ఆప‌రేష‌న్ ఆక్సిజ‌న్ : జ‌గ‌న్ సెన్సేష‌న్ డెసిష‌న్‌..!

By Kalyan.S May. 12, 2021, 10:21 am IST
ఆప‌రేష‌న్ ఆక్సిజ‌న్ : జ‌గ‌న్ సెన్సేష‌న్ డెసిష‌న్‌..!

తిరుపతిలోని ప్రఖ్యాత రామ్ నారాయణ్ రుయా ఆస్ప‌త్రిలో ఆక్సిజన్ అందక ఒకేరోజు 11 మంది మరణించ‌డంపై ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి తీవ్ర విచారం వ్య‌క్తం చేశారు. ప్ర‌జ‌ల ప్రాణాల‌ను కాపాడుకునేందుకు ఎంత ప‌క‌డ్బందీగా చ‌ర్య‌లు చేప‌డుతున్నా, తీవ్రంగా శ్ర‌మిస్తున్నా కొన్ని చోట్ల చేయి దాటిపోవ‌డం క‌లిచివేస్తోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కొవిడ్‌తో కలిసి జీవించాల్సిన పరిస్థితుల్లో ముందుకు సాగుతూనే, పెద్ద‌గా న‌ష్టం వాటిల్ల‌కుండా జ‌గ‌న్ స‌ర్కార్ ప్ర‌ణాళిక బ‌ద్ధ‌మైన చ‌ర్య‌లు చేప‌డుతోంది. అయిన‌ప్ప‌టికీ అక్క‌డ‌క్క‌డ బాధాకరమైన ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.

సోమ‌వారం రుయా ఆస్పత్రిలో జరిగిన ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారాన్ని ప్ర‌క‌టించిన జ‌గ‌న్ వారికి ఆర్థిక భ‌రోసా క‌ల్పించారు. అటువంటి ఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. రాష్ట్రంలోని అన్ని ఆస్ప‌త్రుల్లో ఉండే ఆక్సిజన్ ప్లాంట్ల నిర్వహణ బాధ్యతను తూర్పు నౌకాదళం అధికారులకు అప్పగించారు.

క‌రోనా మ‌ర‌ణాల్లో బాధితులు చివ‌రి వ‌ర‌కూ స‌రైన చికిత్స పొంద‌డంలో జాప్యం చేయ‌డం ఓ కార‌ణ‌మైతే, చికిత్స పొందుతున్న వారిలో ఆక్సిజ‌న్ అంద‌క చ‌నిపోతున్న వారు ఉన్నారు. ఈ ప‌రిస్థితిని గుర్తించిన ప్ర‌భుత్వం త‌గినంత ఆక్సిజ‌న్ ను త‌గిన స‌మ‌యంలో తీసుకొచ్చేందుకు ప‌క్కా ఏర్పాట్లు చేసింది. రెండు రోజుల క్రితం కూడా ఆరు ట్యాంకర్లను గన్నవరం ఎయిర్‌ పోర్టు నుంచి ఒడిశాకు విమానంలో పంపింది. రవాణా సమయాన్ని ఆదా చేసేందుకు ఎయిర్‌ లిఫ్ట్ చేసింది. అక్కడ నింపి... రోడ్డు మార్గంలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. విదేశాల్లో నుంచి కూడా ఆక్సిజన్‌ కొనుగోలు చేసి షిప్స్‌ ద్వారా తెప్పిస్తోంది. ఆక్సిజ‌న్ కొర‌త రాకుండా చూసుకునేందుకు తీవ్ర స్థాయిలో విభిన్న ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తోంది. రుయా ఘ‌ట‌న జ‌రిగిన వెంట‌నే సీఎం జ‌గ‌న్ అందుకు గ‌ల కార‌ణాల‌ను ఆరా తీస్తే, తమిళనాడు నుంచి రావాల్సిన ఆక్సిజన్‌ ట్యాంకర్‌ సరైన సమయానికి రాలేకపోయినందున, ఆక్సిజన్‌ కొరత ఏర్పడిందని, అందువ‌ల్ల 11 మంది చనిపోయారని అధికారులు చెప్పారు. దీనిపై ఆయ‌న స్పందిస్తూ ఆక్సిజన్‌ కొరత రాకుండా ఇన్నిరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నా కొన్ని కొన్ని మన చేతుల్లో లేకపోవడం వల్ల నష్టాలు జ‌రుగుతున్నాయ‌ని భావించారు.

రుయా ఘ‌ట‌న‌కు సంబంధించి బాధిత కుటుంబాల‌ను ఆర్థికంగా ఆదుకోవ‌డ‌మే కాదు, ఆక్సిజ‌న్ ఇబ్బందుల‌ను అరిక‌ట్టేందుకు మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు జ‌గ‌న్. రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రుల్లో ఉండే ఆక్సిజన్ ప్లాంట్ల నిర్వహణ బాధ్యతను తూర్పు నౌకాదళం అధికారుల చేతికి అప్పగించారు. విశాఖపట్నం ప్రధాన కేంద్రంగా పనిచేస్తోన్న ఈస్టర్న్ నావల్ కమాండ్ అధికారులు ఇక మీదట ఆస్ప‌త్రుల్లో ఉండే ఆక్సిజన్ ప్లాంట్ల నిర్వహణను చూసుకుంటారు. సీఎం జగన్ ఈ మేరకు వైజాగ్ ఈస్టర్న్ నావల్ కమాండ్ అధికారులకు విజ్ఞప్తి చేసిన కొద్దిసేపటికే అక్కడి నుంచి ప్రత్యేక అధికారుల బృందం తిరుపతికి బయలుదేరింది. రూయా ఆసుపత్రిని సందర్శించింది. ఈ బృందంలో ఆరుమంది అధికారులు ఉన్నారు. రూయా ఆసుపత్రి సూపరింటెండెంట్ రెసిడెంట్ డాక్టర్ ను కలిశారు.

సోమవారం రాత్రి చోటుచేసుకున్న ఘటనకు సంబంధించిన నౌకాదళం అధికారులు పూర్తి వివరాలను వైద్యుల‌ను అడిగి తెలుసుకున్నారు. దీనితో పాటు రుయా ఆస్ప‌త్రి ప్రాంగణంలోనే మరో ఆక్సిజన్ ప్లాంట్ను నిర్మించబోతున్నట్లు తెలిపారు. అనంతరం వారు ఆక్సిజన్ ప్లాంట్ లో కాసేపు తిరిగి మొత్తం పరీక్షించారు. కరోనా వైరస్ పాజిటివ్ కేసుల ఒత్తిడి ఆసుపత్రులపై తీవ్రమైందని అందుకే ఆక్సిజన్ ప్లాంట్ల నిర్వహణపై ఉద్యోగులు సిబ్బంది దృష్టి సారించట్లేదనే నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. దీనితోనే వాటి నిర్వహణ పర్యవేక్షణ బాధ్యతలను నౌకాదళాధికారులకు అప్పగించినట్లు తెలుస్తోంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp