వైసిపి మొదటి బోణి డొక్కానే

By Phani Kumar Jun. 26, 2020, 08:35 am IST
వైసిపి మొదటి బోణి  డొక్కానే

శాసనమండలిలో అధికార వైసిపి తరపున డొక్కా మాణిక్య వరప్రసాద్ ఏకగ్రీవంగా గెలిచాడు. ఎంఎల్ఏ కోటాలో జరగాల్సిన ఎంఎల్సీ ఎన్నికలో వైసిపి అభ్యర్ధిగా డొక్కా ఒక్కడే నామినేషన్ వేయటంతో గెలుపు ఏకగ్రీవమైపోయింది. టిడిపికి రాజీనామా చేసి వైసిపిలో చేరి మళ్ళీ టికెట్ తెచ్చుకుని గెలిచిన మొదటి వ్యక్తి డొక్కానే. రాజ్యసభ ఎన్నికల్లో పోటి చేసిన టిడిపి మరి ఈ ఎన్నికలో ఎందుకు ఎవరినీ పోటికి దింపలేదో.

రాజ్యసభ ఎన్నికల్లో తల బొప్పికట్టిన అనుభవంతోనే అయ్యుంటుంది ఎంఎల్సీ ఎన్నిక విషయాన్ని అసలు పట్టించుకోలేదు. సరే టిడిపి విషయాన్ని పక్కనపెట్టేస్తే డొక్కా గెలుపులో వైసిపికి ఓ సానుకూలాంశం ఉంది. అదేమిటంటే టిడిపి నుండి రాజీనామా చేసి వైసిపిలో చేరిన డొక్కాకే మళ్ళీ జగన్ టికెట్ ఇచ్చి గెలిపించుకోవటం. నిజానికి కౌన్సిల్ ఎప్పుడు రద్దవుతుందో ఎవరు చెప్పలేకున్నారు. ఎందుకంటే కౌన్సిల్ ను రద్దు చేస్తు అసెంబ్లీ ఏకగ్రీవంగా చేసిన తీర్మానం ఆమోదం కోసం ప్రభుత్వం కేంద్రానికి పంపిన విషయం తెలిసిందే. కరోనా వైరస్ సమస్య లేకపోతే ఈపాటికే శాసనమండలి భవిష్యత్తు తేలిపోయుండేదే.

అయితే ప్రస్తుత పరిస్ధితుల్లో కౌన్సిల్ రద్దు ఎప్పుడు అన్నదే సస్పెన్సుగా మారింది. దాంతో వచ్చిన అవకాశాన్ని ఎందుకు వదులుకోవాలన్న ఉద్దేశ్యంతో జగన్ కూడా ఎన్నికలో పోటి చేయటానికి డిసైడ్ అయ్యాడు. అందుకనే టిడిపిలో ఉండి ఎంఎల్సీగా రాజీనామా చేసి వైసిపిలో చేరిన డొక్కాకే తిరిగి టికెట్ కేటాయించాడు. తమ పార్టీలోకి రాదలచుకుంటే ముందు తమ పదవులకు రాజీనామాలు చేయాల్సిందే అంటూ జగన్ పెట్టిన షరతును డొక్కా ఒక్కడే పాటించాడు. ఎప్పుడైతే డొక్కా మళ్ళీ ఎంఎల్సీగా గెలిచాడో ఇదే విషయంపై టిడిపిలో చర్చ మొదలైనట్లు సమాచారం.

తాము కూడా టిడిపికి+ఎంఎల్సీ స్ధానానికి రాజీనామా చేసేసి వైసిపిలో చేరితే జగన్ మళ్ళీ తమకే టిక్కెట్లిస్తాడా ? అనే చర్చ జరుగుతోందని ప్రచారం మొదలైంది. ఇప్పటికే టిడిపికి పోతుల సునీత, శివనాధరెడ్డి రాజీనామా చేసిన విషయం అందరికీ తెలిసిందే. కౌన్సిల్లో తాజా లెక్కల ప్రకారం టిడిపికి 27 మంది సభ్యులున్నారు. వైసిపికి డొక్కాతో కలుపుకుని పదిమంది, బిజెపికి ఇద్దరు, పిడిఎఫ్ తరపున ఐదుమంది, స్వతంత్రులు ముగ్గురు, నామినెటెడ్ 6 మంది ఉన్నారు. మరో ఆరు స్ధానాలు ఖాళీగా ఉన్నాయి. నిజంగానే ప్రచారంలో ఉన్నట్లు ఎంఎల్సీలు టిడిపికి రాజీనామాలు చేస్తే చంద్రబాబుకు కోలుకోలేని దెబ్బనే చెప్పాలి. మరి డొక్కా గెలుపును ఎంతమంది టిడిపి ఎంఎల్సీలు స్పూర్తిగా తీసుకుంటారో చూడాల్సిందే.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp