పథకం రాలేదని పరేషాన్‌ అవసరం లేదు.. సీఎం జగన్‌ కీలక నిర్ణయం

By Kotireddy Palukuri Jul. 10, 2020, 08:43 pm IST
పథకం రాలేదని పరేషాన్‌ అవసరం లేదు.. సీఎం జగన్‌ కీలక నిర్ణయం

అర్హత ఉండి, సంబంధిత పత్రాలు సకాలంలో సమీకరించలేక పథకం లబ్ధిని కోల్పోతామన్న పరేషాన్‌ ఇకపై ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు అవసరం లేదు. వివిధ సంక్షేమ పథకాలతో లబ్ధిదారుల ఖాతాకే నేరుగా నగదు జమ చేస్తున్న జగన్‌ సర్కార్‌ ఈ రోజు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రోజు ప్రభుత్వ పథకాల అమలు తీరుపై అధికారులతో చర్చించిన సీఎం జగన్‌ ప్రతి పథకం ప్రవేశపెట్టిన తర్వాత అర్హుత ఉండి దరఖాస్తు చేసుకోలేకపోయినా వారికి మళ్లీ అవకాశం కల్పించేలా 30 రోజుల సమయం ఇవ్వాలని నిర్ణయించారు. ఇప్పటికే పలు పథకాలు ప్రారంభించిన తర్వాత ప్రభుత్వం అర్హులైన వారికి మరో అవకాశం కల్పిస్తోంది. అయితే ఇకపై ఈ విధానాన్ని శాశ్వతంగా అమలు చేయనున్నారు. పథకం అమలు చేసిన తర్వాత కూడా అర్హులైన వారు మిగిలి ఉంటే 30 రోజుల్లో దరఖాస్తు చేసుకుని పథకం లబ్ధిని పొందవచ్చు.

అర్హతే ఆధారంగా ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందిస్తామని ఎన్నికల ముందు చెప్పిన సీఎం జగన్‌.. ఆ మాటను తు.చ తప్పకుండా అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో కొత్త పథకం ప్రవేశపెట్టిన సమయంలో అధికారులకు దిశానిర్ధేశం చేస్తున్నారు. చిన్న చితకా కారణాల వల్ల అర్హులకు ఆయా పథకాలు అందకుండా ఉండకూదని కూడా ఆయన పలు మార్లు స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే సీఎం జగన్‌ తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఎన్నికల మేనిఫెస్టోను బైబిల్, ఖురాన్, భగవద్గీతగా భావిస్తామని, ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని చెప్పిన సీఎం జగన్‌ అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే వివిధ సంక్షేమ పథకాలు అమలు చేశారు. ఎప్పుడు, ఏ పథకం అమలు చేస్తామో షెడ్యూల్‌ కూడా విడుదల చేసి సంచలనం సృష్టించారు. వివిధ వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూరేలా.. రైతు భరోసా, వాహన మిత్ర, వైఎస్సార్‌ నేతన్న హస్తం, వైఎస్సార్‌ లా నేస్తం, జగనన్న అమ్మ ఒడి, జగన్న చేదోడు, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, వైఎస్సార్‌ కాపు నేస్తం తదితర పథకాలను విజయవంతంగా అమలు చేశారు. తాజాగా ఈ నెలలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలలోని 45 నుంచి 60 ఏళ్ల మధ్య ఉన్న మహిళలకు ఏడాదికి 18,750 చొప్పున నాలుగేళ్లలో 75 వేల రూపాయలు ఇచ్చే వైఎస్సార్‌ చేయూత పథకం అమలు చేసేందుకు జగన్‌ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp