దళితబంధు అమలు సాధ్యమేనా..

By Suresh Jul. 31, 2021, 10:00 am IST
దళితబంధు అమలు సాధ్యమేనా..

కెసిఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపడుతోంది. రాష్ట్ర ఖజానపై ఆర్థిక భారం పడుతున్నా సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తోంది.రైతు బంధు,పింఛన్లు,కల్యాణ లక్ష్మీ ఆసరా పింఛన్లు ఇలా చాలా రకాల సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలకు ప్రభుత్వం చేయూత నిచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. అయితే సమాజంలో వివక్షకు గురవుతున్న దళితుల అభివృద్ధి కోసం ప్రభుత్వం కొత్తగా దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చింది.

సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన దళితుల కోసం ఈ పథకం ద్వారా అర్హులైన కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని నేరుగా అందించాలని భావిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని భావిస్తున్న సర్కార్ తొలివిడతగా ఈ పథకం కింద 1200 కోట్లు ఖర్చు చేయాలని భావించింది.దీనికి సంబంధించి జీవో 6ను విడుదల చేసింది. సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా రాష్ట్రంలోని అర్హులైన దళితుల అందరికీ దళిత బంధు పథకం అమలు చేస్తామoటున్న ప్రభుత్వం రాష్ట్రంలోని మొత్తం 119 నియోజకవర్గాలలో ఒక్కో నియోజకవర్గాన్ని యూనిట్ గా తీసుకొని ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మొదటి దశలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 100 కుటుంబాల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 11,900 కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తారు.

అయితే ఈ పథకం అమలులో ఎదురయ్యే సమస్యలను అధిగమించేందుకు ఒక నియోజకవర్గాన్ని పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టాలని భావిస్తోంది. ఇందుకోసం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎన్నుకుంది.
హుజురాబాద్ నియోజకవర్గంలోని 20,929 దళిత కుటుంబాల స్థితిగతులను, వారి జీవన ప్రమాణాలను లెక్కగట్టి దళిత బందు పథకానికి అర్హులైన దళితులను గుర్తించాలని కేసీఆర్ సర్కార్ అధికారులను ఆదేశించారు. నియోజకవర్గంలో దాదాపు ఇరవై ఒక్క వేల కుటుంబాల డేటా సేకరణ పనిలో పడింది ప్రభుత్వ యంత్రాంగం. సీఎంవో ఇచ్చిన లెక్కల ప్రకారం హుజూరాబాద్ మండలంలో 5,323 దళిత కుటుంబాలు, కమలాపూర్ మండలంలో 4,346, వీణవంకలో 3,678 , జమ్మికుంటలో 4,996 , ఇల్లందకుంట మండలంలో 2,586 కుటుంబాల చొప్పున మొత్తంగా హుజూరాబాద్ నియోజకవర్గంలో 20,929 దళిత కుటుంబాలున్నాయి. ఈ కుటుంబాల్లో ప్రభుత్వ ఉద్యోగులు, ఇతర అనర్హులను తీసేసి మిగిలిన వారికి దళిత బంధు అమలు చేస్తమని తెలిపారు.ఈ నియోజకవర్గంలో 15 వందల నుంచి 2 వేల కోట్ల వరకు అవసరం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది ఆగస్టులో హుజురాబాద్లో దళిత బందు అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ...
ముందుగా దళిత కుటుంబాల ప్రొఫైల్ రూపొందించి తరువాత వారి జీవన స్థితిగతులపై రిపోర్ట్ తయారు చేస్తారు. తర్వాత లబ్ధిదారుల ఎంపికకు మార్గదర్శకాలు రూపొందిస్తారు. ఈ పథకం కింద ఎంపికైనా లబ్దిదారుల జాబితా విడుదల చేసి అర్హులకు నేరుగా బ్యాంక్ అకౌంట్లో10లక్షలు వేస్తారు.

10లక్షలు వేయడంతోనే వదిలి వేయకుండా పథకం అమలును ప్రభుత్వం పర్యవేక్షించనుంది. పథకం అమలు ద్వారా వచ్చే ఫలితాలను అంచనా వేయనుంది. ఈ పథకం ద్వారా లబ్ది పొందే వారికి ఆపదలో అదుకునేలా రక్షణ నిధిని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది.తద్వారా అంతిమంగా దళిత సాధికారత సాధ్యం అయ్యేలా ప్రభుత్వం భావిస్తోంది.

హుజరాబాద్ లో అమలు చేయబోయే దళిత బంధు పథకం దేశవ్యాప్తంగా ఆదర్శం కాబోతోందని కెసిఆర్,మంత్రులు ఆశాభావం వ్యక్తం చేశారు. మన రాష్ట్రంలోనే కాకుండా దేశంలో దళిత కుటుంబాలు సామాజికంగా, ఆర్థికంగా ఇంకా వెనుకబడి ఉన్నాయని వారిని ఆర్థికంగా బలోపేతం చేయడం కోసమే ఈ పథకం తీసుకొచ్చామని కెసిఆర్ ప్రభుత్వం తెలిపింది. ఈ పథకం ద్వారా అర్హులైన లబ్ధిదారులకు రైతు బంధు పథకం లాగా నేరుగా అర్హుల బ్యాంక్ అకౌంట్ లో 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం వేయనున్నారు.

అయితే రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం దాదాపు 18 లక్షల దళిత కుటుంబాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పథకం అమలు చేయడానికి 18 లక్షల దళిత కుటుంబాలలో అర్హులైన దళిత కుటుంబాలు 10 నుంచి 12 లక్షల మంది ఉన్న వీరికి సహాయం అందించాలి అంటే దాదాపు లక్షా ఇరవై కోట్లు అవసరం అవుతాయి. అసలే ఆర్థిక భారంతో నడుస్తున్న తెలంగాణ ప్రభుత్వం దళిత బంధు పథకం కోసం లక్షా 20 వేల కోట్లు ఖర్చు చేస్తుందా.

దళిత బంధు పై దళిత సంఘాల వాదన...
ప్రభుత్వం తీసుకొచ్చిన దళిత బంద్ పై దళిత సంఘాలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి. హుజురాబాద్ ఎన్నికల్లో గెలుపు కోసమే దళిత బంధును తెరమీదకు తీసుకు వచ్చింది కానీ దళితుల మీద ప్రేమతో కాదని దళిత సంఘాలు ఆరోపిస్తున్నాయి. కెసిఆర్ ఎన్నికల వేళ హామీలు చేయడం ఎన్నికల తర్వాత ఆ హామీలు మర్చిపోవడం సహజమేనని కాబట్టి కేసీఆర్ తీసుకొచ్చిన దళిత తాము నమ్మడం లేదని స్పష్టం చేస్తున్నాయి. ఎందుకంటే గతంలో దళితులకు 3 ఎకరాల భూమి, దళిత సీఎం లాంటి హామీల విషయంలో కేసీఆర్ ప్రభుత్వం మాట నిలబెట్టుకోలేదని దళిత సంఘాలు, ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. దళితుల విషయంలో కేసీఆర్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆగస్టు 1 నుంచి 15వ తేదీ లోపు హుజూరాబాద్ నియోజకవర్గం లో ఉన్న దళిత కుటుంబాలకు దళితబంధు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆగస్టు 15 తరువాత రాష్ట్రంలో ఉన్న అన్ని దళిత కుటుంబాలకు దళిత బందు పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి సంవత్సరం బడ్జెట్లో 25 వేల కోట్లు దళితుల కోసం కేటాయించాలని కోరారు.

దళిత బంధుపై విపక్షాల విమర్శలు...
కేసీఆర్ దళిత బంధు హామీపై విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి.దళిత బంధు పేరుతో మరోసారి దళితులను మోసం చేయాలని కేసీఆర్ చూస్తున్నాడని హెచ్చరిస్తున్నారు.దళిత బంధు పేరుతో నియోజకవర్గంలో ఉన్న దాదాపు 46 వేల ఓట్ల కోసమే ఈ పథకం అని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఉప ఎన్నికల సందర్భంగా కేసీఆర్ అనేక హామీలు ఇస్తారని తరువాత వాటి ఊసే ఉండదని ఎద్దేవా చేస్తున్నారు. హుజురాబాద్ ఎన్నికల కోసమే దళిత బంధు పథకం డ్రామాను తెరపైకి తీసుకొచ్చారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

నాగార్జునసాగర్, హుజూర్ నగర్ ఉప ఎన్నికల సందర్భంగా టిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ముందుగా నిలబెట్టుకోవాలని ఆ తర్వాత పథకాన్ని అమలు చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. హుజూరాబాద్ నియోజకవర్గం లో ఈటెల రాజేందర్ ను ఓడించడానికి ప్రభుత్వ ధనాన్ని ఓటర్లకు పంచుతున్నారని ఈ కార్యక్రమాన్ని నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది ఫోర్ ఫర్ గుడ్ గవర్నెన్స్.

ప్రతిపక్షాలు, దళిత సంఘాలు ఎన్ని ఆరోపణలు చేసిన సమాజంలో ఇంకా వివక్షకు గురవుతున్న దళిత కుటుంబాలు కేసీఆర్ ప్రభుత్వం తీసుకువస్తున్న దళిత బంధు ద్వారా లబ్ది పొంది సమాజంలో గౌరమైన స్థితికి రావాలి. అయితే దీనికోసం ప్రభుత్వం ఈ పథకాన్ని చిత్తశుద్ధితో అమలు చేయాలని కోరుతున్నారు

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp