చంద్రబాబు రాజకీయ జీవితం క్లైమాక్స్‌కు...ఆసక్తి రేపుతున్న GVL కామెంట్స్

By P. Kumar Jul. 31, 2020, 07:00 pm IST
చంద్రబాబు రాజకీయ జీవితం క్లైమాక్స్‌కు...ఆసక్తి రేపుతున్న GVL కామెంట్స్

కొత్త నీరొస్తే పాత నీరు సైడివ్వాల్సిందే. ప్రస్తుతం చంద్రబాబు పరిస్థితీ ఇదే. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు చంద్రబాబును భవిష్యత్తు నాయకుడిగా చూడట్లేదనే వ్యాఖ్యానాలు కొద్ధికాలంగా వినిపిస్తున్నవే. కాగా, గురువారం బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు చంద్రబాబు రాజకీయ జీవితంపై చేసిన వ్యాఖ్యలు సైతం ఇదే విషయాన్ని స్పష్టంచేస్తున్నాయి. అయితే అనూహ్యంగా జీవీఎల్‌ వ్యాఖ్యలకు కౌంటర్‌గా చంద్రబాబు అనుకూల ప్రసారమాధ్యమాల్లో ఏ ఒక్కటీ స్పందించకపోవడాన్ని చూస్తుంటే బాబు రాజకీయ జీవిత క్లైమాక్స్‌ చేరిందనే అనుకోవాల్సి వస్తోంది...!

జీవీఎల్‌ తేల్చేశారు....

ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ నేత ములాయంసింగ్‌ యాదవ్‌ సైకిల్‌(ఆ పార్టీ గుర్తు సైకిల్‌) తొక్కలేక క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకున్నట్టే...ఏపీలో చంద్రబాబునాయుడు సైతం రాజకీయాల నుంచి కనుమరుగైపోయారు....ఇవీ బీజేపీ నేత జీవీఎల్‌ నరసింహారావు వ్యాఖ్యలు. విపత్కర పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉండాల్సిన చంద్రబాబు పక్క రాష్ట్రంలో తలదాచుకోవడం ఇందులో భాగమే అంటున్నారాయన. దీంతో చంద్రబాబు రాజకీయ సామర్థ్యాలపై ఆఫ్‌ ది రికార్డుగా జరిగే చర్చను కాస్తా జీవీఎల్‌ పొలిటకల్‌ తెరపైకి తెచ్చి ఓట్‌ ఆఫ్‌ థ్యాంక్స్‌ పలికేశారంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఆ మీడియా మిన్నకుందేలా...

చంద్రబాబుపై చీమ చిటుక్కుమన్నా సహించలేని మీడియా జీవీఎల్‌ వ్యాఖ్యలపై కిమ్మనకుండా ఉండటం ఒకింత ఆశ్చర్యమే. చంద్రబాబు రాజకీయ ఎత్తులకు అడ్డుచ్చేవారిని, ఆయనపై విమర్శలు చేసేవారిని అవసరమైతే వ్యక్తిగతంగానూ వెంటాడి వేటాడే మీడియా...ఇప్పుడేకంగా బాబు రాజకీయ జీవితానికి శుభంకార్డు పడిందంటున్న జీవీఎల్‌పై స్పందించకపోవడం పలు సందేహాలకు తావిస్తోంది. 70 ఏళ్ల చంద్రబాబును నవతరం ప్రతినిధిగా, నవ్యాంధ్ర నిర్మాతగా నిలిట్టేందుకు తెలుగుదేశం అనుకూల మీడియా చాలా కాలంగా కృషిచేస్తోంది. కానీ, ఏపీ ప్రజలు మాత్రం మీడియా మాయలో పడకుండా భవిష్యత్‌ నాయకుల జాబితా నుంచి చంద్రబాబును దాదాపు తప్పించినట్లు కనిపిస్తోంది. దాంతో పరిస్థితి అర్థమైన సదరు మీడియా చానెళ్లు సైతం జీవీఎల్‌ వ్యాఖ్యలపై ఎలాంటి చప్పడు చేయకుండా సైలెంట్‌ అయినట్లు తెలుస్తోంది.

పార్టీపై పట్టుపోయిందా...

రోజు రోజుకీ సొంత పార్టీపై పట్టుకోల్పోతుండటాన్ని చూస్తుంటే చంద్రబాబు రాజకీయ జీవితం అవసాన దశకు చేరిందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. వయసు పైబడటంతో చంద్రబాబుకు రాజకీయ భవిష్యత్‌ లేదని...ఇలాంటి సమయంలో ఆయన నాయకత్వంలో పనిచేసి ఉపయోగం ఉండదనే భావనతోనే ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు, నాయకులు వలస బాట పడుతున్నట్లు తెలుస్తోంది. ఏకంగా చంద్రబాబు ఫోన్‌ చేసినా సొంత నియోజకవర్గం కుప్పంలో మండల స్థాయి నాయకులు సైతం మొహం చాటేస్తుండమే దీనికి నిదర్శనం. దీంతో సహజసిద్ధంగా వచ్చే మార్పులను గత చరిత్ర, వైభవాలు ఏమాత్రం ఆపలేవని మరోసారి నిరూపితమైందనిపిస్తోంది.

అక్కరకు రాని వారసత్వం....

రాజకీయాల్లో ఆరితేరిన చంద్రబాబుకు వయసు వెంటబెట్టుకొచ్చే ప్రతికూలతల గురించి తెలియవనుకోవడానికి లేదు. వాటిని గుర్తించే ఏళ్ల కిందటే లోకేశ్‌తో రాజకీయ ప్రవేశం చేయించారాయన. కానీ, ములాయం సింగ్‌కు అఖిలేశ్‌ తరహాలో ఇక్కడ చంద్రబాబుకు లోకేశ్‌ రాజకీయ వారసుడిగా నిలబడలేకపోతున్నారు. మీడియా ద్వారా ఎంత ప్రయత్నించినా లోకేశ్‌ భావినాయకుడిగా గుర్తింపు తెచ్చుకోవడంలో విఫలమవుతున్నారు. దాంతో తానే నవతరానికి నాయకుడిని అంటూ ప్రచారం చేసుకోవాల్సిన దుస్థితి చంద్రబాబుది. కానీ, ప్రజలు ఆయన ప్రయత్నాలను నిర్ద్వందంగా తిరస్కరిస్తున్నారు...ఫలితంగా చంద్రబాబు రాజకీయ జీవితం క్లైమాక్స్‌ అంచుల్లో ఊగిసలాడుతున్నట్లు కనిపిస్తోంది..!

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp