ఆ పత్రికల్లో ఎన్నికల వార్తలేవి?

By Kotireddy Palukuri May. 23, 2020, 09:30 am IST
ఆ పత్రికల్లో ఎన్నికల వార్తలేవి?

మే 23వ తేదీ.. సరిగ్గా ఏడాది కిందట ఇదే రోజు ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. మళ్లీ తమదే విజయం అనుకున్న టీడీపీ, ఆ పార్టీ మద్ధతు మీడియాకు చెప్పపెట్టులాంటి తీర్పు ఈవీఎంల నుంచి వెలువడింది. తమ ఊహకందని ఓటమిని చవిచూడడంతో టీడీపీ నేతలు, ఎల్లో మీడియాగా పిలిచే పత్రికలు, టీవీ ఛానెళ్లు ఖంగుతిన్నాయి. 175 అసెంబ్లీ స్థానాలకు గాను 151 సీట్లతో వైసీపీ జయకేతనం ఎగురవేసింది. 25 ఎంపీ సీట్లకు గాను 22 గెలుచుకుంది. టీడీపీ కేవలం 23 స్థానాలకే పరిమితమై ఘోరపరాభవం చవిచూసింది.

ఏడాది గడవడంతో ఈ ఘోర ఓటమి నుంచి క్షేత్రస్థాయిలోని టీడీపీ శ్రేణులు కొంత తేరుకున్నా.. నేతలు, ముఖ్యంగా టీడీపీ మద్ధతుదారులైనా మీడియా సంస్థలు మాత్రం ఇంకా ఆ ఘోరకలి నుంచి ఇంకా కోలుకోలేనట్లుగా ఈ రోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలను చూస్తే అర్థం అవుతుంది. ఎన్నికల ఫలితాలు వెలువడి నేటికి ఏడాది అవుతున్నా... అసలు అలాంటిది ఏమీ జరగనట్లుగా ఆ రెండు పత్రికలు కనీసం సింగిల్‌ కాలమ్‌ వార్త కూడా ప్రచురించలేదు. ఆ విషయం మనస్సును మెలిపెడుతున్నా.. బయటకు మాత్రం ఏమీ జరగనట్లుగా, అసలు ఆ విషయం గుర్తులేనట్లుగా వ్యవహరించాయి.

Also Read:ఆంధ్ర ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇచ్చినరోజు

సందర్భాలను బట్టీ ప్రత్యేక కథనాలు రాసే ఆ పత్రికలు ఈ రోజు పూర్తిగా మౌనవ్రతం పాటించడం ఇక్కడ విశేషం. ప్రభుత్వం ఏర్పడి ఏడాది, రెండేళ్లు, మూడేళ్లు అయిన సందర్భంగా ఆయా ప్రభుత్వాలు సాధించిన ప్రగతి, అమలు చేసిన ఎన్నికల హామీలు, అమలు చేయని వాగ్థానాలు.. ఇలా అనుకూలంగానో, ప్రతికూలంగానో కథనాలు రాయడం పరిపాటి. ఓ నాయకుడు రాజకీయ రంగ ప్రవేశం చేసి 40 ఏళ్లు అయిందంటూ పుట్టుపూర్వోత్తరాలతో కథనాలు రాసిన చరిత్ర ఆయా పత్రికలకుంది. తాము నూట్రల్‌ అని తరచూ చెప్పుకునే పత్రిక కూడా ఈ విషయంలో తాము ఏ వైపో చెప్పింది. తమకు నచ్చిన వారు పాలకులు కాకపోతే తమ తీరు ఇలానే ఉంటుందని చెప్పకనే చెబుతున్నాయి.

ఇదే సమయంలో నిన్న హైకోర్టు ఇచ్చిన మూడు తీర్పులను మాత్రం రెండు పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి. అవే బ్యానర్‌ అయ్యాయి. ఘోర ఓటమి చవిచూసి ఏడాదైన సందర్భంగా ఆ గాయానికి మందు వేసుకున్నట్లుగా.. మంచి రైమింగ్‌ శీర్షికలతో మొదటిపేజీ బ్యానర్లు తీర్చిదిద్దాయి. ఈనాడు ‘ఎదురు దెబ్బలు’ అని అంటే.. ఆంధ్రజ్యోతి సినిమాటిక్‌ సై్టల్‌లో ‘తీన్‌ మార్‌’ అంటూ పెట్టి.. ఏక్‌.. దోన్‌.. తీన్‌.. అంటూ ట్యాగ్‌లైన్‌ కూడా ఇచ్చి మనస్సును కొంత స్థిమితం చేసుకున్నాయి.

Also Read:సిబిఐ - నాడు వద్దు.. నేడు ముద్దు..

ఈ రోజు గడిస్తే.. మళ్లీ రేపు మామూలు స్థితికి రావచ్చు. మళ్లీ ఈ నెల 30వ తేదీ నుంచి ఎలా తప్పించుకోవాలే ఈ వారం రోజుల్లో తీరిగ్గా ఆలోచించవచ్చు. ఆ రోజు ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన రోజు. అప్పటికి ఏదో ఒకటి రాకపోతుందా..? లేక మనవాళ్లే సృష్టించకపోతారా..? వాటితో నచ్చిన శీర్షికలతో బ్యానర్‌ కథనాలు చేసుకుంటే ఆ విషయం కూడా విజయవంతంగా మరచిపోవచ్చు. వచ్చే ఏడాది నాటికి ఇంత ప్రభావం ఉండదు. పైగా మనస్సుకు అలవాటవుతుంది కాబట్టి పెద్ద ఇబ్బంది ఉండదు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp