెలుగు దేశం శ్రేణులు ట్రోల్ చేయబోతే దానికి తెలుగుదేశం హయాంలో అనుమతి ఇచ్చిన జీవోను బయటకు లాగారు.

దళిత శంఖారావంలో కూడా

అక్కడక్కడా జరిగిన సంఘటనలను సొమ్ము చేసుకుందని, ఈ ప్రభుత్వ పాలనలో దళితుల మీద అత్యాచారాలు ఎక్కువై పోతున్నాయి, దళితులు మా పాలనలో సుభిక్షంగా ఉండేవారు అని దళిత శంఖారావం అని ఒక కార్యక్రమం చేబడితే, గతంలో దళితులుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని చంద్రబాబు అన్న మాటలు, దళితులు మీకెందుకు రాజకీయాలు అని మహిళా తహశీల్దారును ఇసుకలో పడేసి కొట్టిన ఎమ్మెల్యే అన్న మాటలు, ఒక దళిత బాలుడిని అతని కులం పేరు చెప్పి మరీ తిట్టిన ఎప్పటికీ కాబోయే రాజ్యసభ ఎంపీ వర్ల రామయ్య వీడియోలు బయటకొచ్చి దళితుల మీద వీరికి ఉన్న ప్రేమ ఎంత హిపోక్రసీతో కూడుకున్నదో అందరికీ చూపిస్తున్నాయి.

ప్రజల మనసుల్లోంచి తాము గతంలో చేసిన తప్పుల తాలూకు జ్ఞాపకాలు పూర్తిగా చెరిపి వేయగలిగితే అధికార పక్షం మీద సమర్ధవంతంగా దాడి చేయగలమని చంద్రబాబుకు అనిపించడంలో తప్పు లేదు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp