కేంద్రం షాక్ : ఆ బ‌డా వ్యాపారుల ఆస్తుల జ‌ప్తు

By Kalyan.S Jun. 24, 2021, 08:20 am IST
కేంద్రం షాక్ :  ఆ బ‌డా వ్యాపారుల ఆస్తుల జ‌ప్తు

భార‌త‌దేశ బ్యాంకుల‌కు వేలాది కోట్ల రూపాయ‌లు ఎగ్గొట్టి విదేశాల్లో చ‌క్క‌ర్లు కొడుతున్న వ్యాపారవేత్తలు విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలకు కేంద్ర ప్ర‌భుత్వం గ‌ట్టి షాక్ ఇచ్చింది. బ్యాంకుల‌ను మోస‌గించిన కేసులో ఈ ముగ్గురికి చెందిన సుమారు రూ.18170.02 కోట్ల ఆస్తులను సీజ్ చేస్తున్నట్టు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సంచలన ప్రకటన చేసింది. ఇందులో సుమారు రూ.9371 కోట్ల ఆస్తులను ఆయా బ్యాంకులకు బదిలీ చేసింది.మిగిలినవి కేంద్రప్రభుత్వానికి బదిలీ చేసినట్లు ఈడీ తెలిపింది. వాటిని వేలం వేసి ఆ అప్పులను బ్యాంకులు రాబట్టుకోవచ్చు. విదేశాల్లో ఉన్న రూ.969 కోట్ల ఆస్తులు కూడా ఈ జప్తు చేసిన వాటిల్లో ఉండడం విశేషం.

ఈ ముగ్గురు ఆర్థిక నేరగాళ్ల వల్ల బ్యాంకులకు జరిగిన నష్టం అంతా ఇంతాకాదు.. ఈ నష్టాన్ని భర్తీ చేయడానికి వారి ఆస్తులు అటాచ్ చేసి సీజ్ చేసిన మొత్తం విలువ 80.45 శాతంగా ఉన్నట్టు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ తెలిపింది. దేశంలో పారిశ్రామికవేత్తలుగా వెలుగు వెలిగిన విజయ్ మాల్యా నీరవ్ మోడీ మెహుల్ చోక్సీ అనేక ప్రభుత్వ రంగ బ్యాంకులను మోసం చేసినట్లు కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. వీరు తాము ఏర్పాటు చేసిన కంపెనీల ద్వారా నిధులు దుర్వినియోగం చేశారనే ఆరోపణలున్నాయి. వీరు చేసిన మోసాల కారణంగా బ్యాంకులకు ఏకంగా రూ.22585.83 కోట్లు నష్టం వాటిల్లింది.

సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసింది. బ్యాంకులు ఇచ్చిన నిధులను తమ కంపెనీల ద్వారా వీరు రోటేషన్ దారి మళ్లింపులకు పాల్పడినట్లు ఎఫ్ఐఆర్ లు పేర్కొంటున్నాయి. నీరవ్ మోదీ మెహుల్ చోక్సీ విజయ్ మాల్యాలు ముగ్గురు ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు. వారిని భారత్ కు రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం దర్యాప్తు పూర్తికాగానే ఈ ముగ్గురినీ మన దేశానికి రప్పించడానికి బ్రిటన్ ఆంటిగ్వా బార్బుడాలకు విజ్ఞప్తి చేసినట్లు పేర్కొంది. భారత దేశానికి అప్పగించడానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో అప్పీలు చేయడానికి మల్యాకు బ్రిటన్ లో అనుమతి లభించలేదు.

ఇదిలా ఉండ‌గా, బ్యాంకులను మోసగించిన కేసులో నిందితుడు నీరవ్ మోదీకి బ్రిటన్ హైకోర్టులో చుక్కెదురైంది. ఆయనను భారత దేశానికి అప్పగించేందుకు జారీ అయిన ఆదేశాలపై అపీలు చేసేందుకు హైకోర్టు అనుమతి ఇవ్వలేదు. పంజాబ్ నేషనల్ బ్యాంకును రూ.13,500 కోట్ల మేరకు మోసగించినట్లు, బూటకపు కంపెనీల ద్వారా మనీలాండరింగ్ నేరాలకు పాల్పడినట్లు ఆయనపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే. నీరవ్ మోదీతోపాటు ఆయన సహచరులు పంజాబ్ నేషనల్ బ్యాంకు అధికారులతో కుమ్మక్కై సుమారు 1.4 బిలియన్ డాలర్ల మేరకు ఆ బ్యాంకును మోసగించినట్లు భారత ప్రభుత్వం ఆరోపించింది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp