దుబ్బాక ఎన్నికలు ఆ పార్టీలకు పరిక్షేనా..?

By Voleti Divakar Oct. 28, 2020, 12:31 pm IST
దుబ్బాక ఎన్నికలు ఆ పార్టీలకు పరిక్షేనా..?

రానున్న గ్రేటర్ హైదరాబాద్ నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో చూస్తే దుబ్బాక ఉప ఎన్నికలు టిఆర్ఎస్ పాలనకు ఒక విధంగా క్వార్టర్లీ పరీక్ష లాంటిదే. అలాగే తెలంగాణా బిజెపి అధ్యక్షుడిగా నియమితులైన బండి సంజయ్ పనితీరుకు కూడా ఈ ఎన్నికలు అద్దంపట్టేవిగా భావిస్తున్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ తనమేనల్లుడు, రాష్ట్ర మంత్రి హరీష్ రావుకు దుబ్బాక పరీక్ష పెట్టారు. ప్రతిష్టాత్మకమైన ఈ ఉప ఎన్నికల్లో ప్రచార, ఇతరత్రా బాధ్యతలను కెసిఆర్ హరీష్ రావుకు అప్పగించడమే ఇందుకు నిదర్శనం. హరీష్ రావే మొదటి నుంచి కాలికి బలపం కట్టుకుని మరీ నియోజకవర్గంలో ప్రచారం సాగిస్తున్నారు.

దుబ్బాక ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ కనీసం ప్రచారం కూడా చేయకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. ఆయన కుమారుడు, కెటిఆర్ కూడా దుబ్బాక వైపు పెద్దగా దృష్టిసారించకపోవడం గమనార్హం. ఈ ఎన్నికల్లో తమదే విజయమని వారు అతి విశ్వాసంతో ఉన్నారా అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ పరీక్షలో టిఆర్ఎస్ భారీ మెజార్టీతో నెగ్గితే తరువాత వచ్చే ఎన్నికలు ఆపార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని నింపుతాయి. ఈ ఫలితాలు టిఆర్ఎస్ భవిష్యత్ రాజకీయాలకు అద్దం పట్టే అవకాశాలు ఉన్నాయి.

నవంబర్ 3న జరిగే ఈ ఉప ఎన్నికల్లో దివంగత సిట్టింగ్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి సతీమణి సుజాత టిఆర్ఎస్ అభ్యర్థిగా, ఒకప్పుడు టిఆర్ఎస్లో పనిచేసి, ప్రస్తుతం బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధిగా కొనసాగుతున్న ఎం రఘునందనరావు బిజెపి అభ్యర్థిగా, మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి కుమారుడు శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. గతంలో రఘునందనరావు రెండుసార్లు ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. దుబ్బాక ఎన్నికల సందర్భంగా బిజెపి అభ్యర్థి రఘునందనరావు మామ ఇంట్లో సోదాలు నిర్వహించడం, ఈ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితుల మధ్య తెలంగాణా బిజెపి అధ్యక్షుడు బండి సంజయను అరెస్టు చేయడం వంటి పరిణామాలు ఆపార్టీకి కాస్త కలిసి వచ్చే అంశాలుగా కనిపిస్తున్నాయి. గతంలో రెండుసార్లు ఓడిపోవడం కూడా రఘునందరావుపై సానుభూతి ఏర్పడేందుకు దోహపడే అంశం.

ఈ పరిణామాలు అధికార టిఆర్ఎస్కు కాస్త చిరాకే. ఈనేపథ్యంలో ఇక్కడ పోటీ టిఆర్ఎస్-బిజెపికి మధ్యేనన్న ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డి లౌకికవాద ఓట్లు చీలిస్తే బిజెపికి కలిసి వస్తుంది. ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధిస్తే హరీష్ రావుకు మళ్లీ మంచి రోజులు వచ్చినట్టే. ఇది ఒక విధంగా కెటిఆర్ కు రాజకీయ భవిష్యత్ పై కూడా ప్రభావం చూపిస్తుంది. లేనిపక్షంలో హరీష్ రావు గతంలోలా పక్కకు తప్పుకోవాల్సి రావచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో దుబ్బాక పరీక్షను హరీష్ రావు ఎలా నెగ్గుకు వస్తారన్నది ఆసక్తి కలిగిస్తోంది. అలాగే బండి సంజయ్ రాజకీయ చాతుర్యం కూడా ఇక్కడి ఫలితాలు తేల్చేసే అవకాశాలు ఉన్నాయి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp