Huzurabad By Elections - టీర్ఎస్ వ‌ర్సెస్ బీజేపీ : ద‌ళిత “బంద్” పై కొత్త ర‌గ‌డ‌

By Kalyan.S Oct. 19, 2021, 06:00 pm IST
Huzurabad By Elections - టీర్ఎస్ వ‌ర్సెస్ బీజేపీ : ద‌ళిత “బంద్” పై కొత్త ర‌గ‌డ‌

తెలంగాణ రాజ‌కీయాలు ఇప్పుడు ద‌ళిత బంధు చుట్టూ తిరుగుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ ప‌థ‌కం ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుంచీ విప‌క్షాలు కొత్త కొత్త డిమాండ్ ల‌ను లేవ‌నెత్తుతున్నాయి. మైనార్టీ బంధు, క్రిస్టియ‌న్ బంధు, చేనేత బంధు.. ఇలా ర‌క‌ర‌కాల ప‌థ‌కాల‌ను తెర‌పైకి తెస్తూ ప్ర‌భుత్వాన్ని ఇరుకున‌పెట్టే ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉన్నారు. మ‌రోవైపు కేసీఆర్ మాత్రం వారి వ్యూహాల‌కు ప్ర‌తివ్యూహాల‌ను ప‌న్నుతూ ద‌ళిత బంధును మ‌రికొన్ని ప్రాంతాల‌కు విస్త‌రిస్తూ వెళ్తున్నారు. తాజాగా ఆ ప‌థ‌కంపై స‌మీక్ష జ‌రుపుతూ.. కీల‌క మార్పులు కూడా చేశారు. ఇదిలా ఉండ‌గా తాజాగా ఈసీ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. హుజూరాబాద్ ఉప‌ ఎన్నిక నేప‌థ్యంలో ద‌ళిత బంధును నిలిపివేయాల‌ని ఆదేశాలు జారీ చేసింది. ఈ ప‌థ‌కాన్ని అడ్డుపెట్టుకుని ఉప ఎన్నిక‌లో బంప‌ర్ మెజార్టీతో గెల‌వాల‌ని ప్ర‌భుత్వం వ్యూహ‌ర‌చ‌న చేస్తే ఈసీ తాజా నిర్ణ‌యం సంక‌టంగా మారింది. టీఆర్ఎస్, బీజేపీ ఇప్పుడు ఒక‌రిపై మ‌రొక‌రు బుర‌ద జ‌ల్లుకుంటున్నాయి. ఈ ప‌థ‌కం నిలిచిపోవ‌డానికి మీరు కార‌ణ‌మంటే.. మీరు కార‌ణ‌మంటూ ఆరోప‌ణ‌లు, స‌వాళ్లు చేసుకుంటున్నాయి.

దళిత బంధుపై బీజేపీ నేత‌లు లేఖ‌లు రాయ‌డం వ‌ల్లే ఈసీ అలా ఉత్త‌ర్వులు జారీ చేసిందంటూ టీఆర్ఎస్ నేత‌లు ఆరోపిస్తున్నారు. తాము ఈ ప‌థ‌కం ద్వారా ల‌బ్ది చేకూర్చాల‌ని ప్ర‌య‌త్నిస్తే.. బీజేపీ అడ్డుప‌డుతోంద‌ని అంటున్నారు. నిధులు కూడా విడుద‌ల చేసి త్వ‌ర‌లోనే ల‌బ్దిదారుల ఖాతాల్లో జ‌మ చేయాల‌ని తాము ప్ర‌య‌త్నం చేస్తుంటే విప‌క్షాలు అక్క‌సుతో అడ్డుకుంటున్నాయ‌ని అంటున్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ రైతు బంధు పథకాన్ని ఈసీ నిలిపివేసిన నేపథ్యంలో తెలంగాణ సర్కారుపై మండిపడ్డారు. వరుస ట్వీట్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శలు ఎక్కుపెట్టారు. “సీఎం కేసీఆర్ వైఫల్యం వల్లే “దళిత బంధు” పథకాన్ని నిలిపివేస్తూ ఈసీ ఆదేశాలిచ్చింది. దళితులను మరోసారి మోసం చేసినందుకు నైతిక బాధ్యత వహిస్తూ కేసీఆర్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలి. తన కుట్ర బుద్దితోనే దళితబంధు పథకం కింద ఒక్కరికి కూడా నిధులు విడుదల చేయకుండా ఆపారు.” అని సంజయ్ అన్నారు.

Also Read : Huzurabad BJP Etela -హుజూరాబాద్ టు రాష్ట్రం : బీజేపీ ప్లాన్ వ‌ర్క్ అవుట్ అవుతుందా.?

“దేశంలో బ్యాంకులు ఎప్పటికీ లబ్దిదారుల అకౌంట్లో పడిన సొమ్మును ఫ్రీజ్ చేసిన దాఖలాల్లేవు. కానీ, కేసీఆర్ మాత్రం ఉద్దేశపూర్వకంగా దళిత బంధు డబ్బులను లబ్దిదారుల అకౌంట్లో వేస్తూనే….అదే సమయంలో డ్రా చేసుకోకుండా ఫ్రీజ్ చేయించారు. దళితబంధు ప్రకటించినప్పుడు బేషరతుగా దళితులు ఆ నిధులను వాడుకుని ఉపాధి పొందవచ్చని చెప్పిన కేసీఆర్….ఆ తర్వాత మాట మార్చి షరతులు విధించారు. బ్యాంకులో పడిన నిధులను లబ్దిదారులు డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించాల్సిందే.” అని బండి అన్నారు. “కేసీఆర్ ఏదొక రకంగా ‘దళిత బంధు’ పథకాన్ని నిలిపివేయించి ఇతరులపై ఈ నెపాన్ని నెట్టాలని కుట్ర చేశారు. ఎన్నికల కమిషన్ నుండి ఆదేశాలు రాబోతున్నాయని ముందే తెలిసి, దళిత బంధుపై సమీక్ష నిర్వహించి చిలుక పలుకులు పలికారు. ఇప్పటిదాకా ఒక్క దళిత లబ్దిదారుడికి కూడా ఆ నిధులను వాడుకునే అవకాశం లేకుండా చేసినప్పటికీ…మరో రూ.250 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించి దళితుల పట్ల కేసీఆర్ మరో డ్రామాకు తెరలేపారు.” అని సంజయ్ ఆరోపణలు గుప్పించారు.

హుజూరాబాద్ బీజేపీ అభ్య‌ర్థి ఈటెల రాజేంద‌ర్ తాము లేఖ రాసినట్లు నిరూపిస్తే.. అంటూ టీఆర్‌ఎస్‌ నేతలకు సరికొత్త సీరియస్ సవాల్ విసిరారు హుజురాబాద్ బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్. దళిత బంధు ఆపాలంటూ తాము లేఖ రాసినట్లు నిరూపించాలని టీఆర్‌ఎస్‌ నేతలను ఆయన డిమాండ్ చేశారు. పోచమ్మ ఆలయం దగ్గర కానీ, అంబేద్కర్‌ విగ్రహం దగ్గర కానీ చర్చకు సిద్ధమా అని మరో సవాల్‌ విసిరారు. టీఆర్‌ఎస్‌ నేతలు చేస్తున్న విమర్శలకు ఈటెల ఇవాళ స్ట్రాంగ్ రియాక్షన్‌ ఇచ్చారు. “దళిత బంధు ఆపాలని ఈసికి లేఖ రాయలేదు. హుజురాబాద్ అంబేడ్కర్ చౌరస్తా కు రండి.. చర్చిద్దాం.. నా సవాలు ను టీఆర్ఎస్ నేతలు స్వీకరిస్తారా.. గతంలో నే టిఆర్ఎస్ నేతలు ఫేక్ లేటర్లు సృష్టించారు. ఇప్పటికైనా అందరికీ దళిత బంధు ఇవ్వాలి. టీఆర్ఎస్ కు ఓటమి ఖాయం.” అంటూ జోస్యం చెప్పారు ఈటెల.

Also Read : Telangana 2023 Elections -తెలంగాణ‌లో ‘ముందస్తు’ యుద్ధం..!

బీజేపీ నేత‌ల వ్యాఖ్య‌లు, స‌వాళ్ల‌పై మంత్రి కేటీఆర్ స్పందించారు. తెలంగాణలో దళిత బంధును ఎవరూ ఆపలేరన్నారు మంత్రి కేటీఆర్. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక పది రోజుల్లో ముగుస్తుందని, ఆ తర్వాత పథకం కంటిన్యూ అవుతుందని చెప్పారు. విప‌క్షాలు ఉద్దేశ‌పూర్వ‌కంగానే ద‌ళితుల‌కు మేలు క‌ల‌గ‌కుండా అడ్డుప‌డుతున్నాయ‌ని ఆరోపించారు. ఇలా ఈసీ ద‌ళిత బంధు నిలిపివేయ‌డంపై అధికార‌, విపక్షాలు ఒక‌దానిపై మ‌రొక‌టి విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌ల‌తో రాజ‌కీయాల‌ను వేడెక్కిస్తున్నాయి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp