అహ్మద్‌ పటేల్‌ను ప్రశ్నించిన ఈడీ: 27 గంటల పాటు ప్రశ్నల వర్షం

By Jagadish J Rao Jul. 09, 2020, 04:02 pm IST
అహ్మద్‌ పటేల్‌ను ప్రశ్నించిన ఈడీ: 27 గంటల పాటు ప్రశ్నల వర్షం

మనీల్యాండరింగ్‌ కేసు, సందేశార సోదరుల బ్యాంకు స్కామ్‌లకు సంబంధించి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, సోనియా గాంధీ రాజకీయ కార్యదర్శి అహ్మద్‌ పటేల్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు గురువారం నాలుగోసారి ప్రశ్నించారు. ఢిల్లీలోని ఆయన నివాసంలో ముగ్గురు సభ్యులతో కూడిన ఈడీ అధికారుల బృందం అహ్మద్‌ పటేల్‌ను విచారించింది.

ఈ కేసుకు సంబంధించి ఆయనను చివరిసారిగా ఈడీ ఈనెల 2న పదిగంటల పాటు ప్రశ్నించింది. ఈడీ అధికారులు మూడు సెషన్స్‌లో తనను 128 ప్రశ్నలు అడిగారని అంతకుముందు అహ్మద్‌ పటేల్‌ చెప్పారు. ఇది రాజకీయ వేధింపు చర్యేనని, ఎవరి ఒత్తిళ్లపై వారు (దర్యాప్తు అధికారులు) పనిచేస్తున్నారో తనకు అర్ధం కావడం లేదని అన్నారు.

కాగా జూన్‌ 27, జూన్‌ 30, జులై 2న మూడుసార్లు అహ్మద్‌ పటేల్‌ను విచారించిన ఈడీ అధికారులు ఇప్పటివరకూ 27 గంటల పాటు ప్రశ్నించారు.మనీల్యాండరింగ్‌ నిరోధక చట్టం కింద అహ్మద్‌ పటేల్‌ ప్రకటనను ఈడీ అధికారులు రికార్డు చేశారు.

కాగా, వడోదరకు చెందిన ఫార్మా కంపెనీ స్టెర్లింగ్‌ బయోటెక్‌ ప్రమోటర్లు నితిన్‌ సందేశార, చేతన్‌ సందేశార, దీప్తి సందేశర బ్యాంకు నుంచి రూ.14,500 కోట్ల రుణం తీసుకొని తిరిగి చెల్లించకుండా చేతులెత్తేశారు. వారంతా పరారయ్యారు.

ఈ వ్యవహారంతో అహ్మద్‌ పటేల్‌కు సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై ఈడీ అధికారులు మరోసారి అహ్మద్‌ పటేల్‌ను ప్రశ్నించారు. స్టెర్లింగ్‌ బయోటెక్‌ ప్రమోటర్లతో ఉన్న ఆయనకున్న సంబంధాలపై ఈడీ అధికారులు ఆరా తీశారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp