ఈటల యుద్ధం ఆగేలా లేదు..!

By Kalyan.S May. 06, 2021, 10:15 am IST
ఈటల యుద్ధం ఆగేలా లేదు..!

తెలంగాణ ప్రభుత్వంతో మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ చేస్తున్న పోరు తీవ్రస్థాయికి చేరేలా కనిపిస్తోంది. టీఆర్‌ఎస్‌తో గట్టిగానే ఢీకొట్టేందుకు సమాయత్తం అవుతున్నట్లు కనిపిస్తోంది. మరోవైపు కోర్టు కూడా ఈటలపై వచ్చిన ఆరోపణలపై విచారణ తీరును తప్పుబట్టడంతో ఆయన మరింత దూసుకెళ్తున్నారు. ఇన్నాళ్లూ హుజూరాబాద్‌ నుంచి రాజకీయాలు చేసిన ఆయన ఇక మకాన్ని హైదరాబాద్‌కు మార్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా ఉద్యమకారులను కలుపుకుని ప్రభుత్వంపై ఆత్మ గౌరవ ఉద్యమానికి శ్రీకారం చుట్టనున్నట్లు ఈటల వ్యాఖ్యలు, చర్యలు స్పష్టం చేస్తున్నాయి.

మూడు రోజులుగా కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లోని తన క్యాంపు కార్యాలయంలోని ముఖ్య నేతలతో ఈటల రాజేందర్‌ సమాలోచనలు జరుపుతున్నారు. అనంతరం హైదరాబాద్‌కు చేరుకున్నారు. అన్ని జిల్లాల నుంచి ప్రజలు, అభిమానులు, పాత ఉద్యమకారులను కలిసేందుకు ప్రణాళికలు రచించుకుంటున్నారు. హైదరాబాద్‌కు వచ్చే ఆయన మాట్లాడుతూ తన రాజకీయ భవిష్యత్తుపై తనకు మద్దతు పలుకుతున్న ప్రజల అభిప్రాయాలను తీసుకొని సరైన సమయంలో నిర్ణయాన్ని ప్రకటిస్తానని ఈటల రాజేందర్‌ ఇప్పటికే ప్రకటించారు. దేశవిదేశాల నుంచి తనకు వేల ఫోన్లు వస్తున్నాయని.. తన శ్రేయోభిలాషులు, మిత్రులు, రాజకీయవేత్తలతో చర్చించి ఏం చేయాలనేది నిర్ణయిస్తానని చెప్పారు. వాస్తవంగా తెలంగాణ ప్రజలు ఏం ఆశించారు? వారికి ఏం అందింది? అనేవి పరిశీలిస్తామన్నారు.

ఇది ఆత్మగౌరవ సమస్య అని, తన విషయంలో దుర్మార్గంగా, అన్యాయంగా వ్యవహరించారని, ఏమాత్రం సహించకుండా ముందుకు వెళ్లాలని చాలామంది తనకు చెప్పారని.. ఇచ్చిన పిలుపునకు అనుగుణంగా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని మాట ఇచ్చారని ఆయన తెలిపారు. హుజూరాబాద్‌ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం అనంతరం ఈటల బయటకు వస్తుండగా ఆయన్ను చూసి ఇల్లందకుంట మండలం సిరిసేడు గ్రామానికి చెందిన ఓ మహిళ రోదించింది. ‘‘అయ్యో బిడ్డా... నీకు ఇలా జరిగిందా. మా లాంటి పేదలకు ఎంతో సాయం చేశావు’’ అంటూ కన్నీంటి పర్యంతమైంది. ఆమెను ఈటల ఓదార్చారు. ఆ సమయంలో ఆయన కళ్లలో నీళ్లు సుడులు తిరిగాయి. ఇది చూసి అక్కడున్న మిగతా మహిళలు కూడా కంటతడి పెట్టారు. అనంతరం ఆయన కారులో హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లారు.

ఈటలకు సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌. కె నారాయణ మద్దతు పలికారు. భూ ఆక్రమణల ఆరోపణలతో ఈటలపై సీఎం కేసీఆర్‌ చర్యలు కుట్రపూరితమని వ్యాఖ్యానించారు. ఈటలపై మోపిన కేసు ఆధారంగా ప్రభుత్వం తీసుకున్న చర్యలపై న్యాయ వ్యవస్థ న్యాయంగానే స్పందించిందని పేర్కొన్నారు. కేసు నేపథ్యంలో కోర్టు వ్యాఖ్యలపై హర్షం వ్యక్తం చేశారు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా, రెండు పర్యాయాలు మంత్రివర్గంలో ఉంటూ...అటు టీఆర్‌ఎస్‌ పార్టీలో సైతం క్రియాశీలక పాత్రవహించిన ఈటలపై పోలింగ్‌ అయిన మరుక్షణం చర్యలు ప్రారంభించారంటే ఇది కుట్రపూరితం కదా? అని ప్రశ్నించారు. రాష్ట్ర మంత్రివర్గంలో ఉండి ఈటల, అసైన్డ్‌ భూములు ఆక్రమించడం తప్పు కాదా? అని రాజ్యసభ సభ్యుడు కెప్టెన్‌ లక్ష్మీకాంతారావు ఎదురు ప్రశ్నించడం గమనార్హం.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp