ఎన్నాళకెన్నాళ్లకు.. కాంగ్రెస్ కు పూర్వవైభవం

By Kotireddy Palukuri Sep. 22, 2020, 05:03 pm IST
ఎన్నాళకెన్నాళ్లకు.. కాంగ్రెస్ కు పూర్వవైభవం

ఏ వార్తకు ఎంత ప్రయారిటీ ఇవ్వాలి, ఎంత మేర ప్రచురించాలి.. అనే అంశంపై అన్ని పత్రికలు ఒక నిర్ణయానికి వస్తాయి. రాజకీయ నాయకులు హోదాలు, ఆయా సంఘటనలకు ఉన్న ప్రాథాన్యతను బట్టి వార్తలు ఏ పేజీలో ప్రచురించాలన్నది ఏ రోజుకారోజు నిర్ణయిస్తారు. అయితే వివిధ నాయకుల ప్రకటనలను మాత్రం ఎంత మేర ఇవ్వాలన్నది వారి పార్టీ, అందులో వారి హోదాను బట్టి ఉంటుంది.

కాంగ్రెస్‌ పార్టీని ఏపీ ప్రజలు దాదాపుగా మరచిపోయారని చెప్పవచ్చు. 2014, 2019 ఎన్నికల్లో ఆ పార్టీ కనీసం ఉనికిని కూడా కాపాడుకోలేకపోయింది. ఆ పార్టీ నాయకులు తామూ ఉన్నామంటూ తరచూ మీడియాకు ప్రెస్‌నోట్లు, అప్పుడప్పుడు ప్రెస్‌మీట్లు పెడుతుంటారు. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడుగా రఘువీరారెడ్డి తర్వాత ప్రస్తుతం సాకే శైలజానాథ్‌ పని చేస్తున్నారు. కార్యనిర్వాహక అధ్యక్షుడుగా తులసి రెడ్డి ఉన్నారు. సాకే శైలజానాథ్, తులసిరెడ్డిలు తరచూ నిర్వహించే ప్రెస్‌మీట్లు, విడుదల చేసే పత్రికా ప్రకటనలను.. ఈనాడు సహా మిగతా అన్ని పత్రికలు సింగిల్‌ కాలమ్‌లో ప్రచురించేవి. వారు ఎంతటి ప్రాధాన్యమున్న విషయంపై మాట్లాడినా.. గొంతుచించుకుని గంటసేపు మాట్లాడినా కూడా మరుసటి రోజు ఈనాడులో వార్త సింగిల్‌ కాలమ్‌ కన్నా మించదు.

అయితే దాదాపు ఆరేళ్ల తర్వాత ఈనాడు పత్రికలో కాంగ్రెస్‌ పార్టీ ఏపీ అధ్యక్షుడికి సంబంధించిన వార్తను ఈనాడు మూడు కాలాల్లో ప్రచురించింది. ఇటీవల కాలంలో ఎప్పడూ లేనిది.. ఈనాడు తమకు ఇంత ప్రాథాన్యత ఇవ్వడంపై కాంగ్రెస్‌ పార్టీ నేతలు కూడా ఆశ్చర్యపోతున్నారు. అసలు ఈనాడు మనకు ఎందుకంత ప్రయారిటీ ఇచ్చిందన్న విషయం సీనియర్‌ కాంగీలు సహచరుల వద్ద అసలు విషయం చెప్పేస్తున్నారు.


హైకోర్టు సూచన మేరకు కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు సాకే రాజధాని అంశంపై అఫిడవిట్‌ దాఖలు చేశారు. అందులో అమరావతియే రాజధానిగా కావాలని, మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు. అమరావతికి మద్ధతుగా అఫిడవిట్‌ దాఖలు చేశాము కాబట్టే.. ఈనాడు పేపర్‌ మనకు మూడు కాలాలు కేటాయించి వార్తను ప్రచురించిందని సీనియర్లు అసలు విషయం బోధిస్తూ ఎక్కువ ఆనందపడిపోవద్దని సూచిస్తున్నారు. రేపు మళ్లీ మన పార్టీ అధ్యక్షుడి ప్రెస్‌మీట్, పత్రికా ప్రకటనను సింగిల్‌ కాలనికే పరిమితం చేస్తారు చూడండంటూ హితబోధ చేస్తున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp