శివమొగ్గలో భారీ పేలుడు.. 8 మంది దుర్మరణం

By Rishi K Jan. 22, 2021, 09:50 am IST
శివమొగ్గలో భారీ పేలుడు.. 8 మంది దుర్మరణం

కర్ణాటకలోని శివమొగ్గ ప్రాంతంలో గురువారం రాత్రి 10.30 ప్రాంతంలో భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు. కానీ సంభవించింది భారీ పేలుడని తరువాత అర్థం అయింది. కానీ పేలుడు ద్వారా సంభవించిన షాక్ వేవ్స్ శివమొగ్గ ప్రాంతంలోనే కాకుండా దావణగెరె, చిక్‌మగళూరుకు కూడా వ్యాపించాయి.

పేలుడు ధాటికి శివమొగ్గలోని పలు భవనాల కిటికీలు గోడలు దెబ్బతినగా రోడ్లు బీటలువారాయి. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 8 మంది చనిపోయినట్లు జిల్లా కలెక్టర్ కె.బి.శివకుమార్‌ ​తెలిపారు.
వివరాల్లోకి వెళితే మైనింగ్ బ్లాస్ట్ చేయడానికి వాడే జెలటిన్ స్టిక్స్ లారీలో తరలిస్తూ ఉండగా ప్రమాదవశాత్తు పేలుడు సంభవించిందని ప్రాథమిక నిర్దారణకు వచ్చారు.. ఈ పేలుడులో ట్రక్కులో ప్రయాణిస్తున్న ఆరుగురు బిహార్‌ కార్మికులు మృతిచెందారు. పేలుడు ధాటికి వారి మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా ఛిద్రం అయ్యాయి. శివమొగ్గ నగర శివారులోని హున్సూర్ వద్ద జెలటిన్ స్టిక్స్ ఒక్కసారిగా పేలడంతో చుట్టుపక్కల భూమి కంపించింది. దీంతో భూకంపం సంభవించిందనుకుని ప్రజలు ఇళ్లనుండి బయటకు పరుగులు తీశారు.

ఈ పేలుడులో ట్రక్కు నుజ్జు నుజ్జు కాగా అనేక ఇళ్ళ గోడలు,కిటికీలు ధ్వంసం అయ్యాయి. రోడ్లు బీటలు వారడం ప్రమాద తీవ్రతను తెలియజేస్తుంది. పేలుడు గురించి తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.కాగా శివమొగ్గలో సంభవించిన ప్రమాదాన్ని గురించి తెలుసుకున్న ప్రధాని మోడీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేశారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp