తుని వైసిపి కైవసం .. యనమల కథ కంచికేనా ! ?

By Voleti Divakar Mar. 06, 2021, 07:15 pm IST
తుని వైసిపి కైవసం .. యనమల కథ కంచికేనా ! ?

మహా నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో 2004 లో తుని మున్సిపాలిటీలో ని 30 వార్డులను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఆనాటి నుంచి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ స్పీకర్, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడి ప్రాభవం తగ్గుముఖం పట్టడం ప్రారంభించింది. తుని నియో జకవర్గం యనమల , ఆయన సోదరుడు కృష్ణుడికి పెట్టని కోటగా ఉండేది . మున్సిపాలిటీలో ఓటమి తరువాత నుంచి యనమల ఒక్కసారి కూడా నియోజకవర్గంలో గెలుపు ముఖం చూడలేదు. 2014 ఎన్నికల్లో ఆయన సోదరుడు కృష్ణుడు పోటీ చేసినా ఓటమి తప్పలేదు. మొన్నటికి మొన్న పంచాయితీ ఎన్నికల్లో యనమల సొంత గ్రామం ఎవి నగరంలో కూడా వైసిపి విజయం సాధించింది. తాజాగా ఎన్నికలు జరగకుండానే తుని మున్సిపాలిటీ లోని 30 వారుల్లో 15 వార్డులను వైసిపి తన ఖాతా లో వేసుకుని చైర్మన్ పదవిని దాదాపు ఖాయం చేసుకుంది. ఈ నేపథ్యంలో యనమల ప్రత్యక్ష రాజకీయ జీవితానికి తెరపడినట్లేనన్న భావన వ్యక్త మవు తోంది .

నాడు జక్కంపూడి... నేడు రాజా...

2004 లో దివంగత మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహనరావు డిసిసి అధ్యకుడిగా వ్యవహరించారు . అదే ఏడాది తుని మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికలో 30 వార్డులకు గాను 30 వార్డులను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. తునిలో రామకృష్ణుడిని రాజకీయంగా దెబ్బ తీసేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరించి, ఒక్కో వార్డును ఒక్కో నాయకుడికి అప్పగించి, అన్ని వార్డుల్లో పార్టీ విజయానికి బాటలు వేశారు. తాజాగా జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో పోలింగ్ జరగకుండానే స్థానిక ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా వైసిపి కి విజయాన్ని ఖాయం చేయడం విశేషం. పంచాయితీ ఎన్నికల్లో కూడా తుని నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని చావు దెబ్బతీసేలా వ్యూహరచన చేశారు. ఆఖరికి యనమల సొంత గ్రామం ఏవి నగరంలో కూడా వైసిపి విజయం సాధించేలా దాడిశెట్టి పావులు కదిపారు.

నిమ్మకాయల, వేగుళ్ల టీడీపీని గెలిపిస్తారా?

గత సార్వత్రిక ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా వైసీపీ హవాలో కూడా పెద్దాపురం నుంచి మాజీ హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మండపేట నుంచి వేగుళ్ల జో గేశ్వరరావు టీడీపీ తరుపున ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. పంచాయతీ ఎన్నికల్లో వీరు పెద్దగా ప్రభావం చూపించకపోయినా మున్సిపల్ ఎన్నికల్లో పెద్దాపురం, సామర్లకోటలో నిమ్మకాయల, మండపేటలో వేగుళ్ల పార్టీ ని విజయ తీరాలకు చేరుస్తారా అన్నది చర్చినీయంగా మారింది. అయితే క్షేత్రస్థాయిలో టీడీపీ గెలుపు పై అనుమానాలు వ్యక్తమవు తున్నాయి. పెద్దాపురం లోమొత్తం 29 వార్డుల్లో పోటీ అనివార్యమైనా 19వ వార్డులో టీడీపీ అభ్యర్థి పోటీకి వెనుకంజ వేయడంతో జనసేన అభ్యర్థికి మద్దతుఇవ్వాల్సి పరిస్థితి ఏర్పడింది. మరో వార్డులో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇక సామర్లకోటలో 31 వార్డులు ఉండగా రెండు వార్డులు వైసీపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. మిగతా 29 వార్డుల్లో పోటీ నెలకొంది.

మండపేటలో ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు పరిస్థితి కూడా ఇందుకుకు భిన్నంగా లేదన్న వాదన వినిపిస్తోంది. మొత్తం 30 వారులకు గాను 10 వార్డుల్లో జనసేన పోటీ చేస్తోంది. దీంతో ఆయా వార్డుల్లో టిడిపి అభ్యర్థుల గెలుపు పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరో వైపు జనసేన పరిస్థితి పంచాయితీ ఎన్నికల ఫలితాల తరహాలో లేదన్న చర్చ జరుగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో పెద్దాపురం, సామర్లకోట, మండపేట మున్సిపాలిటీల్లో అధికార వైసిపి విజయం కోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదన్న వాదన వినిపిస్తోంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp